బీసీలు తమ వర్గానికే ఓట్లు వేయాలి..బీసీ జేఏసీ చైర్మన్  జాజుల శ్రీనివాస్  గౌడ్  పిలుపు

బీసీలు తమ వర్గానికే ఓట్లు వేయాలి..బీసీ జేఏసీ చైర్మన్  జాజుల శ్రీనివాస్  గౌడ్  పిలుపు

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్  ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా జనరల్  స్థానాల్లో ఎన్నికల బరిలో నిలబడిన బీసీలను గెలిపించాలని బీసీ జేఏసీ నిర్ణయించిందని సంఘం చైర్మన్  జాజుల శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. హైదరాబాద్  సైఫాబాద్ లోని బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

‘బీసీల ఓట్లు బీసీలకే’ వాల్ పోస్టర్ ను రిలీజ్​ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో జరుగుతున్న ఎన్నికల్లో ‘ఓటు మనదే.. సీటు మనదే.., బీసీల ఓటు బీసీలకే’ నినాదంతో బీసీలంతా తమ వర్గానికే ఓటు వేసి భారీ మెజార్టీతో బీసీ బిడ్డలను గెలిపించాలని పిలుపునిచ్చారు.

బీసీల రాజకీయ ఐక్యతను, సామాజిక చైతన్యాన్ని ప్రదర్శించాలని సూచించారు.  ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల తరహాలో మున్సిపల్  ఎన్నికల్లో కూడా బీసీలు అగ్రకులాలను ఓడించి  రాజ్యాధికారానికి పునాదులు వేయాలని విజ్ఞప్తి చేశారు.

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్  జాజుల లింగం గౌడ్, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్  బొల్లెపల్లి స్వామి, వర్కింగ్  చైర్మన్  గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, మాదేశి, రాజేందర్  గంగపుత్ర, గజ్జల సత్యరాజ్  గౌడ్, వెంకటేశ్  గౌడ్, మహేశ్ మేరు, నయనంపల్లి శ్రీనివాస్ గౌడ్  పాల్గొన్నారు.