మా బిడ్డలను తిరిగి ఇయ్యండి..చెరువులో మునిగి చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన బంధువులతో కలిసి రాస్తారోకో

మా బిడ్డలను తిరిగి ఇయ్యండి..చెరువులో మునిగి చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన బంధువులతో కలిసి రాస్తారోకో
  • న్యాయం చేస్తామని మంత్రి అడ్లూరి హామీ

జగిత్యాల టౌన్, వెలుగు: తమ పిల్లలను తిరిగి ఇవ్వాలని చెరువులో మునిగి చనిపోయిన ఇద్దరు స్టూడెంట్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. జగిత్యాల జిల్లా మల్యాలలోని బీసీ హాస్టల్‌‌లో చదువుతున్న టీఆర్ నగర్ కు చెందిన జగన్నాథం సుశాంత్(10), మోర్తాడ్  గ్రామానికి చెందిన వనం విష్ణు(11) సోమవారం చెరువులో మునిగి చనిపోగా, మంగళవారం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. 

ముందుగా జగిత్యాల పాత బస్టాండ్  వద్ద ధర్నా చేశారు. అనంతరం టీఆర్ నగర్–-ధరూర్  కెనాల్  వద్ద రోడ్డుపై బైఠాయించారు. దీంతో కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమ అంగీకారం లేకుండా, సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టం ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు. 

పిల్లలు హాస్టల్  బయటకు వెళ్తుంటే ఎందుకు పట్టించుకోలేదని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు. బాధితులతో అధికారులు చర్చలు జరిపారు. ఒక్కో ఫ్యామిలీకి రూ.25 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనవిరమించారు.

విచారణ జరిపి న్యాయం చేస్తాం: మంత్రి అడ్లూరి

విద్యార్థుల మృతి పట్ల ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  కుమార్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఔట్  సోర్సింగ్  ఉద్యోగం ఇప్పిస్తామని తెలిపారు