మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు.ఆగస్టు 5న ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తూనే... పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు మంత్రి.
పట్టణంలో వేగంగా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను స్థానిక కౌన్సిలర్లు, పురపాలక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మార్నింగ్ వాక్ సందర్భంగా వివిధ వార్డుల్లో పర్యటించిన ఆయన... డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై స్థానిక ప్రజలను అడగి వివరాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అనంతరం చెన్నూరు పట్టణంలోని ప్రసిద్ధ మధున పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సౌకర్యాలు, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు.
ఈ పర్యటనలో భాగంగా చెన్నూరు మండలం బావురావుపేట గ్రామంలో ఇటీవల మరణించిన గ్రామ ఉప సర్పంచ్ దుర్గం లింగమ్మ కుమార్తె సాయిప్రియను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దుర్గం లింగమ్మ అకస్మిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ... కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అన్ని వేళలా అండగా ఉంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా కల్పించారు.
