- మూడు కార్పొరేషన్ల జీవో విడుదల?
- స్పెషల్ ఆఫీసర్లను నియమించే అవకాశం
- ముగ్గురు కమిషనర్లు, ముగ్గురు స్పెషల్ ఆఫీసర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీలో మంగళవారం సాయంత్రం నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన షురూ కానున్నది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీకి సీనియర్ ఐఏఎస్ ను స్పెషల్ ఆఫీసర్ గా, మరొకరిని కమిషనర్గా నియమిస్తారన్న చర్చ నడుస్తోంది. అలాగే, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ జీవో రిలీజ్చేసి వీటికి కూడా ఇద్దరు కమిషనర్లు, ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నట్టు సమాచారం. మరోవైపు మూడు కార్పొరేషన్లకు ఒక్కరే స్పెషల్ఆఫీసర్ను నియమించి..ముగ్గురు కమిషనర్లను నియమిస్తారని కూడా అంటున్నారు. మూడు నెలల తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.
జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ ఎవరు ?
జీహెచ్ఎంసీకి కమిషనర్గా ప్రస్తుతం కర్ణన్కొనసాగుతున్నారు. ఆయనను స్పెషల్ఆఫీసర్ను చేసి, కమిషనర్గా వేరే వారిని నియమించడమో..లేక ఓ సీనియర్ఐఏఎస్ను స్పెషల్ఆఫీసర్గా నియమించి కర్ణన్ ను కమిషనర్గా కొనసాగిస్తారన్న ప్రచారమూ సాగుతోంది. మరోవైపు కర్ణన్బదిలీ కూడా ఉంటుందన్న చర్చ నడుస్తోంది. ఇక సైబరాబాద్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గా ఉన్న సృజన, మల్కాగిజిరి కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గా కొనసాగుతున్న వినయ్ కృష్ణారెడ్డిలకు కొత్త కమిషనర్లుగా నియమించే అవకాశముంది. ఈ రెండు కార్పొరేషన్లకి మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు స్పెషల్ ఆఫీసర్లుగా వస్తారు.
ఆస్తులు, అప్పుల విభజన
మూడు కార్పొరేషన్ల విభజన తర్వాత ఆస్తులు, అప్పుల పంపకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అప్పుల విషయానికి వస్తే బీఆర్ఎస్ హయాంలో జీహెచ్ఎంసీ రూ.6530 కోట్ల అప్పు తీసుకుంది. ఎస్ఆర్డీపీ కోసం రూ.4,250 కోట్లు, సీఆర్ఎంపీ కోసం 7.20 శాతం వడ్డీతో రూ.1460 కోట్లు, ఎస్ఎన్డీపీ కోసం రూ.680 కోట్లను 7.20 శాతం వడ్డీతో, జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్లకోసం రూ.140 కోట్ల హడ్కో లోన్తీసుకుంది.
ఇందులో రూ.100 కోట్లను 8.90 శాతం వడ్డీతో తీసుకోగా, రూ.40 కోట్లను 9.90 శాతం వడ్డీతో తీసుకున్నది. ఈ అప్పులకు ప్రతి నెల రూ.100 కోట్లను కడుతున్నారు. కాంగ్రెస్సర్కారు వచ్చాక వడ్డీతో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తుండడంతో ప్రస్తుతం అప్పులు రూ.4876 కోట్లకు చేరుకున్నాయి. ఈ అప్పులతో పాటు ఆస్తుల రూపంలో ఉన్న 24 మార్కెట్లలోని 2363 షాపులను మూడు కార్పొరేషన్లకు ఇబ్బందులు లేకుండా పంచనున్నట్టు సమాచారం. కార్పొరేషన్ల ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
నేడు చివరి స్టాండింగ్ కమిటీ సమావేశం
రేపటితో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగుస్తుండడంతో సోమవారం స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 13 అజెండా అంశాలతో పాటు మరికొన్నిటేబుల్ ఐటమ్స్ఆమోదించే అవకాశం ఉంది.
జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఆస్తి పన్ను, ఖాళీ భూమి పన్ను సంబంధిత అధికారాలను అప్పగిస్తూ కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తారా లేదా అన్నది తెలుస్తుంది. అలాగే, అభివృద్ధి పనులు, ఆదాయ వనరుల పెంపు, క్రీడా సదుపాయాల ప్రైవేటు నిర్వహణ వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో స్టాండింగ్ కమిటీ భేటీపై ఆసక్తి నెలకొన్నది.
