- రహవీర్ పథకం ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహకం
- యాక్సిడెంట్లను తగ్గించడమే లక్ష్యంగా స్కీమ్
హైదరాబాద్సిటీ, వెలుగు: రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రహవీర్ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు సహాయం చేసి ప్రాణాలను కాపాడిన సాధారణ పౌరులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాదం జరిగిన సమయంలో ముందుకు వచ్చి సహాయం చేసిన వ్యక్తిని ‘రహవీర్’ గా గుర్తించి ప్రభుత్వం సత్కరిస్తుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
గుడ్ సమారిటన్‌లకు (ఆపద సమయంలో ముందుకు వచ్చి ఆదుకునేవారు) చట్టపరమైన రక్షణ కల్పించి రహవీర్ పథకం కింద 25 వేల రూపాయల నగదు బహుమతిని ఇవ్వనున్నట్టు చెప్పారు. నగదు బహుమతితో పాటు ప్రభుత్వ ప్రశంసాపత్రం కూడా అందజేస్తామని వెల్లడించారు.
రహవీర్ ఎంపిక విధానం
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితునికి సహాయం చేసి ఆసుపత్రికి తరలించిన వ్యక్తి వివరాలను సంబంధిత పోలీసు అధికారి (ఎస్హెచ్ఓ), ఆసుపత్రి అధికారుల ద్వారా రికార్డు చేస్తారు. సంబంధిత పోలీస్ అధికారి జిల్లా కమిటీకి సిఫారసు చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్ చైర్మన్ గా, ఎస్పీ, జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్లు మెంబర్లుగా, జిల్లా రవాణా శాఖ అధికారి కన్వీనర్ గా ఉంటారు. సంబంధిత పోలీసు అధికారి సిఫార్సు ఆధారంగా జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందిన అనంతరం అర్హులైన వ్యక్తులను “రహవీర్” గా ఎంపిక చేస్తారు.రహవీర్ వివరాలను జిల్లా కమిటీ రవాణా కమిషనర్ కు పంపుతారు.
చట్టపరమైన రక్షణ కూడా
సహాయం చేసిన వ్యక్తిని పోలీసు విచారణలు లేదా కోర్టు ప్రక్రియల పేరుతో వేధించరాదని గుడ్ సమారిటన్ చట్టం చెబుతోంది. అలాంటి వారికి పూర్తి చట్టపరమైన రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు ఎవరైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చూస్తూ ఉండకుండా, భయపడకుండా ముందుకు వచ్చి సహాయం చేయాలని రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది.
