బీఆర్ఎస్ కు నిర్వాసితుల టెన్షన్..హరీశ్రావును అడ్డుకునేందుకు సిద్ధమైన బాధితులు

బీఆర్ఎస్ కు నిర్వాసితుల టెన్షన్..హరీశ్రావును అడ్డుకునేందుకు సిద్ధమైన బాధితులు
  • గజ్వెల్​ మున్సిల్​ ఎన్నికలపై  ప్రభావం చూపే అవకాశం

సిద్దిపేట, వెలుగుః గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాల్టీలో  బీఆర్ఎస్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. మొట్టమొదటిసారి మల్లన్న సాగర్ నిర్వాసితుల ఆగ్రహావేశాలు  ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.  ఇంతకు ముందు ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్ ఎన్నికల సందర్భంగా  సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వస్తున్న    నిర్వాసితులు మున్సిపోల్స్ లో మాత్రం తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.    రెండు రోజుల కింద ఆర్ అండ్ ఆర్ కాలనీ లో బీఆర్ఎస్ అభ్యర్థులకు  మద్దతుగా హరీశ్​రావు   ప్రచారానికి వస్తున్నాడని తెలిసి  అడ్డుకునే ప్రయత్నం చేశారు.  గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో  20 వార్డులుండగా నిర్వాసితులు నివసించే ఆర్ అండ్ ఆర్ కాలనీలో మొత్తం ఆరు వార్డులున్నాయి.  దాదాపు 13 వేల మంది ఓటర్లున్నారు. ప్రస్తుతం నిర్వాసితుల ఆగ్రహావేశాలు చూస్తుంటే  బీఆర్ఎస్ కు  గడ్డు పరిస్థితి తప్పదన్న అభిప్రాయం నెలకొంది.

  మల్లన్న సాగర్ రిజర్వాయర్ తో నిర్వాసితులైన తొగుట, కొండపాక మండలాల వారిని  గజ్వేల్ మున్సిపాల్టీ పరిధిలోని సంగాపూర్, ముట్రాజ్ పల్లి లో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీనికి ఐదేండ్ల కింద  తరలించారు. అయితే  పూర్తిస్థాయిలో  పరిహారాలు అందజేయకపోవడంతో నిర్వాసితులు  ఐదేండ్లుగా కండ్లు కాయలు కాచేలా  ఎదురు చూస్తున్నారు.   ముంపు గ్రామాల ప్రజలకు  ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ. 7.5 లక్షలు,  ఇల్లు లేదా ఓపెన్ ప్లాట్ తో పాటు మరో ఐదు లక్షలు ఇవ్వాల్సిఉండగా.. కొందరికీ ఇప్పటివరకు అందలేదు.

దీంతో పెండింగ్ పరిహారాలతో పాటు కాలనీలో  గుడి , బడి, అంగన్ వాడీ కేంద్రాలు, స్మశాన వాటిక లేక పోవడం  సమస్యగా మారింది.   బీఆర్ఎస్ హయాంలో పరిహారం, మౌలిక సౌకర్యాల కోసం రూ. వంద కోట్లు   మంజూరు చేస్తున్నట్టు ప్రకటించినా రూపాయి విడుదల కాలేదు.   దీంతో మున్సిపల్ ఎన్నికల  సందర్భంగా నిరసన గళం విప్పారు.  ఎన్నికల సమయంలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చి తరువాత మరచిపోతున్నారని,  స్థానిక ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ కూడా తమను పట్టించుకోవడంలేదని ఆగ్రహంతో ఉన్నారు.

 దీనికి తోడు కాంగ్రెస్ నేతలు నిర్వాసితులకు మద్దతుగా నిలవడంతో నిర్వాసిత కాలనీలో ప్రచారానికి రావాల్సిన  హరీశ్​రావు  వెనుదిరిగిపోవాల్సివచ్చింది. నిర్వాసితులే ఉన్న  7,8,9,10,11,12 వార్డుల్లో   బీఆర్ఎస్ అభ్యర్థులకు చుక్కెదురు కానుంది.  రెండు రోజుల క్రితం నిర్వాసితులు బీఆర్ఎస్ కార్యకర్తలపై చెప్పులు విసిరారు. ఈ వార్డుల్లో కారుకు తిప్పలు తప్పవని, మాజీ సీఎం సొంత నియోజకవరగ్ంలో మున్సిపాలిటీలో వ్యతిరేక ఫలితం వస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని గులాబీ నేతలు భయపడుతున్నారు.