సాధారణంగా నేను క్రికెట్చూడను. మన ‘చిర్రగోనె’ను బ్రిటిష్ వాళ్లు క్రికెట్గా మార్చుకుని ఆడుతున్నారు. ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత బెర్నార్డ్‌షా... ఆ ఆటను ‘పదకొండు మంది ఫూల్స్ ఆడుతుంటే.. పదకొండు వందల మంది ఫూల్స్చూస్తుంటారు’ అన్నది చదివాక క్రికెట్ పట్ల నాకు ద్వేషం కలిగింది. చిన్నప్పుడు ఊళ్లో ఇదే ఆటను చిర్రగోనె అని మేం ఆడేవాళ్లం. కానీ, దానికి ఈ హంగామా ఉండది. కానీ, ముంబయిలో సెమీఫైనల్లో ఒక యంగ్ ఉమన్ హీరో జెమీమా రోడ్రిగ్స్ ఏడుసార్లు ‘వన్డే వరల్డ్‌కప్’ను గెలుచుకున్న ఆస్ట్రేలియా ఆడ టీమ్ను ఓడించిన తీరు నన్ను ఆడవాళ్ల క్రికెట్ అభిమానిని చేసింది.
127 పరుగులు చేసి అవుట్ కాకుండా ఆమె ఈ దేశ ప్రతిభను చాటిన తీరు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది! అక్కడ మన జట్టు ఓడిపోయి ఉంటే మళ్లీ ఆస్ట్రేలియానే కప్ తీసుకునిపోయేది. ఈ అమ్మాయి ఈ దేశంలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న క్రిస్టియన్కుటుంబంలో పుట్టింది. ఆమె ఆ మతానికేకాక దేశానికి, ముఖ్యంగా 70 కోట్ల అసమాన జీవితాలు గడుపుతున్న స్త్రీలకు మునుపెన్నడూ లేని ధైర్యాన్ని, గౌరవాన్ని అందించింది.
నన్ను అబ్బురపర్చిన మరో అంశం టీంకెప్టెన్హర్మన్ ప్రీత్ కౌర్. ఈ అమ్మాయి ఇంతకుముందు ఒక వరల్డ్ కప్ ఆటలో 171 రన్స్ చేసి అవుట్ కాకుండా ఈ దేశానికి గర్వకారణమైంది. ఈమె సిక్కు మతస్తుల బిడ్డ. ఆమె ఆ మతానికి గర్వకారణం కాదు. ఈ దేశానికి, ముఖ్యంగా ఈ దేశ స్త్రీలందరికీ. ఈ కౌర్ నవంబర్2న తన అద్భుత నాయకత్వం ద్వారా టీమ్ను విజయపథానికి నడిపించింది. ఈ టీంలో వివిధ మతాల, కులాల ఆడపిల్లలు ఉన్నారు. ఎవరి కులం ఏమిటో మనం చెప్పలేం. ఒక్క దీప్తీ శర్మ, షఫాలీ వర్మ తప్ప! ఈ అమ్మాయిలంతా ఒక ఆర్గనైజ్డ్ జట్టుగా ఆడి దేశానికి ముఖ్యంగా ఈ స్త్రీలందరికీ, మరీ ముఖ్యంగా స్కూళ్లల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చదువుతూ ఆటల రంగాల్లో ఎదగాలనుకునే అమ్మాయిలందరికీ ఎనలేని ధైర్యాన్ని, టీం స్పిరిట్‌ను, హుందాతనాన్ని అందించారు.
స్త్రీల ఆటల స్థితి
ఈ దేశంలో వేల ఏండ్లు స్త్రీలకు, మత విలువలు, కుల విలువలు, పురుషాధిక్యత వల్ల పురుషులతో సమానంగా, బాహాటంగా ఆట ఆడేహక్కు లేదు. మహా అయితే డ్యాన్స్ చేయడం, ముగ్గులు వేయడం, వంట పోటీలు తప్ప. రాచరికాల్లో గానీ, బ్రిటిష్ వలస పాలనలోగానీ ఈ విలువలు పెద్దగా మారలేదు. ముస్లిం రాజులు పరిపాలించక ముందు హిందూ రాజులు పరిపాలించినా స్త్రీల పరిస్థితి చాలా దారుణంగా ఉండింది. ముస్లిం రాజులొచ్చాక స్త్రీలు ఏ మతస్తులైనా, అగ్రకులాలు, పాలకవర్గాల్లోనూ బయటకు కూడా వెళ్లలేని గృహ బందిఖానా జీవితమే గడిపారు. శ్రామిక కులాల్లో స్త్రీలు కొన్ని ఆటలు, పాటలు ప్రకృతిలో పనిచేసేటప్పుడు ఆడుకోవడం, పాడుకోవడం ఉండేది. కానీ, వారి ప్రపంచం వారి గ్రామం లేదా చిన్న చిన్న తండాలు మాత్రమే. వారి జీవితాలకు బయట ప్రపంచం గుర్తింపు లేదు. రచనా రంగంలో వారి గురించి రాసిన మేధావే లేడు. వారు, స్వయంగా మేధావులయ్యే అవకాశం లేదు. నా చిన్నతనంలో గ్రామీణ యువతులు, కోలాటం, పిల్లల ఆటలుగానీ, ఆడపిల్లల ఆటలుగానీ టీం ఆటలే. ఒంటరి ఆటలు తక్కువ.
పని.. పాట, ఆట
‘పనిపాట లేనోళ్లు. వాళ్లకేమీ ఆడుడా, పాడుడా’ అనే సామెతలు.. దొరోళ్ల స్త్రీ, పురుషుల గురించి ఊరిజనం మాట్లాడుకోంగ నేను ఎన్నోసార్లు విన్నాను. బతుకమ్మ, కోలాటం వారి వ్యవసాయ పనితనంలో పుట్టాయి. ముగ్గుల పోటీలు అలంకరణ ఆటలో పుట్టాయి. కానీ, నేను చిన్నప్పుడు తొలకరి రోజుల్లో మైదానంలో చిర్ర గోనె ఆడినప్పుడు మా ఊరి ఆడపిల్లలు చిర్రగోనె ఆడగా చూడలేదు. గ్రామాల్లో చిర్రగోనె ఇప్పటి క్రికెట్‌కు తల్లి ఆట. చిర్రను గోనెతో ఒక ఆటగాడు కొట్టడం అవతలి జట్టువాళ్లు గుత్తపట్టి ఆ ఆటగాణ్ని అవుట్ చేయడం దాని లక్షణం. చిర్రగోనె జట్టు మొత్తం అవుట్ అయ్యాక, గుత్త జట్టు చిర్ర చిమ్మాడు బద్దికి రావడం, అందులో గెలుపు ఓటములు నాకు తెలుసు. అమ్మాయిలు ఈ ఆటకు వచ్చేవాళ్లు కాదు. వాళ్లని రానిచ్చేవారు కాదు వారి కుటుంబీకులు.
మన ఆడ క్రికెటర్లు సాధించిన మార్పు
ఎన్నో ఏండ్లు ఆడిన ప్రపంచ దేశాల అమ్మాయిలతో మన అమ్మాయిలు ఆడి గెలిచి ప్రపంచ ఖ్యాతిగాంచారు. వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు. స్వాతంత్ర్యం తరువాత మన రాజ్యాంగం స్త్రీ, పురుషులకు ఇచ్చిన సమాన హక్కుల సంపత్తి ఇది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారంలోకి వచ్చాక స్త్రీల విషయంలో కొంతమార్పు కనపడుతున్నది. క్రికెట్ గేమ్‌లో మగ క్రికెటర్లకు, ఆడ క్రికెటర్లకు పేమెంటులో చాలా తేడా ఉండేది. అది ఇప్పుడు మారింది. సమాన పేమెంటు ఇవ్వడం, అంతర్జాతీయ పోటీలలో స్త్రీ ప్లేయర్లకు సమాన సౌకర్యాలు కల్పించడం చాలా మంచి పని.
ఇంతకుముందు దేశాన్ని వేరే పార్టీలు.. కాంగ్రెస్ తదితర పార్టీలు పాలిస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రాచీన సంప్రదాయం పేరుతో స్త్రీ స్వేచ్ఛను నిరంతరం వ్యతిరేకించేవారు. వాలంటైన్ డే రోజు అబ్బాయిలు, అమ్మాయిలను నానాయాతన పెట్టేవారు. కానీ, వారు అధికారంలోకి వచ్చాక ఆ పద్ధతి మార్చుకున్నారు. కంగనా రనౌత్ వంటి స్త్రీ స్వేచ్ఛావాదులను ఆ పార్టీలో చేర్చుకుని ఎంపీని కూడా చేశారు.
స్మృతి మంధాన గేమ్ గెలిచాక ఆమె బాయ్‌ఫ్రెండుతో ఎంత స్వేచ్ఛగా కౌగిలించుకుని గెలుపును పంచుకుందో ప్రపంచమంతా చూసింది. వారి స్వేచ్ఛను మనందరం ఆనందించాం. ఆమెకు పెండ్లి అయిందా కాలేదా మనకు అనవసరం. గౌరవప్రదంగా బతికే హక్కు ఆమె సొంతం. స్త్రీల ఆటలు స్త్రీలకు జీవినవిధానంలో, డ్రెస్‌కోడ్‌లో, హెయిర్ స్టైలులో చాలా మార్పులు తెస్తాయి. ఆ మార్పులు ఈ లేడీ హీరోలలో చూడొచ్చు.
మంచి బౌలర్లు వెంట్రుకలు అడ్డుపడకుండా హెయిర్ కట్‌చేసుకొని స్త్రీ, పురుష తేడాలేని డ్రెస్‌వేసుకుని ఎంత బాగా స్టేడియంను తమ పరుగుతో, బ్యాటింగ్‌తో, బాల్ క్యాచింగ్‌తో, విపరీతమైన స్పీడ్రన్నింగ్తో చూసేవారికి కన్నుల పండుగ జరిపారు. ఆ స్టేడియంలో క్రికెట్ఆడుతున్నది ఆడవాళ్లా, మగవాళ్లా మనకు తేడా తెలియదు. నాలాంటి యాభై దశకంలో పుట్టినోళ్లకు అది ఊహించని మార్పు. ఇది స్త్రీలు పురుషులతో అన్ని రంగాల్లో సమానత్వంతో పోరాడిన పోరాటాల ఫలితం.
ప్రధానమంత్రితో ఆడ హీరోలు
ఈ ఆడ హీరోలు ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసి మాట్లాడినప్పుడు వాళ్ల కాన్ఫిడెన్స్, ధైర్యం కొట్టొచ్చినట్టు కనపడింది. యావత్ దేశమే కాకుండా, దేశ పాలకులు వారిని గౌరవించడం చాలా అవసరం. దేశంలోని ఆడపిల్లలు అడ్డంకులను అధిగమించి పెద్ద పెద్ద అభివృద్ధి కలలు కనడానికి, వాటిని సాధించడానికి ఉపయోగపడుతుంది. అయితే, ప్రధానమంత్రి ఒక్క దీప్తీశర్మ జైశ్రీరాం ఇన్స్టాగ్రామ్, ఆంజనేయ టాటూ చాలా అసందర్భంగా బయటకుతీసి ఒక మత మద్దతుదారు ధోరణి కనపర్చారు. అక్కడ గురునానక్‌ను, గురుగ్రంథ్ సాహిబ్‌ను ఆరాధించే సిక్కు కుటుంబాల నుంచి వచ్చిన కెప్టెన్, బ్రహ్మాండమైన బౌలర్ అమర్‌జ్యోత్ కౌర్‌లు ఒక సిక్కు కార్పెంటర్ కుటుంబం నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.
హుందాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశం
జెమీమా రోడ్రిగ్స్ క్రిస్టియన్ కుటుంబంలో పెరిగింది. ఆమె 127 రన్స్‌చేసి ఆస్ట్రేలియాను ఓడించింది. జీసెస్ ఇచ్చిన ధైర్యంతో అని గెలిచిన ఉత్సాహంలో అన్నందుకు ట్రోల్స్‌కు గురైంది. ఆమె పోరు ఆట లేకపోతే మన టీం ఆస్ట్రేలియాను ఓడించలేకపోయేది. అక్కడే ఓడిపోతే మన దేశమే నిరాశకు గురయ్యేది. ప్రధాని తన మీటింగ్‌లో తనంతట తాను దీప్తిశర్మను అడిగి ఆమె మత దైవాలు ఇచ్చిన ధైర్యం గురించి అడిగినప్పుడు ఇతర మతస్తుల ధైర్యం గురించి కూడా అడగాలి కదా. ఒక దేశ ప్రధానిగా అసలు మతాలకు సంబంధిత చర్చ అనవసరం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చాలా హుందాగా సమావేశం ఏర్పాటు చేయించి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆ క్రికెట్హీరోలు తమ అనుభవాలు ఇంగ్లిష్‌లో, హిందీలో వివరించారు. ఏది ఏమైనా మన క్రికెట్ హీరో స్త్రీజట్టు క్రికెట్‌ను చిర్రగోనె ఆడినట్టు ఆడి ప్రపంచమంతటా శభాష్ అనిపించుకున్నారు. ఈ దేశానికి గర్వకారణమయ్యారు. వాళ్లు మునుముందు ఇంకా కప్పులు గెలవాలని ఆశిద్దాం.
ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
