ఆ దంపతులకు మూడో సంతానం కూడా ఆడపిల్లే. అది వారికి నచ్చలేదు. వద్దనుకున్నారు. భారంగా భావించి బేరం పెట్టేశారు. పుట్టిన బిడ్డను ఓ వ్యక్తి మూడు లక్షలకు కొనేసుకున్నాడు. భాగ్యనగరాన్ని ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో జరిగింది ఈ ఘటన. లాల్ సింగ్ తండాలో వెలుగు చూసిన ఈ ఉదంతంలో... సామాజికంగా ఎన్ని మార్పులొస్తున్నా ఆడపిల్లను బరువుగానే చూస్తున్న విషయం మరోసారి బయటపడింది. షాద్ నగర్ బస్టాండ్లో పసికందును అమ్మేశారు. కొత్త సంవత్సరంలో అమ్మానాన్నల చెంత ఉండాల్సిన పాప డిసెంబరు 31 న అమ్ముడుపోయింది.
కేశంపేటకు చెందిన ఓ వ్యక్తి మూడు లక్షలకు కొన్నాడు. బిడ్డను అక్కడి నుంచి అత్తాపూర్ తీసుకువెళ్ళాడు. అక్కడ నివాసం ఉండే కుటుంబానికి అమ్మేశాడు. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు అమ్ముడుపోయింది. చివరికి ఏదోలా విషయం బయటపడింది ఆ తర్వాత పోలీసులు, అధికారులు రంగప్రవేశం చేశారు. తంతు మామూలే. ప్రస్తుతం బిడ్డ హైదరాబాద్లోని శిశువిహార్లో ఉంది. తల్లిదండ్రుల దగ్గర లేకుండా పోవడానికి కారణం ఆడపిల్లగా పుట్టడమే. ఆడపిల్ల అంటే ఎందుకింత చులకన?
తరాలు మారినా కొందరు ఆడపిల్లల తలరాత మారడం లేదు. కొంత నయం అని చెప్పుకోవడం తప్ప సమాజంలో ఆశించిన మార్పు
ఇప్పటికీ రాలేదు. ఆడపిల్ల ఆవిరైపోతున్న సంఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. ప్రాణం పోసుకున్నా అదెంతసేపు ఉంటుందో తెలియనంత పరిస్థితి ఈ నాటికీ అక్కడక్కడా వెలుగుచూస్తూనే ఉంది. లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్ల అని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా గర్భంలోనే చంపేస్తున్న ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి. దాడులు, అత్యాచారాలకు అడ్డే లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.
మరెన్నో ఎవరికీ తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోతున్నాయి. బాలిక అంటే భారంగా భావించేవారు నేటికీ ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో కొంతవరకూ మెరుగుపడినా గ్రామీణంలో బాలికల పరిస్థితి దయనీయంగానే ఉంది. 21వ శతాబ్దంలోనూ వివక్ష కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగించే అంశమే . అసలు సమాజమే ఇంకా ఆడ, మగ తేడాను చూపడం అర్థంకాని విషయం. దీన్నుంచి బయటపడుతుందన్న నమ్మకం నానాటికీ సడలిపోతోంది. ఇంట్లోనే లింగ వివక్షకు పునాది పడటం మరింత దారుణం. భవిష్యత్తు తరాలు మనుగడ సాగించాలంటే ఆడపిల్లకు జన్మ ఇవ్వాలి. వారిని ఎదగనివ్వాలి.
విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు
విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదు. పట్టనట్టే ప్రవర్తిస్తోంది. కొంతమంది ఆడపిల్ల అని తెలిసి అబార్షన్లకు తెగబడుతున్నా, అది తెలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తోంది. డబ్బుకు ఆశపడి కొన్ని స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల యాజమాన్యాలు చేస్తున్న అడ్డగోలు, కక్కుర్తి పనులను ఆపలేకపోతున్నారు. స్కానింగ్ సెంటర్ల ముసుగులో కాసులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు మరికొందరు. హైదరాబాద్ నగరంలో అనుమతులు లేకుండా స్కానింగ్ సెంటర్లు నడుస్తున్న విషయాన్ని ఇటీవల అధికారులు గుర్తించారు.
నాంపల్లి, జియాగూడ, ఆసిఫ్ నగర్, మెహదీపట్నం, బహుదూర్పు తదితర ప్రాంతాల్లో అనుమతి లేని స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తూ అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ గణాంకాల ప్రకారం చూస్తే వివక్ష ఫలానా కులంలోనే ఎక్కువగా ఉందని చెప్పలేం. అన్ని కులాల్లోనూ ఈ జాడ్యం ఉందని అర్థమవుతోంది.
మహిళ లేకపోతే సృష్టే ఉండదు
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో 36.93 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 20.05 లక్షలు కాగా బాలికలు 16.88 లక్షల మంది ఉన్నారు. ఇంకా వివరంగా చెప్పాలంటే సుమారు 3.5 లక్షల మంది బాలురు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ బడుల్లో మొత్తానికి 25.08 లక్షల మంది చదువుతున్నారు. ఇందులో అబ్బాయిల సంఖ్య 11.64 లక్షలు కాగా అమ్మాయిల సంఖ్య 13.43 లక్షలుగా ఉంది. విద్యార్థులతో పోలిస్తే విద్యార్ధినుల సంఖ్య 2.3 లక్షల మంది ఎక్కువగా ఉన్నారని తేలింది. గురుకులాల్లో బాలికలు ఎక్కువ మంది చదువుతున్నారు. మగ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో, ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పరిమితం చేయడం కొన్ని కుటుంబాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రోత్సాహకాలు అందిస్తున్నా... ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు. విస్తుపోయే నిజాలెన్నో బయటపడుతూనే ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో లింగ వివక్షకు సంబంధించి కొంతమార్పు వచ్చింది. అలాగని పూర్తిగా మాయమైందని చెప్పడానికి ఆస్కారం లేదు. ఆడపిల్లలపై దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ లాంటివే దీనికి ఉదాహరణ.
పెంపకంలో వివక్ష, ఉద్యోగ అవకాశాల్లో వివక్ష, ఆఖరికి వివాహ విషయంలోనూ వివక్ష తప్పడం లేదు. మహిళ లేకపోతే గమనం లేదు. సృష్టిలో జీవమే లేదు. అసలు సృష్టే ఉండదు. అమ్మకోసం, సోదరి కోసం, భార్య కోసం ఆడపిల్లను రక్షించుకోవాలి. నిజానికి లింగ వివక్షకు మూలం సమాజంలోనే ఉంది. మనమే సమాజం. తప్పంతా మనలోనే. సామాజిక వ్యవస్థ ఈ దారుణానికి ఒడిగడుతోందన్న విషయం సుస్పష్టం. ఆడపిల్లను కన్నందుకు కుటుంబం, సమాజం మహిళలనే నిందించడం అంతుబట్టని విషయం.
- జి. యోగేశ్వరరావు,
జర్నలిస్ట్
