పెట్టుబడుల గ్రౌండింగ్ స్పీడప్

పెట్టుబడుల గ్రౌండింగ్ స్పీడప్
  • ఎంఓయూలను వేగంగా కార్యరూపంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు
  • అమలు పర్యవేక్షణకు ప్రత్యేకంగా ‘రియల్ టైమ్ డాష్ బోర్డు’
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి వెల్లువలా వస్తున్న పెట్టుబడులను సత్వరమే కార్యరూపంలోకి తెచ్చేందుకు (గ్రౌండింగ్) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో రూ.8.81 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ క్రమంలో ఆయా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంఓయూలు) కాగితాలకే పరిమితం కాకుండా వేగంగా పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒప్పందాల అమలు బాధ్యతలను ‘స్పీడ్’ విభాగానికి అప్పగించింది. 

పెట్టుబడుల గ్రౌండింగ్  ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన రియల్ టైం డాష్ బోర్డును ప్రభుత్వం రూపొందిస్తోంది. వివిధ కంపెనీలు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించడానికి ఇది కీలకంగా మారనుంది. ఏ దశలోనైనా అనుమతులు ఆగినా, సమస్యలు ఎదురైనా తక్షణమే గుర్తించి పరిష్కరించేందుకు ఈ డాష్ బోర్డు ఉపయోగపడనుంది. పెట్టుబడుల గ్రౌండింగ్  ప్రక్రియలో వివిధ శాఖల మధ్య ఫైళ్ల కదలికలో ఆలస్యం జరగకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

 ప్రతి ప్రభుత్వ శాఖలోనూ పెట్టుబడుల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని ‘సింగిల్ పాయింట్  ఆఫ్  కాంటాక్ట్’ గా నియమించాలి. ఈ అధికారి పెట్టుబడులకు సంబంధించిన అనుమతులు, క్లియరెన్సుల బాధ్యతలను మాత్రమే చూస్తారు. స్పీడ్  విభాగంతో నిత్యం సమన్వయం చేసుకుంటూ, ఆయా శాఖల పరిధిలోని సమస్యలను వీరు పరిష్కరిస్తారు. దీనివల్ల పారిశ్రామికవేత్తలు వివిధ ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా, సులభతర వాణిజ్యానికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రెండేళ్లలో వచ్చిన రూ.8.81 లక్షల కోట్ల పెట్టుబడులు వేగంగా గ్రౌండింగ్  అయితే, రాష్ట్రంలో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.