దీదీని వకీలుగా మార్చిన ఎస్ఐఆర్!

దీదీని వకీలుగా మార్చిన ఎస్ఐఆర్!

పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు, బూత్ లెవల్ అధికారులపై అసాధారణ పని ఒత్తిడి, ఆ ఒత్తిడితో వారు ప్రాణాలు కోల్పోతున్నారన్న ఆరోపణలు ప్రజాస్వామ్యాన్ని ఆలోచింపజేసే అంశాలు. ఈ మొత్తం వ్యవహారం చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం వేదికకు చేరడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. 

భారత చరిత్రలోనే తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సుప్రీంకోర్టులో తన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం వాదనలు వినిపించడం సాధారణ విషయం కాదు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఈ ప్రయత్నం రాజకీయ వ్యూహంగా మాత్రమే చూడలేం. అది ఒక ముఖ్యమంత్రి తన రాజ్యాంగ బాధ్యతను గుర్తుచేసుకున్న సందర్భంగా భావించాల్సి ఉంటుంది. “నేను పార్టీ కోసం కాదు, రాష్ట్ర ప్రజల ఓటు హక్కుల కోసం పోరాడుతున్నాను” అని ఆమె చేసిన వ్యాఖ్య రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యానికి చేసిన ప్రకటనగా నిలిచింది.

ఐదు నిమిషాలు చాలు అని కోరిన మమతకు ధర్మాసనం పదిహేను నిమిషాల సమయం ఇవ్వడం, ఆమె వాదనలను శ్రద్ధగా వినడం, ఈ వ్యవహారానికి న్యాయస్థానం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో సూచిస్తుంది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు,  పిటిషనర్లు పెద్ద సంఖ్యలో చేరడం, ఒక  సీఎం స్వయంగా వాదనలు వినిపిస్తున్న దృశ్యం దేశ ప్రజాస్వామ్యానికి ఒక ప్రత్యేక క్షణం. తన వాదనల్లో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగానే ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ను “వాట్సాప్ కమిషన్”గా అభివర్ణించడం, కీలక నిర్ణయాలు అధికారిక మార్గాల ద్వారా కాకుండా అనధికారిక సందేశాల ద్వారా వస్తున్నాయన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి.  

ఒక  రాజ్యాంగ సంస్థ పనితీరుపై ఈ స్థాయి ఆరోపణలు రావడం సహజంగా పరిగణించదగ్గ విషయం కాదు. అదే సమయంలో ఆ ఆరోపణలను పూర్తిగా విస్మరించలేం కూడా.  ఎందుకంటే  ఎన్నికల కమిషన్‌పై ప్రజల విశ్వాసమే  ప్రజాస్వామ్యానికి  ప్రాణం.

ఎస్​ఐఆర్​కు తగిన సమయం ఇవ్వాలి

ఎస్ఐఆర్ వంటి సమగ్ర సర్వేను సక్రమంగా నిర్వహించాలంటే  సమయం,  ప్రణాళిక, మానవ వనరులు అవసరం. అలాంటి ప్రక్రియను కేవలం మూడు నెలల్లో హడావుడిగా పూర్తి చేయాలని నిర్ణయించడం వెనుక ఉద్దేశ్యాలపై అనుమానాలు సహజం. పండగల సీజన్, వ్యవసాయ పనులు, ప్రజల దైనందిన జీవితం .. ఇవన్నీ ప్రభావితం అయ్యే సమయంలో  ఈ ప్రక్రియను అమలు చేయడం వల్ల ప్రజల భాగస్వామ్యం తగ్గే ప్రమాదం ఉంది. ఓటర్ల జాబితా సవరణ ప్రజలతో కలిసి జరగాలిగానీ, ప్రజలపై రుద్దే విధంగా కాకూడదు. ఈ ప్రక్రియలో బూత్ లెవల్ అధికారులు ఎదుర్కొంటున్న పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుంది. 

ఎన్నికల వ్యవస్థలో బీఎల్‌ఓలు వెన్నెముకలాంటివారు. వారిపై అధిక భారం మోపితే వ్యవస్థే కూలిపోతుంది. పని ఒత్తిడి, వేధింపుల వల్ల వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు నిజమైతే,  అది  అత్యంత  తీవ్రమైన విషయం. ఒక రాజ్యాంగ ప్రక్రియ ప్రాణాలు తీసే స్థాయికి చేరితే, ఆ ప్రక్రియను తక్షణమే పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోవద్దు

ఎన్నికల కమిషన్ తరఫున వచ్చిన వాదనలు, రాష్ట్ర ప్రభుత్వం తక్కువ పనితనం ఉన్న అధికారులను పంపిందన్న ఆరోపణలు, రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖండించడం – ఇవన్నీ వ్యవస్థల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీంకోర్టు స్పందన భారత ప్రజాస్వామ్యానికి భరోసా ఇచ్చింది. “ఏ ఒక్క నిజమైన ఓటరు పేరు కూడా తుది జాబితా నుంచి తొలగిపోకూడదు” అన్న కోర్టు వ్యాఖ్య ప్రజల హక్కులకు రక్షణ కవచంగా నిలిచింది. 

ఇంగ్లిష్ స్పెల్లింగ్ తప్పుల పేరుతో ఓట్లను తొలగించడంపై చేసిన వ్యాఖ్య వ్యవస్థలో మానవీయత ఎంత అవసరమో గుర్తు చేసింది. మమతా బెనర్జీ సుప్రీంకోర్టు వేదికగా చేసిన పోరాటం ఆమె వ్యక్తిగత రాజకీయ శైలికి మించి ఒక సందేశాన్ని ఇస్తుంది.  ప్రజాస్వామ్యంలో నాయకత్వం అంటే అధికారాన్ని ఆస్వాదించడం కాదు, ప్రజల హక్కులు ప్రమాదంలో ఉన్నప్పుడు వాటి కోసం నిలబడటం. ఆమె చర్యలను విమర్శించే ముందు, ఆమె లేవనెత్తిన  ప్రశ్నలు ప్రజాస్వామ్యానికి ఎంత ముఖ్యమో ఆలోచించాల్సిన అవసరం ఉంది.

చరిత్రలో గుర్తుండిపోయే ఘట్టం

ఈ కీలక సమయంలో సుప్రీంకోర్టు పోషిస్తున్న పాత్ర భారత రాజ్యాంగ బలానికి,  న్యాయవ్యవస్థ స్వతంత్రతకు మరోసారి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా న్యాయస్థానం ముందుకు రావడం రాజ్యాంగ ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయన్న విశ్వాసాన్ని కలిగిస్తోంది. న్యాయవ్యవస్థ కేవలం చట్టాల వ్యాఖ్యాత మాత్రమే కాదు. ప్రజాస్వామ్య రక్షకుడిగా కూడా వ్యవహరిస్తుందన్న సత్యాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.  

అదే సమయంలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా తన రాష్ట్ర ప్రజల ఓటు హక్కుల కోసం కోర్టు మెట్లెక్కడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో గుర్తుండిపోయే ఘట్టం. అధికారంలో ఉండి మౌనం వహించడం సులభం. కానీ  ప్రజల పక్షాన నిలబడి పోరాడటం నిజమైన నాయకత్వానికి గుర్తు. ఈ సంఘటన ‘లీడర్’ అంటే కేవలం అధికారం అనుభవించే వ్యక్తి కాదని,  ప్రజల హక్కుల కోసం నిలబడే వ్యక్తేనని దేశానికి గుర్తుచేసింది.

- మన్నారం నాగరాజు