మనదేశంలో వంటిల్లే మొదటి సైన్స్ ల్యాబ్

మనదేశంలో వంటిల్లే మొదటి సైన్స్ ల్యాబ్

భారతదేశంలో  ఆధునిక సైన్స్​ బాగా వెనకబడి ఉన్నది అనేది ఒక వాస్తవం.  మనం  చాలా రకాల  సైన్స్​ వస్తువులను  ఇప్పుడు  దిగుమతి  మాత్రమే చేసుకుంటున్నాం. పెన్ను దగ్గరి నుంచి సెల్​ఫోన్​, ఏరోప్లేన్​ అన్ని జ్ఞాన ప్రక్రియలో  మనం  యూరప్,  అమెరికా దేశాల కంటే  వెనుకబడి  ఉండి  దిగుమతి  చేసుకుంటూ వచ్చినవే.  ఇందుకు కారణం మన దగ్గర విద్య కుల కట్టుబాటుతో ఉండటం,  దేశం చాలాసార్లు  విదేశస్తుల చేతుల్లో ఉండటం వంటివి మనం చదువుతూనే ఉంటాం.   

కానీ, సైన్స్​,  సైంటిఫిక్​  ల్యాబరేటరీ వంటి పదాలకు మనం  ఒక  కొత్త  నిర్వచనంలోకిపోతే ఈ దేశంలో  మౌలిక సైన్స్​ మిగతా దేశాల కంటే చాలా ప్రాచీన దశనుంచి అమలులో ఉంటుంది. ఆ సైన్స్​ గురించిగాని, ఆ సైన్స్​ ఆచరణలో పెట్టిన ల్యాబ్​ల గురించిగాని ఎవ్వరూ రాయలేదు. దానిమీద చర్చ జరగలేదు. అందుకు కులబందీ అయిన విద్యతోపాటు  పురుష దురహంకార  సామాజిక అజ్ఞానం కూడా మరొక కోణం. 

ఈ దేశంలో కిచెన్​ వంట యూరప్​,  అమెరికా వంటి దేశాల కంటే  చాలా ముందుగానే  మొదలైందనేది ఒక చారిత్రక సత్యం. ఆసియా ఖండంలో మానవ నాగరికత యూరపు, అమెరికా వంటి దేశాల కంటే చాలాముందు ప్రారంభమైందని  హరప్పా నాగరికత  మన ​అతి  ప్రాచీన  వ్యవసాయ ఉత్పత్తి ప్రధానమైన ఆధారాలు. అయితే,  మానవ జీవితాన్ని నడిపించే ప్రధాన అంశం మానవులు తినే తిండి. ఈ తిండిని సహజ తిండి నుంచి వంట తిండిగా మార్చినప్పుడే మొట్టమొదటి సైన్స్​ ల్యాబ్​స్టార్ట్​ అయింది.  వంటకు, పంటకు మంచి సైంటిఫిక్​ సంబంధం ఉంది.  ఇక్కడ నమ్మకాలు, మత విశ్వాసాలు అంతగా పనిచేయవు. 

రోజువారీ సైంటిఫిక్​ ఎక్స్​పరిమెంటు, ప్రకృతితో, పదార్థాలతో  సంఘర్షణ  మాత్రమే  పంట  వంటగదికి చేరుతుంది.  వంటగది ఒక ప్రయోగశాలగా పనిచేసింది. కనుకనే మన జీవిత ప్రయాణం సాగింది.   ఇక్కడ మనం మొదటి పిల్లలకు నేర్పాల్సిందేమిటంటే  మనం తినే పదార్థాలు కూడా  కెమికల్సే. అయితే  అవి  మన ఆరోగ్యానికి  హాని కలిగించనటువంటి  కెమికల్స్. వంట ప్రారంభంకాకముందు చెట్టు నుంచి కోసిన పండ్లు, వేటాడిన గొర్రె, మేక, దున్న, బర్రె, ఆవు, ఎద్దు, దుప్పి, పంది మాంసాలను చాలాకాలం మంటల్లో వేసి కాల్చుకుని తిన్నారు మన పూర్వీకులు. అయితే అది వివిధ విటమిన్ల అయిన ఆహారం కాదు. ఏది దొరికితే అది తిన్నప్పుడు దానిలో ప్రోటీన్లు, విటమిన్లు మాత్రమే మానవ శరీరానికి అందేవి. అది మిశ్రమ ప్రొటీన్ల, విటమిన్ల ఆహారం కాదు. 

ధాన్యం పంటకు వంటకు సంబంధం

ధాన్యం పంట మన మన పూర్వీకులు శాస్త్రీయంగా అధ్యయనం చేసి విషంకాని ధాన్యం, మానవులకు అరిగే ధాన్యంను  ప్రత్యేకంగా తయారుచేసిన భూమిలో పండించడానికి పూనుకున్నాక.. వంటకు, పంటకు సంబంధం ఏర్పడింది. అయితే,  భూమి నుంచి మనం నాటిన గింజ తనరూపం కలిగిన ఎన్నో గింజలను చెట్టుగా ఎదిగి పండిస్తుందని ముందు స్త్రీలు కనిపెట్టారు. పురుషులు పంట ప్రక్రియను కనిపెట్టే అవకాశం లేదు. ఎందుకు?  పురుషునికి తన కడుపు నుంచి  మానవులను  కనగలిగే శక్తి లేదు కనుక  తమను  పోలిన శరీరాన్ని తమ కడుపు నుంచి పుట్టే శక్తి స్త్రీకి  మాత్రమే ఉంది.  

ఆ ప్రక్రియను ఆ పంట లేదా పిండం ఎదుగుదల క్రమాన్ని ఆమె మాత్రమే  అర్థం చేసుకోగలదు. పురుషునికి ఆ ప్రక్రియ అర్థంచేసుకోవడం కష్టం. కొత్తను కనిపెట్డడంలో స్వీయ అనుభవం కీలకమైనది.   ధాన్యం పంట మొదలయ్యాక  మాంసంలాగ గింజలను కాల్చితినడం సాధ్యంకాదు. వాటిని ఆరగించుకోవాలంటే ఉడికించి తీసుకోవాలి.  ఇక్కడి నుంచి  కిచెన్  సైన్స్​ప్రారంభంమవుతుంది. 

అతి ప్రాచీనకాలంలో  అంటే నగర నిర్మాణం కంటే ముందే ఈ దేశంలో వంట ప్రక్రియ ప్రారంభమై ఉండకపోతే గ్రామ నిర్మాణం, క్రమంగా పట్టణ నిర్మాణం సాధ్యంకాదు. పంటకు, వంటకు ఒక నిర్దిష్టమైన మానవ జంట జీవనం కూడా అవసరం. జంట జీవనం చేయడం కూడా అవసరం. జంట జీవనం లేకుండా పంట పని నడవదు. 

పురుషులు

పురుషులు,  పురుషులు   జంట జీవనం చేయడం లేదా స్త్రీలు స్త్రీలు  కలిసి జంట చేయడం జీవరాశి సహజ లక్షణాలకే వ్యతిరేకం. బలంగా మనగలిగే జంట జీవనం.. ఒక స్త్రీ, ఒక పురుషుడు లేదా స్త్రీలు, పురుషుల మధ్యనే సాధ్యమౌతుంది. అది నిలబడుతుంది. కేవలం పురుషులు మాత్రమే గుంపులుగా ఉంటూ వంటతో సహా అన్నీ వారే  చేసుకుని జీవించడమనేది మతాలు ఏర్పడ్డాక మాత్రమే ఉనికిలోకి వచ్చింది.  అయితే,  వీరు పంట ప్రక్రియకు, అంటే వ్యవసాయానికి తోడ్పడ్డ దాఖలాలు లేవు. ఇతర స్త్రీ, పురుష జంటలు శ్రమ దోపిడీ ద్వారా మాత్రమే వీళ్లు బతికారు. 

మొదట బుద్ధిస్తు పురుష సంఘలు అలా ఏర్పడ్డాయి. తరువాత క్యాథలిక్​ పురుష మిషనీరులు ఏర్పడ్డాయి. హిందూ సన్యాసి సంఘాలు కూడా  పురుషులతో  ఏర్పడ్డాయి. హిందూ సన్యాసి సంఘాలు కూడా పురుషులతో ఏర్పడ్డాయి. కానీ, వేరు ఎవరూ పంట సైన్స్​కుగాని, వంట సైన్స్​కుగా  అసలు కంట్రిబ్యూట్ చేయలేదు. వ్యవసాయ జంట కనిపెట్టిన పంట– వంట సైన్స్​ను దోచుకుని, వాడుకుని  మాత్రమే జీవించారు. 

అయితే మతం కొన్ని సమాజ మానసిక సమస్యలను నమ్మకాల ద్వారా పరిష్కరించింది.  కొన్ని కొత్తవాటిని సృష్టించింది. కానీ పంటకు–వంటకు, వాటికి కావాల్సిన సైన్స్​ అభివృద్ధి తోడ్పడ్డ దాఖలాలు తక్కువ.

ఇక వంట సైన్స్​ చూద్దాం

ఉదాహరణకు  చేపలకూర వండాలంటే.. గ్రామీణ కిచెన్​లో  చింతపండు పులుసులో, అల్లం, ఉల్లిగడ్డ,  ఎల్లిపాయ, ధనియాల పొడితోపాటు ప్రాంతాన్నిబట్టి ఇతర ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు వగైరాలు వేసి నూనెతోపాటు చేపలను అందులో ఉడికించినప్పుడు ఎన్ని రకాలు పాజిటివ్​ ఫుడ్​ ఐటమ్స్​ చేపకు జత అయితాయో చూడండి.  అందులో రకరకాల ప్రొటీన్లు, యాంటిఆక్సిడెంట్లు, విటమిన్లు జమ అవుతాయి. ఈ ప్రక్రియ మటన్​ కర్రీ అయినా,  వెజిటబుల్​ కర్రీ అయినావిభిన్న పద్ధతులో  కిచెన్​ ల్యాబ్​లో  ఎలా మిక్స్​ చేయాలో,   ఎంతసేపు  ఏ  లెవల్​ వేడిమీద ఉడికించాలో కనిపెట్టింది స్త్రీలే.  

మహాభారతంలో  రాసినట్టు  నలుడు లేదా భీముడు కాదు. నిజానికి పురుషుని పాత్ర కిచెన్​ల్యాబ్​లో  చాలా తక్కువ. స్త్రీ పాత్ర  వంటపనిలో ఉన్న దాంట్లో వందో వంతు కూడా పురుషుని పాత్ర వంట సైన్స్​లో లేదు. అందుకే పంటకు వంటకు అనుసంధానం స్త్రీనే.  పురుషుడు కాదు.   చాలా సంస్కృత గ్రంథాల్లో అబద్ధాలు రాశారు.  కానీ, ఈ దేశ  స్త్రీ,  పురుష సైన్స్​, ఉత్పత్తి జీవితంతో పోల్చి చూసే ఆ రచనలో అభివృద్ధి  అయిన సైన్స్​ అందులో ఎక్కడా కనిపించదు.  

స్త్రీ జ్ఞాన ప్రక్రియ కనిపించదు.  పుస్తకాలను  పంట, వంటతో  ముడివేసి అధ్యయనం చేయకపోతే దేశంలో మనం స్త్రీ, పురుషులు కనుక్కున్న సైన్స్​ రచనారంగంలోకి  రాకుండా మూలపడిపోయింది. ఇండియాకు చాలా గొప్ప చరిత్ర ఉన్నది నిజమే. కానీ, అది ఇప్పటికీ పుస్తకాల్లోకి ఎక్కలేదు.  కిచెన్​లాబ్​లో జరిగిన  ఆహార సైన్స్​, కొత్తకొత్త  పరిశోధనలు,  వాటివల్ల  మన జీవన ప్రమాణాలు పెరిగిన అంశాలపై అసలు రచనలు లేవు. ఇది ఎంత అన్యాయం. 


కిచెన్​ ఎట్లా ల్యాబ్​ అయింది?

కాల్చి తినడం నుంచి మన పూర్వీకులు వంటకు మార్చాక కుటుంబ జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. నా చిన్నప్పుడే గ్రామాల్లో,  మా ఇంటితో సహా మన స్త్రీలు వంటగదిలో చేసిన సైన్స్​ ప్రక్రియ చూద్దాం. అప్పుడు గ్రామంలోని  ప్రతి వంటిల్లో పొయ్యి మట్టితోనే  తయారు చేసుకునేవారు.  అలా చేసిన పొయ్యికి ఒక పక్క మట్టిగది, రెండో పక్క బత్తు (నీటికుండ) ఉండేవి.  పొయ్యి  వెనకభాగం మూయబడి ముందుభాగం కట్టెలతో మంటెయ్యడానికి వీలుగా ఉండేది.  

పొయ్యి పక్కనే ఒక కురాకు  కుండ ఉండేది.  కురాకు కుండలో ముందురోజు బువ్వ వండిన గంజిపోసి దాన్ని ఒకరోజు పులిసినాక మరుసటి రోజు బువ్వ వంటకానికి ఎసరు అందులో నుంచే పోసేవారు. ఈ పులిసిన గంజిలో  పాజిటివ్​ బ్యాక్టీరియా ఫామ్​ తయారై తిన్న ఆహారాన్ని ఆరగించే లక్షణం కలదని వారికి తెలుసు. అది  వారు ఎంతో ప్రయత్నం చేసి కనిపెట్టిన సైన్స్​ ప్రక్రియ.  

పొయ్యికి భాగంగా పెట్టిన మట్టి బత్తులో నిరంతరం నీళ్లు కాగుతూ ఉండేవి. అంటే అన్నం, కూర ఉడకటంతోపాటు స్నానాలకు నీళ్లు ఆ బత్తులో కాగుతాయి.  ఇది ఎంత  గొప్ప సైన్స్​  ప్రయోగం.  ఇది పెద్ద ఫ్యూయల్​ సేవింగ్​ హోం సైన్స్​. 

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​