నీటి కేటాయింపులు చేసేది ట్రిబ్యునలే

నీటి కేటాయింపులు చేసేది ట్రిబ్యునలే

హైదరాబాద్‌‌, వెలుగు: నీటి కేటాయింపులు చేసేది ట్రిబ్యునల్‌‌ మాత్రమేనని, పార్లమెంట్‌‌ కాదని తెలంగాణ తరపు సాక్షి, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌‌ ఘన్‌‌శ్యాం ఝా తేల్చి చెప్పారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాల కోసం ఏర్పాటు చేసిన జస్టిస్‌‌ బ్రిజేశ్‌‌ కుమార్‌‌ ట్రిబ్యునల్‌‌ విచారణ మంగళవారం ప్రారంభమైంది. ఏపీ అడ్వకేట్‌‌ వెంకటరమణి తెలంగాణ తరఫు సాక్షిని క్రాస్‌‌ ఎగ్జామినేషన్‌‌ చేశారు. ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌ యాక్టు షెడ్యూల్‌‌ –11లో ఎస్‌‌ఎల్‌‌బీసీని చేర్చలేదనే ఏపీ న్యాయవాది ప్రశ్నకు ఝా సమాధానమిచ్చారు. షెడ్యూల్‌‌–11లో చేర్చిన ప్రాజెక్టుల వివరాలు సమగ్రంగా లేవన్నారు. ఈ ప్రాజెక్టుకు 1981లోనే సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. కేడబ్ల్యూడీటీ–-2 కేటాయింపులకు లోబడే పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నుంచి నీటిని తరలించాల్సి ఉంటుందన్నారు. ఆర్డీఎస్‌‌ నుంచి తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా, ఏ యేడు కూడా 4.52 టీఎంసీలకు మించి వాడుకోలేదన్నారు. బేసిన్‌‌ అవసరాలు తీరిన తర్వాతే అవతలి బేసిన్‌‌కు నీటిని తరలించాలని బచావత్‌‌ ట్రిబ్యునల్‌‌ స్పష్టం చేసిందన్నారు. కేడబ్ల్యూడీటీ–-2 కూడా బేసిన్‌‌ అవసరాలు తీరిన తర్వాతే అవతలి బేసిన్‌‌కు నీటిని తీసుకెళ్లాలని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. విచారణ ఈ నెల 26 వరకు కొనసాగనుంది.