టోకెన్ల ప్రకారమే ధాన్యం కొనుగోలు

టోకెన్ల ప్రకారమే ధాన్యం కొనుగోలు

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రైతులు ఈ యాసంగిలో సాధారణం కంటే అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశారు. వాన కాలం చివర్లో వర్షాలు సమృద్ధిగా పడి చెరువులు, కుంటల్లోకి నీరు చేరడం, భూగర్భజలాలు పైకి రావడంతో 4లక్షల99వేల74 ఎకరాల్లో వరి పండించారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్న ఆఫీసర్లు నిజామాబాద్ జిల్లాలో 547, కామారెడ్డి జిల్లాలో 320 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టాలన్న సీఎం ఆదేశాలకనుగుణంగా మార్చి 31న కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆయాశాఖల జిల్లా ఆఫీసర్లతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి, ఏర్పాట్లపై చర్చించారు.

కరోనా’ భయంతో అదనపు కేంద్రాలు..

గతంలో సొసైటీలు, ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం కొనేవారు. ఒక్కో మండలానికి మూడు, నాలుగు కేంద్రాల చొప్పున ఉండేవి. కానీ కరోనా వైరస్వి జృంభిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఈనెల14 వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్లకు సమస్య రాకుండా చూడాలని సర్కారు జిల్లా ఆఫీసరను ఆదేశించింది. కేంద్రాల సంఖ్య తక్కువ గా ఉంటే రైతులంతా ఒకే చోట జమయ్యే ప్రమాదం ఉంది. దీంతో రెవెన్యూ గ్రామాల వారీగా, అధిక విస్తీర్ణంలో వరి పంట సాగులో ఉన్న గ్రామాల్లో ఆఫీసర్లు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా రు. ఉమ్మడి జిల్లాలో గతంలో కంటే ఈసారి 250 కేంద్రాలు పెంచారు. అంతేగాక ఏ సమయానికి ఏ రైతు ధాన్యం తీసు కురావాలనే వివరాలతో గ్రామాల వారీగా టోకెన్లు ఇవ్వనున్నారు. గోనె సంచులు, ట్రాన్స్ పోర్టు, హమాలీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల్లో తాగునీటి వసతి, నీడ కల్పిస్తారు.

ప్రతి గింజా కొంటాం : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‍రెడ్డి

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజా మద్దతు ధర చెల్లించి కొంటామని వ్యవ సాయశాఖ మంత్రి నిరంజన్‍రెడ్డి అన్నా రు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కాల్ గ్రామంలో ఆదివారం ఆయన అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కరోనా కారణంగా రైతులు దిగుబడిని వ్యాపారులు, దళారులకు అమ్మొద్దనే ఉద్దేశంతో సూక్ష్మస్థాయిలో ప్రణాళిక తయారుచేసినట్లు చెప్పారు. పౌరసరఫరాల శాఖ ఐకేపీ, పీఏసీఎస్‍, మార్క్ ఫెడ్ ద్వారా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 5.92 లక్షల ఎకరాల్లో పంట సాగైందని 14 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా1,017 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు వివరించారు. క్వింటాల్‍కు మద్దతు ధర రూ.1,760- చెల్లిస్తా మన్నా రు. మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు సరఫరా చేయడం.. ఎస్సారెస్పీలో నీటి వినియోగంతో నిర్మల్ జిల్లాలో సాగు పెరిగిందన్నారు. అంతకు ముందు రాయదారి గ్రామంలో తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ, 30 మంది వలస కూలీల కు రూ.500 చొప్పున పంపిణీ చేశారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‍రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్‍పర్సన్ రాథోడ్ రమేశ్, డీసీసీబీ చైర్మన్ నాందేవ్‍, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, ఎస్పీశశిధర్ రాజు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, డీసీసీబీ డైరెక్ట‍ర్ హరీశ్ రావు, రైతు బంధు కమిటీ కోఆర్డినేటర్ వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు.