గాడిద గుడ్డు!! .. పాలిటిక్స్ లో నయా ట్రెండ్

గాడిద గుడ్డు!! .. పాలిటిక్స్ లో నయా ట్రెండ్

 

  • మోదీ పదేండ్ల  పాలనపై రేవంత్ మార్క్ ప్రచారం
  • గుడ్డుపైనే పార్టీల మధ్య మాటల తూటాలు
  • ప్రజలను ఆకర్షిస్తున్న టాయ్ ఎగ్
  •  ప్రతి సభలో ప్రదర్శిస్తున్న సీఎం
  •  కౌంటర్ గా ఏడు గాడిదగుడ్లతో బీజేపీ పోస్టర్
  •  ట్విట్టర్ లో  పోస్ట్ చేసిన తెలంగాణ బీజేపీ 
  • కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా గుడ్ల క్యాంపెయిన్

హైదరాబాద్: మోదీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు..! ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వినిపిస్తున్న నినాదం. పదేండ్లలో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని చెబుతూ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా కాంగ్రెస్ పార్టీ తెరమీదకు తెచ్చిన గాడిదగుడ్డు ఇప్పుడు పాపులర్  ప్రచారాస్త్రంగా మారింది. ముఖ్యమంత్రి ఏ మీటింగ్ కు వెళ్లినా  గాడిద గుడ్డు పేరుతో తయారు చేసిన ఓ టాయ్ ఎగ్ తీసుకెళ్తున్నారు. దానిని చూపించి తన ప్రసంగం చివరన అందరికీ అర్థమయ్యేలా మోదీ అమలు చేయని హామీలను ప్రస్తావిస్తున్నారు. బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని జనంతో నినాదాలు చేయిస్తున్నారు. ఎన్ ఎస్ యూఐ గాంధీభవన్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ గాడిద గుడ్డు మాట ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. 

పోస్టర్లు, షార్ట్ ఫిల్మ్స్

కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేస్తున్న వీడియోలు, పోస్టర్లు  ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదల చేసిన నయావంచన పోస్టర్ లో తెలంగాణ ఏం అడిగింది..? కేంద్రం ఏం ఇచ్చింది..? అనే అంశాలను వివరిస్తూ నయావంచన పేరుతో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది కాంగ్రెస్. ఢిల్లీ దర్బార్ పేరుతో క్రియేట్ చేసిన వీడియో యూట్యూబ్ లో, ట్విట్టర్ లో వైరల్ గా మారింది. తాతా నీకు టాటా పేరుతో ఇవాళ మరో వీడియోను విడుదల చేసింది. ప్రత్యర్థిని మట్టికరిపించడమే లక్ష్యంగా టీ కాంగ్రెస్ కొత్త తరహాలో రూపొందిస్తున్న ఈ ప్రచారాస్త్రాలు జనంలోకి దూసుకెళ్తుండటం విశేషం.  

బీజేపీX కాంగ్రెస్

ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి మరో వారం రోజుల గడువే ఉండటంతో నేతల సభలు, రోడ్ షోలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్ఎస్ యూఐ రూపొందించిన గాడిద గుడ్డు ఇప్పుడు పాపులర్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఏ సభకు వెళ్లినా గాడిద గుడ్డును ప్రదర్శిస్తున్నారు. దీనికి బీజేపీ నాయకులు సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసహనంతో  ఆరు గ్యారెంటీలు గాడిద గుడ్డని ఒకరంటే.. గాడిద ఎక్కడైనా గుడ్డు పెడుతుందా..? అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ లోక్  సభ ఎన్నికల్లో గాడిదగుడ్డు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. నిన్న ఏడు గాడిద గుడ్లతో కూడిన పోస్టర్ ను ట్విట్టర్లో బీజేపీ పోస్ట్ చేయడం గమనార్హం. 

బీజేపీ@ఏడు గాడిద గుడ్లు

ప్రచారంలో రేవంత్ కొత్త సృష్టించిన గాడిద గుడ్డు ట్రెండ్ ను బీజేపీ కూడా ఫాలో అవుతోంది. ఇవాళ ట్విట్టర్ వేదిక ఏడు గాడిద గుడ్లు అంటూ ఓ ఫొటోను షేర్ చేయడం విశేషం..‘6 గ్యారంటీలతో ధోకా.. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిద గుడ్డు’ అని కౌంటర్ ఇచ్చింది. రూ.2లక్షల రైతు రుణమాఫీ ఒకటో గుడ్డు అని, వరికి రూ.500 బోనస్ రెండో గుడ్డు అని సెటైర్లు వేసింది. కౌలు రైతులకు రూ.15వేల రైతుభరోసా మూడో గుడ్డు అని.. రైతు కూలీలకు రూ.12 వేల సహాయం పేరిట నాల్గో గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేసింది. విద్యార్థులకు రూ.5లక్షల హామీతో ఐదో గుడ్డు, నిరుద్యోగులకు నెలకు రూ.4వేల హామీతో ఆరు గుడ్లు ఇచ్చిందని మండిపడింది. మహిళలకు రూ.2,500 పేరిట 7 వ గుడ్డు ఇచ్చిందని పంచ్‌లు వేసింది. కాంగ్రెస్ కు కౌంటర్ గా బీజేపీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.