- ఈ ప్రాజెక్టును మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ
- కేంద్రానికి లేఖలు రాసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్
- కర్నాటక, మహారాష్ట్రతో పాటు కేంద్ర సంస్థల నుంచీ అభ్యంతరాలు
- దీంతో ప్రాజెక్టు టెక్నికల్‌గా సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ
- బనకచర్ల స్థానంలో జీసీ లింక్‌ను పోలవరానికి తరలించే ఎత్తుగడ
- అదే జరిగితే మనకు నష్టమేనని ఆందోళన
హైదరాబాద్, వెలుగు: పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ వెనకడుగు వేసింది. ప్రాజెక్టు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారీకి పిలిచిన టెండర్లను రద్దు చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత నెల 9న ఏపీ ప్రభుత్వం టెండర్లను పిలువగా.. 31 వరకు గడువు విధించింది. అయితే టెండర్ నోటీసులకు కాంట్రాక్టర్ల నుంచి సరైన స్పందన రాలేదన్న కారణంతో ఆ టెండర్‌ను రద్దు చేశారని చెబుతున్నా.. మరో కుట్రకు ఏపీ తెరలేపుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బనకచర్ల ప్రాజెక్టును ఇప్పటికే తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రతో పాటు కేంద్ర సంస్థలూ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ ప్రాజెక్టు ఇక సాంకేతికంగా సాధ్యం కాదన్న అంచనాకు ఏపీ ప్రభుత్వ పెద్దలు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. దానికి బదులుగా ‘కావేరి’ లింక్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టు చెబుతున్నాయి.
గట్టిగా కొట్లాడిన కాంగ్రెస్ సర్కార్..
బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటి నుంచి ఏపీ తీరుపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే కొట్లాడింది. కేంద్ర సంస్థలకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ, సెంట్రల్వాటర్కమిషన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కృష్ణా, గోదావరి బోర్డులు, పర్యావరణ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసింది.
ప్రాజెక్టును ఆపాలంటూ డిమాండ్ చేసింది. ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌పాటిల్‌కు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్స్వయంగా లేఖలు కూడా రాశారు. దీంతో కేంద్రం బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును సంబంధిత రాష్ట్రాలతో పాటు కేంద్ర సంస్థలకు పంపించింది.
పీఎఫ్ఆర్‌పై కర్నాటక, మహారాష్ట్రతో పాటు పీపీఏ, సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ, కృష్ణా బోర్డు, గోదావరి బోర్డులూ అభ్యంతరం తెలిపాయి. నీటి లభ్యత లేదంటూ సీడబ్ల్యూసీ, నేషనల్ వాటర్డెవలప్మెంట్ఏజెన్సీలూ అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినా వాటిని లెక్క చేయకుండా ఏపీ ముందుకే వెళ్లింది.
ఇటీవల ప్రాజెక్టు డీపీఆర్తయారీకి టెండర్లను పిలిచింది. దానిపైనా వెనువెంటనే తెలంగాణ అధికారులు స్పందించారు. టెండర్లు పిలిచిన మర్నాడే పీపీఏతో పాటు సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఫిర్యాదు ఆధారంగా.. డీపీఆర్టెండర్పై వారంలోగా వివరణ ఇవ్వాలని కృష్ణా, గోదావరి బోర్డులు లేఖ రాసినా ఏపీ నుంచి స్పందన రాలేదు.
జీసీ లింక్‌ను తరలించే ఎత్తుగడ..
బనకచర్ల ప్రాజెక్టుకు నలు దిక్కుల నుంచి అడ్డంకులు ఎదురవుతుండడంతో.. ఆ ప్రాజెక్టు టెక్నికల్‌గా సాధ్యం కాదని ఏపీ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మరో కొత్త ఎత్తుగడకు ఏపీ ప్లాన్చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలనుకున్న గోదావరి కావేరి లింక్ ప్రాజెక్టును ఏపీకి తరలించుకుపోవాలనే కుట్రలకు తెరలేపుతున్నట్టు తెలుస్తున్నది.
ఇక్కడ కూడా తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టాలనే దురుద్దేశంతో ఏపీ చర్యలున్నట్టు చెబుతున్నారు. ఇచ్చంపల్లి నుంచి కాకుండా.. పోలవరం నుంచి కావేరి లింక్ ప్రాజెక్టును చేయించేలా ఏపీ పావులు కదిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్‌డబ్ల్యూడీఏ మీటింగుల్లో ఏపీ ఇదే విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేసింది.
బనకచర్ల లింక్‌కు సమాంతరంగా చేపట్టాలనుకున్న పోలవరం–సోమశిల లింక్‌ను.. ఈ జీసీ లింక్ద్వారానే చేయిస్తే నీళ్లను అధికారికంగా తీసుకుపోవచ్చనే దురుద్దేశంతో ఏపీ ప్రయత్నాలు చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తున్నది. ప్రాజెక్టు కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో.. ఇక్కడి నుంచే సోమశిలకు లింక్‌చేసి అక్కడి నుంచి కావేరి నదికి లింక్ చేస్తే కొత్తగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీని నిర్మించకుండానే జీసీ లింక్‌ను చేపట్టొచ్చనే సంకేతాలను కేంద్రానికి పంపుతున్నట్టు చెబుతున్నారు.
పైగా కేంద్రం ఈ లింక్‌ను చేపడితే.. ఖర్చు లేకుండా పని జరగడంతో పాటు నీటి వాటాలు కూడా దక్కుతాయన్న యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఎలాగూ కేంద్రంలో ఉన్నది మిత్రపక్షమైన బీజేపీనే కాబట్టి.. పని సులభంగా అయిపోతుందని ఏపీ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణ నీటి ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని, జీసీ లింక్‌లో భాగంగా తెలంగాణకు వచ్చే అధికారిక కోటాలో కోత పడే ప్రమాదం ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
