వరల్డ్ మోటర్ సైకిల్ డే సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో ది గ్రేట్ ఇండియన్ క్రాస్ రోడ్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి ఎంపికైన ప్రముఖ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు ఈ ప్రత్యేక రైడ్‌లో పాల్గొని రాయల్ ఎన్‌ఫీల్డ్ వివిధ మోడళ్ల బైక్‌లపై చండీగఢ్ నుంచి థియోగ్, కులు, మండి తదితర హిమాలయ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ సాహసయాత్రను ఆస్వాదించారు.
సుమారు 730 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో అందమైన నేషనల్ హైవేలు, కొండ ప్రాంతాల సవాళ్లతో కూడిన రోడ్లు, హిమాచల్ ప్రకృతి అందాలు ఆకట్టుకున్నాయని అన్నారు రైడర్లు. శిమ్లా జిల్లా థియోగ్ ప్రాంతంలో స్థానిక ప్రజల సంప్రదాయ ఆహారం, ఆతిథ్యం, జీవనశైలిని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం లభించిందని అన్నారు.
ఈ యాత్రలో భాగంగా గ్రీన్ హబ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం, సుస్థిర పర్యాటకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహాసు గ్రామంలోని సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ ధామ్ సామూహిక విందు, మండి ప్రాంత సంస్కృతి పరిచయం, కుల్లులో నిర్వహించిన సాహస క్రీడలు పాల్గొన్న వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
