- హైదరాబాద్ నుంచి బహిష్కరించడంతో వరంగల్ అడ్డాగా నేరాలు
- భీమారంలోని డాగ్‌ఫామ్‌ను డెన్‌గా మార్చుకొని స్టూడెంట్లు, యువకులతో గ్యాంగ్
- లారీ డ్రైవర్ పై దాడి, భూపాలపల్లిలో ఇద్దరిని చంపేందుకు ఒప్పందం
- సూరితో పాటు ఏడుగురు అరెస్ట్.. పరారీలో మరో ఐదుగురు
హనుమకొండ, వెలుగు : హైదరాబాద్ నగర బహిష్కరణకు గురికావడంతో ఓరుగల్లును అడ్డాగా మార్చుకొని నేరాలు చేస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాసరి సురేందర్ అలియాస్ సూరిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పిస్టల్‌తో బెదిరింపులకు పాల్పడడంతో పాటు భూపాలపల్లిలో హత్యలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పసిగట్టిన పోలీసులు అతడితో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ శుక్రవారం వెల్లడించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామానికి చెందిన దాసరి సురేందర్ 2007లో హైదరాబాద్‌కు వెళ్లి మొదట కారు డ్రైవర్‌గా పనిచేశాడు. అక్కడ గొడవలకు దిగుతూ గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. ఇతడిపై హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్లతో పాటు భూపాలపల్లి, శాయంపేటలో చోరీలు, దాడులు, ఆయుధాలతో తిరగడం, మర్డర్లు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల వంటి 46 కేసులు ఉన్నాయి. ఇందులో తన మొదటి భార్య, బావమరిది హత్యతో పాటు మరో సుపారీ మర్డర్ కేసులు సైతం ఉన్నాయి.
హనుమకొండలోని డాగ్‌ఫామ్ అడ్డాగా...
సూరి తరచూ నేరాలకు పాల్పడుతుండడంతో హైదరాబాద్‌లోని చిక్కడపల్లి, ఎస్‌ఆర్ నగర్, ఎల్‌బీనగర్ పీఎస్‌లలో మూడు సార్లు పీడీ యాక్ట్ పెట్టారు. అయినా మారకపోవడంతో సూరిని నగరం నుంచి బహిష్కరిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 4న రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వరంగల్‌కు చేరుకున్న సూరి ఇక్కడే తన అడ్డాను ఏర్పరచుకున్నాడు. హనుమకొండ భీమారంలోని తన బంధువైన చుంచు రాహుల్ ద్వారా ఓ డాగ్ ఫామ్ ఓనర్ శివ వైభవ్‌ను పరిచయం చేసుకున్నాడు.
డాగ్ ఫామ్‌ను డెన్‌గా మార్చుకొని శివ వైభవ్ స్నేహితులు కోమటిపల్లికి చెందిన నమిండ్ల శివమణి, బుడిగె తరుణ్, నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లికి చెందిన రేణుకుంట్ల ప్రదీప్, నాగారం గ్రామానికి చెందిన అల్లె సాయిశివ, వెంకటాపూర్‌కు చెందిన ముస్కె రవితేజ, లోకి, ములుగుకు చెందిన సామ్రాజ్ శ్రీచక్రి, అతని సామ్రాజ్ క్రాంతి, ఇనుగాల నితిన్‌తో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ నానక్ రాంగూడకు చెందిన ఆదిత్యకుమార్ ఠాకూర్ సాయంతో బిహార్‌లోని భగల్పూర్ జిల్లా నగోచియ ప్రాంతానికి చెందిన కుందన్ పరిచయం కావడంతో.. అతడి వద్ద రూ. 50 వేలతో పిస్టల్, 9 బుల్లెట్లు కొనుగోలు చేశాడు.
పలువురిని బెదిరించి.. తనిఖీల్లో పోలీసులకు చిక్కిన్రు
సురేందర్‌తో పాటు రాహుల్, శివమణి, తరుణ్, ప్రదీప్, సాయిలక్కీ, రవితేజ, లోకీ కలిసి గత నెల 18న ఓ లారీని ఆపి డ్రైవర్‌పై దాడి చేశారు. అనంతరం పక్కనే ఉన్న బంక్‌లో పెట్రోల్ పోయించుకుని డబ్బులు ఇవ్వకపోగా.. అక్కడున్న వారిని పిస్టల్‌తో బెదిరించి పరారయ్యారు. దీంతో బాధితుల ఫిర్యాదుతో శాయంపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లిన సూరి గ్యాంగ్ ఆదిభట్ల పీఎస్ పరిధిలో అక్రమ్ అనే వ్యక్తిని పిస్టల్‌తో బెదిరించడంతో అక్కడ కూడా కేసు నమోదైంది.
సూరితో పాటు శ్రీచక్రి, రాహుల్, శివమణి, శివ వైభవ్, క్రాంతి, నితిన్, ఆదిత్యకుమార్ ఠాకూర్ గురువారం బైక్‌లపై శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం వైపు రాగా.. అక్కడే వాహనాల తనిఖీ చేస్తున్న ఎస్సై జె. పరమేశ్వర్ వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, ఒక బుల్లెట్, ఒక కత్తి, రెండు బైక్‌లు ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తరుణ్, ప్రదీప్, అల్లె సాయిశివ, లోకి, రవితేజ పరారీలో ఉన్నారు. సూరి గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీసులను డీసీపీ అభినందించారు. సూరి గ్యాంగ్‌లో ఉన్న నమిండ్ల శివమణి, సామ్రాజ్ శ్రీచక్రి, సామ్రాజ్ క్రాంతి, ఇనుగాల నితిన్ నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ కావడం గమనార్హం.
భూపాలపల్లిలో రెండు హత్యలకు ప్లాన్
సురేందర్ అనుచరుడు భూపాలపల్లికి చెందిన ఎండీ. బాసిత్ ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో హత్యకు గురయ్యాడు. బాసిత్‌ను మర్డర్ చేసిన వారిని సైతం చంపించాలని అతడి బావ షారూఖ్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు సురేందర్‌ను కలిసి.. బాసిత్‌ను మర్డర్ చేసిన బబ్లూ, సోనును హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత సురేందర్ తన అనుచరుడైన శ్రీచక్రికి ఒక పిస్టల్, ఆరు బుల్లెట్స్ కొనిచ్చాడు. రెండు నెలల కిందట బాసిత్ సమాధి వద్దకు వెళ్లి గాలిలోకి కాల్పులు జరిపి, శపథం చేశారు.
