ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ కలిసొచ్చినా.. పోటీకి దూరమైన్రు !

ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ కలిసొచ్చినా.. పోటీకి దూరమైన్రు !
  • మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపని మాజీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్లు
  • గత ఎన్నికల్లో వరంగల్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లాలో 9 మున్సిపాలిటీలను దక్కించుకున్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌
  • ప్రస్తుతం తాజామాజీలకు టికెట్లు ఇచ్చేందుకూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వెనుకడుగు
  • మరికొన్ని మున్సిపాలిటీల్లో కలిసిరాని రిజర్వేషన్లు 

వరంగల్‍, వెలుగు :  ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు చెందిన మున్సిపల్‌‌‌‌‌‌‌‌ మాజీ చైర్మన్లు ఈ సారి పోటీకి దూరంగా ఉన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన లీడర్లంతా తమ కుటుంబ సభ్యులు, బంధువులను చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్లుగా చూసుకునేందుకు పోటీ పడ్డారు.

కానీ ప్రస్తుతం కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలు పెరిగినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఒక్కరు మినహా ఇతర మాజీ చైర్మన్లు ఎవరూ పోటీకి ఆసక్తి చూపలేదు. కొన్ని మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు కలిసొచ్చినా కనీసం వార్డు సభ్యుడిగా పోటీచేయడానికి కూడా ఎవరూ ముందుకురాలేదు.

కోటా కలిసొచ్చినా...

గత మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, జనగామ, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలు బీఆర్‍ఎస్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో పడ్డాయి. ఈ సారి స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‍పూర్‍, ములుగు, కేసముద్రం కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు దక్కిన తొమ్మిది స్థానాల్లో.. సగం కంటే ఎక్కువ మున్సిపాలిటీల్లో తాజా మాజీలకు మరోసారి రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ కలిసొచ్చింది.

అయినా వారు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పట్టణాల రూపురేఖలు మార్చామాని చెప్పిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు.. నాటి చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్లను ముందుపెట్టి ఓటర్ల వద్దకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. బీసీ మహిళా కోటాలో నర్సంపేట మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా గుంటి రజిని పనిచేశారు. ఇప్పుడు మరోసారి ఆ మున్సిపాలిటీ బీసీ మహిళకే దక్కినా ఆమె మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు.

వర్ధన్నపేట చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా ఎస్టీ మహిళా కోటాలో ఆంగోతు అరుణ పనిచేయగా.. ఈ సారి మళ్లీ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ కలిసొచ్చినా ఆమెను బరిలో నిలిపేందుకు పార్టీ పెద్దలు ఇష్టపడలేదు. పరకాల నుంచి ఎస్సీ మహిళ కోటాలో అనిత చైర్‍పర్సన్‍గా వ్యవహరించగా.. ఈ సారి జనరల్‍ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ కలిసొచ్చినా ఆమె ఎలక్షన్లకు దూరంగానే ఉన్నారు.

తొర్రూర్‍ మున్సిపాలిటీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా గతంలో ఎస్సీ జనరల్‍ నుంచి మంగళపల్లి రామచంద్రయ్య పనిచేయగా.. ఈ సారి ఆ మున్సిపాలిటీకి జనరల్‍ కోటాకు దక్కింది. అయినా ఆయన పోటీకి విముఖత చూపారు. మరిపెడ స్థానంలో గుగులోతు సింధూర కుమారి ఎస్టీ జనరల్‍ కోటాలో తాజా మాజీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో జనరల్‍ మహిళా కోటాలో మరోసారి పోటీచేసే ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నా దూరంగానే ఉన్నారు.

కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌ బరిలో తాజా మాజీ

ఓరుగల్లులోని తొమ్మిది పాత మున్సిపాలిటీల్లో పనిచేసిన చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ల నుంచి ఒకే ఒక్కరు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె కూడా చైర్‍పర్సన్‌‌‌‌‌‌‌‌ బరిలో కాకుండా.. కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌ పదవి కోసం పోటీలో ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ గత ఎన్నికల్లో ఎస్సీ మహిళ కావడంతో సెగ్గం వెంకటరాణి చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ పీఠం దక్కించుకున్నారు. కాగా, ప్రస్తుతం ఈ స్థానం బీసీ జనరల్‍ అయింది. అయినా..వెంకటరాణి కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌గా బరిలో నిలిచారు.

మూడు చోట్ల కలిసిరాని రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌

ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో మూడు చోట్ల మాత్రమే తాజా మాజీలకు రిజర్వేషన్లు కలిసి రాలేదు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ గతంలో జనరల్‌‌‌‌‌‌‌‌ కావడంతో పాల్వాయి రామ్మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డికి చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ పీఠం దక్కింది. ఈ స్థానం ప్రస్తుతం ఎస్టీ జనరల్‌‌‌‌‌‌‌‌కు దక్కింది. డోర్నకల్‍ ఎస్టీ జనరల్‌‌‌‌‌‌‌‌ ఉండగా వాంకుడోతు వీరన్న చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ప్రస్తుతం ఈ స్థానం ఎస్సీ జనరల్‌‌‌‌‌‌‌‌ అయింది. జనగామ జనరల్‍ మహిళా కావడంతో ఓసీ సామాజికవర్గానికి చెందిన పోకల జమున చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ పీఠం దక్కించుకున్నారు. ఈ మున్సిపాలిటీ ఈసారి బీసీ జనరల్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఆమెకు కలిసిరాలేదు.