స్టార్ క్యాంపెయినర్లు రానట్టే..!..ఎన్నికల ప్రచారానికి మిగిలింది రెండు రోజులే 

స్టార్ క్యాంపెయినర్లు రానట్టే..!..ఎన్నికల ప్రచారానికి మిగిలింది రెండు రోజులే 
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక నేతలతోనే ప్రచారం 
  • మధిరకు పరిమితమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  • ఎదులాపురం, కొత్తగూడెం, ఇల్లందు సత్తుపల్లి, కల్లూరు, అశ్వరావుపేటలో  మంత్రి పొంగులేటి ప్రచారం

ఖమ్మం, వెలుగు :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రేపు సాయంత్రం (9వ తేదీ)తో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థుల తరపున నాయకులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచి రాత్రి వరకు మైకుల్లో హోరెత్తిస్తున్నారు.

అయితే ప్రచారం ముగింపు దశకు వస్తున్నప్పటికీ ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన లీడర్లు తప్పించి, స్టార్ క్యాంపెయినర్ల జాడ కనిపించడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరపున జిల్లాకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులే మున్సిపాలిటీల్లో ప్రచారం చేస్తున్నారు. 

సొంత నియోకవర్గాల్లో మంత్రులు..

కాంగ్రెస్ తరపున ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​చార్జి ఉన్న మంత్రి కొండా సురేఖ నామినేషన్ల సమయంలో రెండ్రోజులపాటు ఆయా మున్సిపాలిటీల్లో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇప్పటివరకు కేవలం మధిర మున్సిపాలిటీలో మాత్రమే ప్రచారానికి పరిమితమయ్యారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో ఎక్కువ రోజులు ప్రచారం చేశారు.

కల్లూరు, సత్తుపల్లి, కొత్తగూడెం కార్పొరేషన్, అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కూడా రోడ్ షోలు నిర్వహించారు. ఇక వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కరీంనగర్ పార్లమెంట్ పరిధి ఇన్​చార్జిగా బాధ్యతలు అప్పగించడంతో అక్కడే ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి జిల్లాలోని ఒక్క నియోజకవర్గంలోనూ ఇప్పటివరకు ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పూర్తిగా కొత్తగూడెం కార్పొరేషన్ ప్రచార బాధ్యతలను చూసుకుంటున్నారు. మరో ఎంపీ రేణుకా చౌదరి మాత్రం ఈ ఎన్నికల సమయంలో జిల్లాకు రాలేదు.    

ప్రతిపక్షాల ప్రచారం..

బీఆర్ఎస్​తరపున కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు మున్సిపాలిటీల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మధిర, వైరా మున్సిపాలిటీల్లో ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అటు ఏదులాపురం, వైరా, మధిర మున్సిపాలిటీలకు పరిమితమయ్యారు.

ఇక బీజేపీ తరపున జిల్లా నాయకులతోపాటు జాతీయ నేత, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సహా ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో సుడిగాలి ప్రచారం చేశారు. ఖమ్మం జిల్లా ఇన్​చార్జిగా ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు సీపీఐ తరపున ఆ పార్టీ జాతీయ నేత కె.నారాయణ కొత్తగూడెం కార్పొరేషన్ లో ప్రచారం చేశారు. మిగిలిన చోట్ల స్థానిక నాయకులే ప్రచారాన్ని నడిపిస్తున్నారు. 

ముఖ్యనేతలు దూరం..

గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మున్సిపల్​ఎన్నికల్లో మాత్రం ఆయన ఉమ్మడి జిల్లాకు రాలేదు. పార్టీ తరపున ఇతర ముఖ్యనేతలు, స్టార్ క్యాంపెయినర్లు ప్రచారానికి దూరంగానే ఉన్నారు. అటు బీఆర్ఎస్​ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావు కూడా జిల్లాకు దూరంగానే ఉన్నారు. దీంతో అన్ని పార్టీల్లో స్థానిక నేతలే ప్రచార భారాన్ని మోస్తున్నారు.