జూమ్ కాల్ లో ఉద్యోగుల తొలగింపు.. స్పందించిన ఆనంద్ మహింద్రా

జూమ్ కాల్ లో ఉద్యోగుల తొలగింపు.. స్పందించిన ఆనంద్ మహింద్రా

న్యూఢిల్లీ: జూమ్‌ కాల్‌లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించడంపై విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో బెటర్‌.కామ్‌ సీఈవో విశాల్‌ గార్గ్‌ సారీ చెప్పారు. ఉద్యోగులను తీసేయడం సరైన చర్యేనని సమర్థించుకున్న ఆయన.. అయితే ఆ నిర్ణయాన్ని వెల్లడించడంలో తప్పుడు విధానాన్ని అవలంబించానని పేర్కొన్నారు. దీనిపై తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహింద్రా స్పందించారు. విశాల్‌ గార్గ్‌ చర్యలను మహింద్రా తప్పుబట్టారు. ‘ఇలాంటి ఘోర తప్పిదం తర్వాత కూడా మీరు సీఈవోగా కొనసాగగలరని భావిస్తున్నారా’ అని విశాల్ ను మహింద్రా ప్రశ్నించారు. ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వడం కరెక్టేనా, కాదా అని ట్వీట్ చేశారు. 

కాగా, అమెరికాకు చెందిన బెటర్‌.కామ్‌ సంస్థ సీఈవో విశాల్‌ గార్గ్‌ ఇటీవల జూమ్‌ కాల్‌లో 900 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల సమర్థత, పనితీరు తదితర కారణాలతోనే వారిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సారీ చెబుతూ ఉద్యోగులకు విశాల్ ఓ లెటర్ రాశారు.