యూనివర్శిటీల్లో రెగ్యులర్ ప్రొఫెసర్లు లేక కోర్సులు రద్దు

యూనివర్శిటీల్లో రెగ్యులర్ ప్రొఫెసర్లు  లేక కోర్సులు రద్దు
  •     కేయూలో తాజాగా ఎంఈడీ కోర్సు రద్దు చేసిన ఎన్‌సీటీఈ
  •     అదే బాటలో మహిళా ఇంజనీరింగ్‌ కాలేజ్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీలు
  •     సర్కార్ నిర్లక్ష్యంతో విలువైన కోర్సులు క్లోజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర యూనివర్సిటీల్లోని కోర్సులను రికగ్నైజేషన్​గండం వెంటాడుతోంది. వివిధ డిపార్ట్​మెంట్లలో సీనియర్ ప్రొఫెసర్లు రిటైర్డ్ కావడం, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడంతో దశాబ్దాల తరబడి నడిచిన కోర్సులు ఒక్కొక్కటిగా క్లోజవుతున్నాయి. రాష్ట్రంలో రెండో అతిపెద్ద యూనివర్సిటీ అయిన కాకతీయ యూనివర్సిటీలో 38 ఏండ్లుగా నిర్వహిస్తున్న ఎంఈడీ కోర్సు రద్దు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే యూనివర్సిటీలోని బీఈడీ, బీపీఈడీ కోర్సులతోపాటు మహిళా ఇంజినీరింగ్‌ కాలేజ్‌ కూడా ఒకటి, రెండేండ్లలో క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా యూనివర్సిటీల్లో రెగ్యులర్ రిక్రూట్​మెంట్​ను పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందని అధ్యాపక, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

ఎంఈడీ కోర్సును రద్దు చేసిన ఎన్ సీటీఈ  

కేయూలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సుడ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ)లో ప్రస్తుతం బ్యాచ్​లర్ ​ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎంఈడీ) కోర్సులతోపాటు ఎంఫిల్, పీహెచ్​డీ కోర్సులు నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న ఇద్దరు రెగ్యులర్ ప్రొఫెసర్లలో ఒకరు సెంట్రల్ యూనివర్సిటీలో చేరగా, మరో ప్రొఫెసర్ మహేందర్ రెడ్డి 2021 డిసెంబర్ లో రిటైరయ్యారు. ప్రస్తుతం ఈ కాలేజీలో ఒక కాంట్రాక్ట్ లెక్చరర్, ఐదుగురు పార్ట్​టైం లెక్చరర్లు మాత్రమే పనిచేస్తున్నారు. ప్రిన్సిపాల్ హెడ్ గా కొనసాగాలంటే పీజీతో పాటు, ఎంఈడీ పూర్తి చేసి ఎడ్యుకేషన్ లో పీహెచ్​డీ కలిగి, ప్రొఫెసర్ హోదా ఉండాలి. ప్రొఫెసర్ మహేందర్ రెడ్డి రిటైర్మెంట్ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ కు ఇన్​చార్జి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు అప్పగించారు. ఫిజిక్స్ లో పీహెచ్​డీ పూర్తి చేసిన ఒక ప్రొఫెసర్ ను బీఓఎస్​గా నియమించారు. అంతేగాక 2015లో రిటైర్డ్ అయిన ఒక ప్రొఫెసర్ ను డీన్ గా పెట్టారు. ఎన్సీటీయూ, యూజీసీ చట్టం ప్రకారం సర్వీస్ లో  ఉన్న రెగ్యులర్ ప్రొఫెసర్ మాత్రమే డీన్ హోదాకు అర్హులు. కానీ, ఎక్కడా రూల్స్​ పాటించడం లేదు. అలాగే అనుబంధంగా ఉన్న 47 బీఈడీ కాలేజీలపై పర్యవేక్షణ సంగతే మర్చిపోయారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ  లేకపోవడంతో.. బీఈడీ, ఎంఈడీ కోర్సులకు రికగ్నైజేషన్​ఇచ్చే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) యూనివర్సిటీకి రెండుసార్లు నోటీసులు కూడా ఇచ్చింది. ఈ నోటీసులకు ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో అక్టోబర్ 7, 2021న చివరి నోటీసు జారీ చేసి ఒక అర్హత కలిగిన రెగ్యులర్ ప్రొఫెసర్ ను నియమించుకోవడానికి అవకాశమిచ్చింది. కానీ యూనివర్సిటీ వీసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో 2022 – 23 సంవత్సరానికి ఎంఈడీ కోర్సు గుర్తింపు రద్దు చేసింది. దీంతో వర్సిటీ క్యాంపస్ లో ఎంఈడీ కోర్సును చదివే అవకాశం లేకుండా పోయింది. 

మరికొన్ని కోర్సులకు గండం.. 

కేయూ క్యాంపస్​లో 15 ఏండ్ల క్రితం ఎన్సీటీఈ ఆమోదంతో ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సు, 2013లో రెండేండ్ల ఎంపీఈడీ కోర్సు ప్రారంభమైంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో 20 మందికిపైగా పీహెచ్​డీ పూర్తి చేశారు. కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీకి  కూడా రెగ్యులర్ ప్రొఫెసర్ లేకపోవడంతో అభాసుపాలవుతోంది. గతంలో ప్రొఫెసర్ సాయన్న వీసీగా ఉన్నప్పుడు ఉస్మానియా నుంచి రెగ్యులర్ ప్రొఫెసర్ ను డిప్యుటేషన్​పై తీసుకువచ్చి కోర్సులు రన్ చేశారు. కొద్ది కాలానికే ఆ ప్రొఫెసర్ కూడా వెళ్లిపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఎన్సీటీఈ రూల్స్​ ప్రకారం బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సుల గుర్తింపు కూడా పోయే ప్రమాదం ఏర్పడిందని సీనియర్ ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో ఒకే ఒక్కరు.. 

కేయూ మహిళా ఇంజినీరింగ్ కాలేజీలోని 6 కోర్సుల్లో ఏటా 360 మంది విద్యార్థినులు చేరుతున్నారు. ప్రతి ఏటా వందలాది మంది విద్యార్థినులు క్యాంపస్ ప్లేస్ మెంట్స్  పొందుతున్న  ఈ కాలేజీకి రెగ్యులర్ ప్రొఫెసర్ ఒక్కరే ఉన్నారు. సదరు ప్రొఫెసర్ కూడా ఈ ఏడాది డిసెంబర్ లో రిటైర్​ కానున్నారు. ఈలోగా రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించకపోతే ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం ఈ కాలేజీ భవితవ్యం కూడా ప్రమాదంలో పడే ప్రమాదముంది. అలాగే కేయూ పరిధిలోని కొత్తగూడెం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ను నియమిస్తూ మార్చి 13న రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపాల్ గా కొనసాగాలంటే ప్రొఫెసర్ హోదా ఉండాలి. ఒకవేళ అర్హత కలిగిన వారు లేకపోతే రెగ్యులర్ అధ్యాపకుల్లో సీనియర్ అధ్యాపకుడిని నియమించాలి. కానీ అక్కడ పనిచేసే నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లని పక్కన పెట్టి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ను ప్రిన్సిపాల్ గా నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

రిక్రూట్​మెంట్​ లేటైతే ఇబ్బందే

ఒక వైపు యూనివర్సిటీల్లో రిక్రూట్​మెంట్​లేకపోవడం, మరోవైపు సీనియర్ ప్రొఫెసర్ల రిటైర్​మెంట్​తో రెగ్యులర్ అధ్యాపకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) గుర్తింపు గడువు ముగిసింది. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో రీఅక్రిడిటేషన్ కు వెళ్లేందుకు వైస్ చాన్స్ లర్లు వెనకంజ వేస్తున్నారు. పాత అక్రిడిటేషన్ కూడా రాకపోగా.. ఇంకా గ్రేడ్ పడిపోయే అవకాశం ఉందనే భయంతోనే న్యాక్ గుర్తింపు కోసం అప్లై చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాక్,       ఎన్​బీఏ అక్రిడిటేషన్‌లో కావాల్సిన ర్యాంకింగ్ సాధించకపోతే యూజీసీ, ఐసీఎస్ఎస్ఆర్, సీఎస్ఐఆర్ లాంటి సెంట్రల్ ఏజెన్సీల నుంచి  రీసెర్చ్, డెవలప్​మెంట్​ గ్రాంట్లు ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రతి వర్సిటీలో గత రిక్రూట్​మెంట్లకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నందున, అవి తొందరగా కొలిక్కి వచ్చే అవకాశం లేదని, అలాగే రిక్రూట్​మెంట్​ప్రాసెస్ కు పట్టే టైమ్​ను, కోర్సుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రిటైర్​మెంట్​ వయస్సు పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.