పంచాయతీ సెక్రటీలరపై పొద్దున్నుంచి రాత్రి దాకా నిఘా

పంచాయతీ సెక్రటీలరపై పొద్దున్నుంచి రాత్రి దాకా నిఘా
  •     ఉదయం 7కే పంచాయతీకెళ్లి.. సెల్ఫీ పంపాలని ఆదేశాలు 
  •     రోజంతా వాళ్ల లొకేషన్లను పెద్దాఫీసర్లు తెలుసుకునే చాన్స్ 
  •     తమపైనే పర్యవేక్షణ ఎందుకని సెక్రటరీల ప్రశ్న 
  •     యాప్ డౌన్​లోడ్ చేసుకోకుండా నిరసన  
  •     ఇయ్యాల్టి నుంచే కొత్త అటెండెన్స్ విధానం అమల్లోకి  

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ సెక్రటరీలు, మండల పంచాయతీ ఆఫీసర్ (ఎంపీవో)లను క్యాప్చర్ జీపీ లోకేషన్ అటెండెన్స్ కలవర పెడుతోంది. సెక్రటరీలు, ఎంపీవోలు ఉదయం 7 గంటలకే గ్రామ పంచాయతీల్లో ఉండాలని, అక్కడి నుంచే లోకేషన్ ఆధారంగా అటెండెన్స్ వేసుకోవాలని పెట్టిన రూల్ వారిని టెన్షన్ పెడ్తోంది. లేటైతే మెమోలు, సస్పెన్షన్ తప్పవేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. పల్లె ప్రగతి, హరితహారంతో గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా మార్చామని ప్రభుత్వ పెద్దలు ఒకవైపు ప్రశంసిస్తూ, ఇంకోవైపు తమ మెడపై ఇలా కత్తి పెట్టడమేమిటని సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ, హరిత హారం, పల్లె ప్రగతి, పారిశుధ్యం, ఇంటి పన్నుల వసూళ్లు, సర్టిఫికెట్ల జారీ తదితర పనులతో ఒత్తిడికి గురవుతున్న తమను ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలతో మరింత టెన్షన్ పెడుతోందని వాపోతున్నారు. మూడేళ్ల ప్రొబేషనరీ పిరియడ్ ను ప్రభుత్వం నాలుగేళ్లకు పెంచిందని, ఒక జాబ్ చార్ట్ అంటూ లేకుండా ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు రోజూ12, 13 గంటలపాటు పని చేయిస్తూ తమను కట్టుబానిసలుగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  సెక్రటరీల కదలికలపై నిఘా.. 

పంచాయతీ సెక్రటరీలపై ఇక మీదట నిరంతరం సర్కార్ నిఘా కొనసాగనుంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి డీఎస్ఆర్ మొబైల్ యాప్ ఒకసారి డౌన్ లోడ్ చేసుకుని క్యాప్చర్ జీపీ లొకేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి తాము పని చేస్తున్న పంచాయతీ ఆఫీసు నుంచి సెల్ఫీ దిగి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా లైవ్ ఫొటో అప్ లోడ్ చేస్తేనే అటెండెన్స్ పడుతుంది. ఈ నెల16 నుంచే ఈ యాప్ ను ట్రయల్ చేస్తున్నప్పటికీ.. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని పెద్దాఫీసర్లు ఆదేశాలిచ్చారు. హాజరు తర్వాత ఆ పంచాయతీ సెక్రటరీ ఎన్ని చోట్లకు వెళితే అన్ని కచ్చితమైన లొకేషన్లతో లింక్ చేస్తూ ఆ యాప్ పెద్దాఫీసర్లకు చూపించనుంది. ఏ ఉద్యోగికి ఇలాంటి అటెండెన్స్ లేదని, తమనే ఎందుకు ఇలా ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని సెక్రటరీలు ప్రశ్నిస్తున్నారు.

యాప్ డౌన్​లోడ్ చేసుకోకుండా నిరసన 

యాప్ బేస్డ్ అటెండెన్స్​ను రద్దు చేయాలని ఇప్పటికే పంచాయతీ రాజ్ కమిషనర్​కు వినతిపత్రం ఇచ్చిన సెక్రటరీలు.. సర్కార్ నిర్ణయం మార్చుకోకపోవడంతో యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 మంది ఉండగా..  3,639 మంది మాత్రమే డౌన్​లోడ్ చేసుకున్నారు. డౌన్​లోడ్ చేసుకున్న చాలా మంది కూడా యాప్​ను తీసేశారు. కేవలం సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో సగం మంది కూడా యాప్​ను ఇన్ స్టాల్ చేసుకోలేదు. మెదక్, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, జనగాం, నారాయణపేట, వికారాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 30 మందిలోపే డౌన్​లోడ్ చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 మందికి ఆరుగురు, భద్రాద్రి కొత్తగూడెంలో 481 మందికి 11 మంది, యాదాద్రి భువనగిరిలో 421 మందికి 9 మంది, వనపర్తి జిల్లాలో 255 మందికి ఐదుగురు, జోగులాంబ గద్వాల జిల్లాలో 255 మందికి ఇద్దరు మాత్రమే డౌన్​ లోడ్ చేసుకున్నారు.  

మరింత పెరిగిన పని ఒత్తిడి 

సెక్రటరీలపై ప్రభుత్వం రోజురోజుకు పని భారం పెంచుతోంది. రోజూ పారిశుధ్యం, హరితహారం, మంచినీటి సరఫరా, స్ట్రీట్ లైట్స్, సర్టిఫికెట్ల జారీ, పల్లె ప్రకృతి వనాలు, విలేజీ నర్సరీలు, రికార్డుల నిర్వహణలాంటి అనేక పనులను చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు ఉపాధి హామీ పనుల గుర్తింపు, పనులు చేయించడం కూడా వీళ్ల బాధ్యతనే. కూలీలు రాకపోయినా, పనులు చేయకపోయినా సెక్రటరీలకు మెమోలు ఇస్తున్నారు. ఈ పనుల నిర్వహణ తలనొప్పిగా మారిందని సెక్రటరీలు వాపోతున్నారు. 

యాప్ బేస్డ్ అటెండెన్స్ ఎత్తేయాలి

పంచాయతీ సెక్రటరీలు ఇప్పటికే చాలా పని ఒత్తిడికి గురవుతున్నారు. తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటికి వెళితే తిరిగి ఇంటికి చేరేసరికి రాత్రవుతోంది. దీంతో కుటుంబపరంగా చాలా ఇబ్బందులు పడ్తున్నారు. ఒత్తిడి  భరించలేక రెండేండ్లలో 2 వేల మంది రిజైన్ చేసి వెళ్లిపోయారు. పంచాయతీ సెక్రటరీలు ఎంత చిత్తశుద్ధితో పని చేసినా ప్రభుత్వం ఇలా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా, అవమానించేలా యాప్ తీసుకురావడం సరికాదు. ఇప్పటికైనా ఈ యాప్ బేస్డ్ అటెండెన్స్ విధానాన్ని ఎత్తేయాలి.  
- మధుసూదన్ రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్