ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అధికారులు గంటల పాటు తనింట్లో సోదాలు జరిపినట్లు.. తన బట్టలతో పాటు పిల్లల బట్టలను కూడా తనిఖీలు చేశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. సోదాల్లో ఏవీ కనిపించలేదని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేజ్రీవాల్ సర్కార్ ను కూల్చేందుకు బీజేపీ కుట్రపన్నిందని.. ఆప్ నేతలు ఆరోపించారు. ఇటీవలే ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా నివాసంలో జరిగిన సీబీఐ దాడుల గురించి ప్రస్తావించారు. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ 2021-22 లో అవకతవకలు జరిగాయని ఆరోపణలతో సిసోడియా నివాసంతో పాటు.. 31 చోట్ల సీబీఐ దాడులు జరిపింది.
ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ సీరియల్ కిల్లర్ గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇంకా 1000 దాడులు చేసుకోండి.. కానీ.. ఏమీ కనుగోలేరని చెప్పారు. విద్యను ముందుకు తీసుకెళ్లే దిశగా పని చేయడం జరుగుతోందని, చేసిన మంచి పనిని ప్రపంచం మెచ్చుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. రూల్ 280 కింద ప్రశ్నలు స్వీకరించని డిప్యూటీ స్పీకర్ నిర్ణయంపై బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు,ఆప్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగి.. సభలో గందరగోళం నెలకొంది. దీంతో.. సభను కొద్దిసేపు వాయిదా వేశారు డిప్యూటీ స్పీకర్. అయినా బీజేపీ నినాదాలు ఆగకపోవడంతో.. వారిని సభ నుంచి బయటకు పంపివేశారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ బయట బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన చేశారు.

