ట్రక్కు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టు నుంచి తొలగించిన CEC

ట్రక్కు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టు నుంచి తొలగించిన CEC

ట్రక్కు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టు నుంచి తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత… ట్రక్కు గుర్తుతో జరిగిన నష్టాన్ని గుర్తించిన TRS.. ఆ గుర్తును తొలగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. TRS ఎంపీలు ఈసీని కలిసి టీఆర్ఎస్‌కు జరిగిన నష్టాన్ని వివరించారు. పార్టీ అధినేత కేసీఆర్ కూడా CEC ని కలిసి ట్రక్కు గుర్తును ఈవీఎంల నుంచి తొలగించాలని కోరారు. టీఆర్ఎస్ వినతికి స్పందించిన ఎన్నికల సంఘం.. ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో TRS పార్టీ కచ్చితంగా వంద సీట్లు గెలుస్తుందని ప్రచార సమయంలో సీఎం కేసీఆర్ అనేక సార్లు చెప్పారు. ఫలితాలు కూడా అందుకు దగ్గరగానే వచ్చాయి. ఆ పార్టీ 88 స్థానాలను గెలుచుకుని బంపర్ మెజార్టీతో రెండోసారి అధికారాన్ని చేపట్టింది. అయితే, కేసీఆర్ చెప్పిన 100 సీట్ల టార్గెట్‌కు 12 సీట్ల దూరంలో ఆగిపోయింది. ఫలితాలపై విశ్లేషించుకున్న TRS.. EVMలలో ఉన్న ట్రక్కు గుర్తే పలుచోట్ల పార్టీకి విజయాన్ని దూరం చేసిందని నిర్ధారించుకుంది. చాలా నియోజకవర్గాల్లో ఈసీ స్వతంత్ర అభ్యర్థులకు ట్రక్కు గుర్తును కేటాయించింది. ట్రక్కు గుర్తు.. కారు గుర్తును పోలి ఉండడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఓట్లు ట్రక్కు గుర్తు కలిగిన అభ్యర్థులకు పడ్డాయి. అంతగా చదువుకోని వారు, ముసలివాళ్లు… కారు గుర్తు అనుకుని ట్రక్కు గుర్తుపై ఓటును నొక్కేశారు. దీంతో పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. మరికొన్ని చోట్ల మెజార్టీ తగ్గితే, ఇంకొన్ని చోట్ల తక్కువ మెజార్టీతో బయటపడాల్సి వచ్చింది.