పామాయిల్ సాగుకు కేంద్రం ప్రోత్సాహం

పామాయిల్ సాగుకు కేంద్రం ప్రోత్సాహం
  • రూ.11వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన

న్యూఢిల్లీ: వంటనూనె ధరల తగ్గిపుపై దృష్టి సారించిన కేంద్రం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలు అదుపులో పెట్టడంతోపాటు.. రైతులకు చేయూతనిచ్చేలా రూ.11 వేల 40 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
ముఖ్యంగా కరోనా సమయంలో వంట నూనెలు దేశీయంగా సరిపడినంతగా లేకపోవడంతో ధరలు అదుపు చేయడం కోసం విదేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే దిగుమతుల ఖర్చులు పెరగడంతో వంటనూనెల ధరలు అదుపుచేయడం ఒకదశలో సవాల్ గా మారింది. ఈ క్రమంలో దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు రైతులను ప్రోత్సహించే విషయంలో  కేబినెట్ లో చర్చ జరిగింది. 'మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ - ఆయిల్ పామ్'ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దేశ వ్యాప్తంగా ఆయిల్ పామ్ సహా నూనె గింజల సాగు విస్తరణపై దృష్టిపెట్టాలని ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్-నికోబార్ దీవులపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. 
కేంద్ర కేబినెట్ వివరాలను వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు వివరిస్తూ సీడ్ గార్డెన్స్ కు సహకారం అందిస్తామన్నారు. అలాగే ఆయిల్ పామ్ రైతులకు ధరపై భరోసా కల్పించాలని నిర్ణయించామన్నారు. పథకం కోసం మొత్తం రూ. 11,040 కోట్లు కేటాయించడం జరిగిందని, మూలధన పెట్టుబడులు పెరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన వివరించారు. ఈ ప్యాకేజీ ద్వారా పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు హెక్టారకు 12వేలు చొప్పున ఇస్తున్న సబ్సిడీని రూ.29 వేలకు పెరుగుతుందని ఆయన తెలిపారు. గరిష్టంగా 15 హెక్టార్లకు కోటి రూపాయల వరకు సహాయం అందుతుందని ఆయన తెలిపారు. కేంద్రం తాజా నిర్ణయం వల్ల దిగుమతి భారం తగ్గడంతో పాటు రైతులకు ఆదాయం పెరుగుతుందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.