న్యూఢిల్లీ: డెంగీ ముప్పు పొంచి ఉందని, వైరస్ వ్యాప్తిపై అలర్ట్ గా ఉండాలని తెలంగాణ, ఏపీ సహా 11 రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. రానున్న రోజుల్లో ప్రధానంగా సీరోటైప్ 2 డెంగీ వేరియంట్ కేసులు సవాల్ గా మారనున్నాయని తెలిపింది. ఇతర డెంగీ రకాల కన్నా ఈ వేరియంట్ స్పీడ్ గా వ్యాపిస్తుందని, మరింత ప్రమాదకరంగా మారుతుందని చెప్పింది. పలు రాష్ట్రాల్లో డెంగీ వ్యాప్తి, కరోనా పరిస్థితిపై కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సెక్రటరీ రాజేశ్ భూషణ్శనివారం ఈ మేరకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డెంగీ విషయంలో ముందస్తుగానే చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు. ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో సీరోటైప్ 2 డెంగీ ముప్పు పొంచి ఉన్నట్లు పేర్కొన్నారు.
డెంగీ కేసులను ముందుగా గుర్తించి, ట్రీట్‌మెంట్లు చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు హెల్త్ సెక్రటరీ సూచించారు. టెస్ట్ కిట్లు సిద్ధంగా ఉంచాలని, ఫీవర్ హెల్ప్ లైన్లు, మందులను రెడీ చేసుకోవాలని తెలిపారు. డెంగీ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కూడా పెంచాలన్నారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసుకోవాలని, కాంటాక్ట్ ట్రేసింగ్, ఫీవర్ సర్వే చేపట్టాలన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో తగినంత బ్లడ్, బ్లడ్ కాంపోనెంట్స్ ఉండేలా చూడాలని తెలిపారు. డెంగీ దోమల లార్వాలను నాశనం చేసేందుకు లార్విసైడ్ లు అందుబాటులో ఉంచాలని, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పండగల సీజన్ లో కరోనా కేసులు పెరిగే ప్రమాదం కూడా ఉందని, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 15 రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు.
నార్త్ స్టేట్స్ లో 100 డెంగీ డెత్స్
డెంగీ కేసులు యూపీ, మధ్యప్రదేశ్ వంటి నార్త్ స్టేట్స్ లో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇటీవల నార్త్ స్టేట్స్ లో సుమారు 2,500 డెంగీ కేసులు నమోదు కాగా, సుమారు 100 మంది చనిపోయారు. వీరిలో పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా యూపీలోని ఫిరోజాబాద్ లో గత కొన్ని రోజుల్లోనే దాదాపు 62 మంది డెంగీ, వైరల్ ఫీవర్ కారణంగా చనిపోయారని తెలిపారు.
