బిర్లా ఎ1 సిమెంట్ ఇస్తానని చీటింగ్

బిర్లా ఎ1 సిమెంట్ ఇస్తానని చీటింగ్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: బిర్లా ఎ1 సిమెంట్ ​కంపెనీ పేరుతో టోల్ ఫ్రీ నంబర్ క్రియేట్ చేసి రూ.2.60 లక్షలు కొట్టేసిన బిహార్​కు చెందిన యువకుడిని సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్పీ అఖిల్ మహాజన్​ మంగళవారం ఆ వివరాలు తెలియజేశారు. బిహార్ కు చెందిన కుందన్ కుమార్(25) సిమెంట్ కంపెనీల పేరుతో తప్పుడు వివరాలు, టోల్​ ఫ్రీ నంబర్లు క్రియేట్ ​చేసి ఇంటర్​నెట్​లో పెట్టాడు. 

బిర్లా కంపెనీ పేరుతో ఆన్‌లైన్‌లో టోల్ ఫ్రీ నంబర్1800 419 2877  క్రియేట్​ చేశాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన ఉత్తం అంజయ్య సిమెంట్​ అవసరముండి ఈ నెల 9న ఆన్‌లైన్​లో వెతికి సదరు టోల్​ఫ్రీ నంబర్‌‌కు  కాల్ చేశాడు. 640 బస్తాల సిమెంట్ ​కావాలని  అడగడంతో రూ.1,69,600 చెల్లించాలని కుందన్ ​కోరాడు. నిజమేనని నమ్మిన అంజయ్య అతడి అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్​ చేశాడు. మరుసటి రోజు కుందన్.. అంజయ్యకు ఫోన్ చేసి వెయ్యి బస్తాలకు డబ్బులు చెల్లిస్తేనే సిమెంట్ పంపిస్తానని చెప్పడంతో మరో 340 బస్తాల కోసం రూ.95,400 డిపాజిట్ ​చేశాడు. మరోసారి రూ.11వేలు పంపించాలని చెప్పడంతో అంజయ్యతాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. 

సీఐ మొగిలి ఆధ్వర్యంలో సైబర్ సెల్ ఎస్ఐ  శ్రీకాంత్ తన టీంతో ఎంక్వైరీ చేసి కుందన్‌కుమార్‌‌ను నిందితుడిగా గుర్తించారు. అతడు బిహార్​ నుంచి మోసాలు చేస్తున్నట్టు తెలుసుకున్నారు. ఈ నెల10న రాత్రి ఎస్‌ఐ టీంతో నిందితుడు ఉండే బిహార్‌‌లోని నలంద జిల్లా చమర్ వెళ్లారు. మొబైల్ సిగ్నల్స్​ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకువచ్చారు. నిందితుడి నుంచి రూ.2.60 లక్షల నగదు, ఆరు సిమ్‌ కార్డులు, పాస్​బుక్ ​స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.