ఇదిగో గిఫ్ట్ తెచ్చేశా..

ఇదిగో గిఫ్ట్ తెచ్చేశా..

అమ్మానాన్నల పుట్టినరోజు, పెండ్లి రోజు లేదా ఫ్రెండ్స్​ బర్త్​డే... ఇలా స్పెషల్ డేస్​ ఉన్నప్పుడు గిఫ్ట్స్​ ఇవ్వాలని చిన్న పిల్లలు తెగ ఉత్సాహపడతారు. కానీ గిఫ్ట్​ కొనాలంటే అమ్మానాన్నలే డబ్బులు ఇవ్వాలి. అలాంటప్పుడు వాళ్లు తల్లిదండ్రులని డబ్బులు అడిగితే ‘నువ్వు పెద్దయ్యాక సంపాదించి కొనొచ్చు.. ఇప్పుడేం వద్దు’ అని అంటారా? అయితే అలా అనొద్దు అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్​లు. ఎందుకంటే పిల్లలు గిఫ్ట్స్​ ఇస్తామని అడిగినప్పుడు ‘ఓకే’ చెప్తే... పిల్లల్లో ఓ ఐదు ఇంపార్టెంట్ లైఫ్​ స్కిల్స్​ డెవలప్​ అవుతాయి అంటున్నారు చైల్డ్​ సైకాలజిస్ట్​లు.

‘‘గిఫ్ట్స్​  ఇవ్వడం వల్ల పంచుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం వంటివి తెలుస్తాయి. ఎంపతీ(సహానుభూతి) ఫీలవడం అనేది చిన్నప్పట్నించే అలవాటు అవుతుంది. పిల్లల ఎదుగుదలలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం​ అనేది చాలా మంచి రోల్ ప్లే చేస్తుంద’’ని న్యూయార్క్​ యూనివర్సిటీలో ఎర్లీ చైల్డ్​హుడ్​ ఎడ్యుకేషన్​ ప్రోగ్రామ్​ డైరెక్టర్​ ఎరిన్​ ఓ కోనర్​ చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ అలవాటు పిల్లల్ని బెటర్​ పీపుల్​గా తయారు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఐదు స్కిల్స్​ బాగా డెవలప్​ అవుతాయి. అవేంటంటే...

జ్ఞానంలో సాయం...

గిఫ్ట్​ ఇవ్వాలనే ఆలోచన వచ్చిన తరువాత ఏ సందర్భానికి? ఎలాంటి గిఫ్ట్​? ఇవ్వాలి అనేదాని గురించి ఆలోచిస్తారు. కళ్లముందు ఉండే రకరకాల గిఫ్ట్స్​ నుంచి ఒకదాన్ని ఎంపిక చేసుకుని ఇవ్వాలంటే బుర్రకి పని చెప్పాల్సిందే! పిల్లలకు నాలుగేండ్ల వయసు వచ్చేవరకు అవతలి వాళ్ల పాయింట్​ నుంచి అర్థంచేసుకునే సామర్ధ్యం డెవలప్​ కాదు. 

అలాగని అంతకంటే ముందు నుంచి ఇప్పించకూడదా అంటే ఇవ్వొచ్చు... కాకపోతే టెంపర్​ టాంట్రమ్స్​ పెరిగే అవకాశం ఉంటుంది. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు 18 నెలల వయసునుంచే గిఫ్టింగ్ కల్చర్​ అలవాటు చేయాలి అనుకుంటారు. అలాంటప్పుడు పిల్లలకు నచ్చిన బొమ్మ ఏదైనా వేయమనండి. ఇలా చేయడం వల్ల మెదడు చురుకుగా తయారవుతుంది.

కమ్యూనికేషన్​ పెరుగుతుంది

గిఫ్ట్స్​ ఇవ్వడం వల్ల సంభాషణ, ఒకరితో ఒకరికి కనెక్టివిటీ పెరుగుతుంది . ఐదేండ్ల నుంచి ఆరేండ్ల వయసు పిల్లలు ఇచ్చే గిఫ్ట్స్​ లేదా బొమ్మలు ... ఆ పిల్లలకు ఏం కావాలి అనుకుంటున్నారో అవే గిఫ్ట్​గా ఇవ్వాలి అనుకుంటారు. అందుకే పిల్లలు వాళ్ల స్నేహితులకి గిఫ్ట్స్​ ఇవ్వాలి అనుకున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ‘మీ ఫ్రెండ్స్​కు ఎలాంటి గిఫ్ట్స్ నచ్చుతాయి?’, ‘నువ్వు ఏం గిఫ్ట్​ ఇవ్వాలి అనుకుంటున్నావు?’ వంటి ప్రశ్నలు అడగాలి. ఇలా అడగడం వల్ల పిల్లలు ఆలోచిస్తారు. అలాగే రిటర్న్​ గిఫ్ట్స్​ ఎక్స్​పెక్ట్​ చేస్తున్నారా అనేది కూడా అర్థమవుతుంది.

ఏం కొనాలనే సంభాషణను పక్కన పెడితే, గిఫ్ట్​ ఇవ్వాలనే ఆలోచనే పిల్లల్లో నాన్​ వెర్బల్ కమ్యూనికేషన్​ను ప్రోత్సహిస్తుంది. వాళ్లలోని ప్రేమను గిఫ్ట్​ రూపంలో వ్యక్తం చేస్తారు. అలాగే గిఫ్ట్​ తీసుకునేవాళ్ల ముఖంలోని హావభావాలు గమనిస్తారు కాబట్టి అవతలి వాళ్లు మాట్లాడకుండా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తే కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

సెన్సరీ ఎక్స్​పీరియెన్స్​

పిల్లల్లో మోటార్​ స్కిల్స్​ పెంచాలంటే వాళ్లు స్వయంగా తయారుచేసిన గిఫ్ట్స్​ ఇవ్వడాన్ని ఎంకరేజ్​ చేయాలి. సెన్సరీ ప్లే అనేది పిల్లల్లో ప్రాబ్లమ్​ సాల్వింగ్​ స్కిల్స్​ పెంచుతుంది. శరీరం గురించి అవగాహన కలుగుతుంది. ఒకవేళ సొంతంగా తయారుచేయకపోయినా పర్వాలేదు. షాపులో కొన్న గిఫ్ట్స్​ని ర్యాప్​ చేయమనండి.  అది కూడా మోటార్​ స్కిల్స్​ ప్రాక్టీస్​కి పనికొస్తుంది. వాళ్లకు నచ్చిన  యాక్టివిటీ చేసినట్టు ఉంటుంది.

సృజనాత్మకత..

పెద్దవాళ్ల కంటే పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల బుర్రల్లో ఆలోచనలు, జడ్జిమెంట్స్​ పెద్దవాళ్లకి ఉన్నట్టు ఉండవు. అందుకే వాళ్లు ఆలోచించి ఇచ్చే గిఫ్ట్​లో క్రియేటివిటీ ఉంటుంది. చేతితో తయారుచేసిన వాటిలో అయితే అదింకా పెరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అవుటాఫ్​ ద బాక్స్’​ ఆలోచనలకు ఈ టెక్నిక్​ కారణం అవుతుంది.

ఎమోషనల్​ ఇంటెలిజెన్స్​

గిఫ్టింగ్ వల్ల అవతలి వాళ్ల స్థానంలో ఉండి ఆలోచించడం, కృతజ్ఞత  వంటి ఎమోషనల్ స్కిల్స్​ పెరుగుతాయి. సోషల్ రిలేషన్​షిప్​లో వాళ్ల స్థానం అర్థం చేసుకోగలుగుతారు. ఆలోచించే శక్తి వృద్ధి చెందుతుంది. రకరకాల పరిస్థితులను అర్థం చేసుకునే సామర్ధ్యం పెరుగుతుంది. ఇలా గిఫ్ట్స్​ ఇవ్వడమే కాదు తీసుకోవడంలో కూడా ఎంత హుందాగా ఉండాలో తెలుస్తుంది పిల్లలకు.