గేల్‌ రాకతో పంజాబ్‌ రాత మారేనా!

గేల్‌ రాకతో పంజాబ్‌ రాత మారేనా!

షార్జా:  ప్లే ఆఫ్‌‌ ఆశలు సజీవంగా ఉంచుకోవడమే లక్ష్యంగా కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌ కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం ఇక్కడ జరిగే లీగ్‌‌ మ్యాచ్‌‌లో విరాట్‌‌ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు(ఆర్‌‌సీబీ)తో తలపడనుంది. ఇప్పటిదాకా లీగ్‌‌లో ఏడు మ్యాచ్‌‌లాడిన పంజాబ్‌‌ ఒకే ఒక్క విజయం సాధించింది. ఆ ఒక్కటీ బెంగళూరుపైనే గెలిచింది. మరోపక్క ఫ్యాన్స్‌‌ ఎదురుచూస్తున్న  యూనివర్స్‌‌ బాస్‌‌ క్రిస్‌‌ గేల్‌‌  ఈ మ్యాచ్‌‌లో బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. గేల్‌‌ రాకతో  అదృష్టం కూడా తమ వెంట వస్తుందని పంజాబ్‌‌ భావిస్తోంది. షార్జా స్టేడియం చిన్నది, స్లో వికెట్‌‌ కావడంతో గేల్‌‌ నుంచి జట్టు భారీగా ఆశిస్తోంది.  అయితే, పంజాబ్‌‌.. జట్టుగా రాణించకపోతే బెంగళూరును అడ్డుకోవడం అసాధ్యం. ఎందుకంటే  ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌‌లాడిన ఆర్‌‌సీబీ ఐదు విజయాలు సాధించి ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. గేల్‌‌ తుది జట్టులోకి వస్తే మ్యాక్స్‌‌వెల్‌‌ బెంచ్‌‌కు పరిమితం అవుతాడు.  నిజానికి పంజాబ్‌‌కు బ్యాటింగ్‌‌లో పెద్దగా సమస్యల్లేవు. వారి  ఇబ్బందంతా  బౌలింగ్‌‌లోనే. షమీ, బిష్నోయ్‌‌ తప్ప మిగిలిన వారు అంచనాలు అందుకోవడం లేదు. మరీ ముఖ్యంగా డెత్‌‌ ఓవర్లలో తేలిపోతున్నారు. ఇది పరిష్కారం కాకపోతే బెంగళూరును ఆపడం చాలా కష్టం. కోహ్లీ, ఫించ్‌‌, డివిలియర్స్‌‌, పడిక్కల్‌‌తో ఆర్‌‌సీబీ బ్యాటింగ్‌‌లో అదరగొడుతోంది. పైగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ టీమ్‌‌ బౌలర్లు ఈసారి ఉమ్మడిగా రాణిస్తున్నారు. చహల్‌‌, సుందర్‌‌ తమ స్పిన్‌‌తో దుమ్ములేపుతుంటే.. క్రిస్‌‌ మోరిస్‌‌ రాకతో జట్టు బ్యాలెన్స్‌‌ మరింత పెరిగింది. గత ఓటమికి బదులు చెప్పాలని కోహ్లీ సేన చూస్తున్న నేపథ్యంలో.. బౌలర్లు రాణించకపోతే పంజాబ్‌‌కు మరో ఓటమి తప్పదు.