- సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్
జూబ్లీహిల్స్, వెలుగు: పోలీసు వృత్తి విధి నిర్వహణ మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యత అని సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. నగర చరిత్రలో తొలిసారిగా పోలీసులకు ‘ఎక్స్ట్రా మైల్’ పురస్కారం, ‘గుడ్ వర్క్ డన్’ రివార్డులను ఆయన అందజేశారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ పోలీసు అధికారులతో కలిసి ఆయన ఈ అవార్డులను ప్రదానం చేశారు.
విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 271 మందికి పురస్కారాలు, ఉత్తమ సేవలు అందించిన 1,175 మందికి రివార్డులు అందజేశారు. పోలీసుల అసాధారణ ప్రతిభ, వినూత్న ఆలోచనలను గుర్తించేందుకే ‘ఎక్స్ట్రా మైల్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని సజ్జనార్ చెప్పారు.
