జడ్జిల కొరత.. కేసులు పెండింగ్

జడ్జిల కొరత.. కేసులు పెండింగ్
  • ఇండియన్‍ జ్యుడీషియల్‍ ఇన్‍ఫ్రాస్ట్రక్చర్‍ కార్పొరేషన్‍ అవసరం
  • వరంగల్‍ వంటి కోర్టు 
  • బిల్డింగులు దేశమంతా కట్టాలి
  • 10 కోర్టుల బిల్డింగ్‍లను ప్రారంభించిన జస్టిస్ రమణ

వరంగల్‍, వెలుగు: కోర్టుల్లో ఉండాల్సిన సంఖ్యలో జడ్జిలు, సౌలత్​లు లేకపోవడం వల్లే పెండింగ్‍ కేసుల సంఖ్య పెరుగుతోందని సుప్రీంకోర్టు చీఫ్‍ జస్టిస్‍ ఎన్వీ రమణ అన్నారు. ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీజేఐ ఆదివారం ఉదయం భద్రకాళి అమ్మవారు, వెయ్యి స్తంభాల గుడిలోని రుద్రేశ్వరుడిని దర్శించుకున్నారు. తర్వాత హనుమకొండ అదాలత్‍లో 10 కోర్టుల బిల్డింగుల కాంప్లెక్స్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ‘‘కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, జడ్జిల సంఖ్య పెంచడం, కరోనా ఎఫెక్ట్‌‌తో ఉపాధి కొల్పోయిన లాయర్లకు ఆర్థిక సాయం చేస్తేనే ప్రజలకు చేరువవుతాం. కేంద్రమిచ్చే నిధులకుతోడు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్‍ ఇస్తేనే కోర్టుల అభివృద్ధి సాధ్యం అవుతుంది’’ అని అన్నారు. 

తాను సీజేఐ అయ్యాక ఏయే రాష్ట్రాల్లోని కోర్టుల్లో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకుంటున్నానని, సౌలతుల్లేని కోర్టుల జాబితా రూపొందించానని జస్టిస్​ ఎన్వీ రమణ చెప్పారు. ఇండియన్‍ జ్యుడీషియల్‍ ఇన్‍ఫ్రాస్ట్రక్చర్‍ కార్పొరేషన్‍ ఏర్పాటు చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని, ఎలాంటి స్పందన రాలేదని, వచ్చే పార్లమెంట్‍ సమావేశాల్లోనైనా చట్టం తీసుకోస్తారని ఆశిస్తున్నానన్నారు.

యాక్సెస్ టు జస్టిస్
దేశవ్యాప్తంగా సిటీలు, పట్టణాల పరిధిలోని కోర్టుల్లో వైఫై సిస్టం ఉందని, గ్రామీణ ప్రాంత కోర్టుల్లో ఈ తరహా ఫెసిలిటీస్‍ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీజేఐ రమణ అభిప్రాయపడ్డారు. గ్రామీణ, జిల్లా ప్రాంతాల్లో మొబైల్‍ నెట్‍వర్క్ వ్యాన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రికి లెటర్‍ రాసినట్లు చెప్పారు. కార్పొరేట్‍ రెస్పాన్సిబిలిటీ స్కీం కింద తాలుకాకు ఒక మొబైల్‍ నెట్‍వర్క్ సర్వీస్‍ పెడితే ‘యాక్సెస్‍ టు జస్టిస్‍’ అనే మాటకు అర్థం ఉంటుందన్నారు. వరంగల్‍లో కొత్తగా నిర్మించిన కోర్టులు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. జస్టిస్‍ పి.నవీన్‍రావు పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న వరంగల్‍ కోర్ట్ బిల్డింగ్‍ తన కలలకు ప్రతిరూపమన్నారు. ఇక్కడి ఫెసిలిటీస్‍ ఏంటో తెలుపుతూ పుస్తకం లేదా వీడియో రూపొందిస్తే.. దాని ఆధారంగా దేశమంతా ఇలాంటి కోర్టులు నిర్మించాలని చెబుతానన్నారు. 

చట్టసభల్లో లాయర్లు తక్కువే
గాంధీ, నెహ్రూ, వల్లభ్​భాయ్‌ పటేల్‍ వారసులుగా ఒకప్పుడు లాయర్లు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారని జస్టిస్ రమణ అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్‍, అసెంబ్లీల్లో అడ్వకేట్ల సంఖ్య తగ్గుతోందని చెప్పారు. తెలంగాణలో అడ్వకేట్లు ప్రాణాలు, ఆస్తులను పోగొట్టుకుని ఈ ప్రాంత విముక్తి కోసం పాటుపడ్డారన్నారు.
దేశానికి ప్రధానిని ఇచ్చిన గడ్డ వరంగల్ రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగంలో వరంగల్‍ ముందుందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. బమ్మెర పోతన, పాల్కురికి సోమన, దాశరథి రంగచార్య, కాళోజీ నారాయణ రావు వంటి సరస్వతీ పుత్రులను, దేశానికి ప్రధానిని ఇచ్చిన గడ్డ అని కొనియాడారు. వరంగల్‌లో తనకు బంధువులు, మిత్రులు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్‍ జస్టిస్‍ పి.సతీశ్ చంద్ర శర్మ, జడ్జిలు జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఉజ్జల్‍ బుయాన్‍, జస్టిస్ పి.నవీన్‍ రావు, జిల్లా సెషన్స్ జడ్జి నందికొండ నర్సింగరావు పాల్గొన్నారు.