ఎన్నడూ లేని విధంగా తెలుగు భాషకు ముప్పు

ఎన్నడూ లేని విధంగా తెలుగు భాషకు ముప్పు

న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో ముప్పు పొంచి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాలంలో పోటీని ఎదుర్కొనేందుకు ఇతర భాషలు అవసరమేనని, అలాగని ఇంగ్లీష్​ కోసం తెలుగుని వదులుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని వీధి– అరుగు- నార్వే, సౌతాఫ్రికా తెలుగు సంఘం నిర్వహించిన అంతర్జాతీయ వర్చువల్ సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజ మార్పుని బట్టి సర్దుబాట్లు చేసుకోకపోతే భాషతో పాటు సంస్కృతికీ తిప్పలు తప్పవన్నారు. మాతృభాషను కాపాడుకోవడానికి మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. 

తెలుగు అర్థం కావాలంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్​పై ఆధారపడ్తున్నరు

ప్రపంచ వ్యాప్తంగా విముక్తి కోసం సాగిన ప్రతి ఉద్యమానికి మాధ్యమం మాతృభాషేనని ఎన్వీ రమణ అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ స్థానిక భాషల్లో వచ్చిన రచనలే ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయన్నారు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ తెలుగు పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. తెలుగు సినిమా అర్థం కావాలంటే ఇంగ్లీష్​లో సబ్ టైటిల్స్ చూడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మాటలోనూ ఇతర భాషా పదాల్ని కలుపుకుని అదే అసలైన తెలుగేమోననే భ్రమలు కల్పిస్తున్నారని అన్నారు.