కరీంనగర్ కేంద్రంగా గ్రానైట్​ వార్​

కరీంనగర్ కేంద్రంగా గ్రానైట్​ వార్​
  • ఉల్లంఘనలపై సాక్ష్యాలతో కేంద్రానికి ఎంపీ ఫిర్యాదు
  • గ్రానైట్​ పరిశ్రమను దెబ్బతీసే కుట్రేనంటున్న గంగుల వర్గీయులు
  • రోడ్డెక్కిన గ్రానైట్​ వ్యాపారులు, కార్మికులు
  • ఆందోళన వెనుక మంత్రి హస్తం ఉందంటున్న సంజయ్​వర్గీయులు
  • రాష్ట్రంలో హాట్​టాపిక్​లా కరీంనగర్​ పరిణామాలు

కరీంనగర్​ కేంద్రంగా వేల కోట్ల సంపదను సృష్టిస్తున్న గ్రానైట్​ ఇండస్ట్రీ, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్​, ఎంపీ బండి సంజయ్ కుమార్​ నడుమ సరికొత్త​ వార్​కు తెరలేపింది. జిల్లాలో గ్రానైట్​ తవ్వకాలు, రవాణాలో ఉల్లంఘనలపై కేంద్రానికి ఎంపీ ఫిర్యాదు చేయడంతో మొదలైన వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. గ్రానైట్ వ్యాపారంతో అంచెలంచెలుగా పైకి ఎదిగిన మంత్రి, ఆయన వర్గీయులకు సహజంగానే ఎంపీ చర్య మింగుడు పడడంలేదు. దీంతో సింగరేణి తర్వాత ఆ స్థాయిలో ఉన్న గ్రానైట్​పరిశ్రమను దెబ్బతీసేందుకు ఎంపీ కావాలనే కుట్ర పన్నుతున్నారంటూ గ్రానైట్​ వ్యాపారులు, కార్మికులతో ఉద్యమాన్ని ఎగదోస్తున్నారు. ఇలా మంత్రి గంగుల, ఎంపీ సంజయ్​ నడుమ తారస్థాయికి చేరిన ఈ గ్రానైట్​ వార్​ ఎటు దారితీస్తుందోననే చర్చ, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారింది. కరీంనగర్‍, వెలుగు:

కరీంనగర్‍ జిల్లాలో చిన్నాచితకా కలిపి 100కు పైగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. మధ్యలో కొన్నేళ్లు సంక్షోభం కారణంగా కొన్ని క్వారీలు మూతపడ్డాయి. టీఆర్​ఎస్​ అధికారంలోకి రావడంతో మరోసారి పరిశ్రమ పుంజుకున్నది. ఎంపీ సంజయ్​, ఆయన వర్గీయులు చెబుతున్నదాని ప్రకారం.. ఈ ఒక్క జిల్లాలో సుమారు వంద క్వారీలు నడుస్తుండగా, తవ్వకాలు మొదలుకొని రవాణా దాకా అడుగడుగునా ఉల్లంఘనలే కనిపిస్తాయి. క్వారీల అనుమతులు తెచ్చుకోవడంతోనే అక్రమాలు మొదలవుతున్నాయి. సర్వే చేసి హద్దులు నిర్ణయించిన ప్రాంతం కొంతైతే, దానిని ఆసరగా చేసుకుని చుట్టు పక్కల ప్రభుత్వ, ప్రైవేట్​ భూములను ఆక్రమించుకొని తవ్వకాలు సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉదాహరణకు కరీంనగర్‍ జిల్లా శంకరపట్నంలో మూడెకరాల్లో క్వారీ తవ్వకాలకు నిర్వాహకులు అనుమతులు తీసుకున్నారు. తీరా ఇటీవల తహసీల్దార్‍ సర్వే చేస్తే ఏడెకరాల్లో తవ్వకాలు చేపడుతున్నట్లు తేలింది. పచ్చని గుట్టలను తొలిచాక వ్యర్థాలను పక్కనే ప్రభుత్వ, ప్రైవేట్​ స్థలాల్లో పడేస్తున్నారనీ, దీంతో వేల ఎకరాలు సాగుకు పనికిరాకుండా పోతున్నాయనీ, వందలాది ఎకరాల్లో అడవులు  నాశనమవుతున్నాయని ఎంపీ, ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. క్వారీలను అనుమతులకు మించి లోతుకు తవ్వడం ద్వారా  భూగర్భజలాలు పడిపోతున్నాయి. ఒకప్పుడు సీడ్​ బౌల్​ఆఫ్​ తెలంగాణగా ఖ్యాతి గాంచిన జిల్లాలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నది ఎంపీ వర్గీయుల ఆరోపణ.

అక్రమ మైనింగ్​పై ఎంపీ ఫిర్యాదు..

కరీంనగర్​ లోక్​సభ స్థానం నుంచి బీజేపీ తరుపున బండి సంజయ్​ విజయం సాధించింది మొదలు,  జిల్లాలో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న గ్రానైట్​ తవ్వకాలు,  రవాణాపై దృష్టిసారించారు. గ్రానైట్​ వ్యాపారం కారణంగా పలువురు అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తడం, మాస్​ లీడర్లుగా ఎదిగి, జిల్లా, రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న తీరును ఆయన ఇన్నాళ్లూ తనదైన శైలిలో గమనిస్తూ వచ్చారు.  ఈక్రమంలోనే పరిశ్రమను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, గ్రానైట్​ అక్రమ మైనింగ్​పై ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు, గవర్నర్​కు ఇటీవల ఫిర్యాదు చేశారు. గ్రానైట్​ వ్యతిరేక పోరుకు ఎంపీ బండి సంజయ్​ నేతృత్వం వహిస్తుండగా, అనుకూల వర్గానికి మంత్రి గంగుల కమలాకర్​ తెర వెనుక అండదండలు అందిస్తున్నారు.

మినరల్‍ డెవలప్ మెంట్ ఫండ్ ఎక్కడ?

2015 లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో డిస్ర్టిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు ఏర్పాటు చేసి వాటి ద్వారా  ఎఫెక్టెడ్  ఏరియాల్లో అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉంది.  ఆ ప్రాంతాల్లో శానిటేషన్​, తాగునీటి సదుపాయం, రోడ్లు తదితర  మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ జిల్లాలో ఎక్కడా అమలుకావడం లేదన్నది ఎంపీ వర్గీయుల వాదన. అధికలోడ్​తో వెళ్తున్న గ్రానైట్​ వాహనాల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయి.

రోడ్డెక్కిన గ్రానైట్​ అసోసియేషన్​..

గ్రానైట్​మైనింగ్​లో అక్రమాలపై  ‍ఎంపీ సంజయ్ కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో పాటు రాష్ట్ర గవర్నర్​ తమిళ సై, రైల్వే, షిప్పింగ్, విజిలెన్స్ తదితర శాఖలకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‍ లో ప్రెస్ మీట్ పెట్టి గ్రానైట్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు, గ్రానైట్ వ్యాపారాన్ని మాఫియాగా అభివర్ణించడం జిల్లాలో పెనుదుమారం లేపాయి. అక్రమరవాణాకు సంబంధించి ఇప్పటికే రైల్వే శాఖ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైనట్లు సమాచారం. దీనికి తోడు అనుమతులకు మించి తవ్వకాలు చేపడుతున్నారనే కారణంపై కొన్నిక్వారీలకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఉలిక్కి పడిన యాజమానులు ఇటీవల  కరీంనగర్​లో ప్రెస్ మీట్ నిర్వహించి తమ కష్ట సుఖాలను చెప్పుకున్నారు. అదే సమయంలో యజమానులు రెండువర్గాలుగా విడిపోయాయనే వార్తలు వచ్చాయి. వాతావరణం కాస్తా ఎంపీకి అనుకూలంగా మారుతున్న సంకేతాలతో  తెర వెనుక మంత్రి గంగుల కమలాకర్​ పావులు కదిపారు. ఆయన సూచనల మేరకే గ్రానైట్​ యజమానులు, కార్మికులు పెద్దసంఖ్యలో సోమవారం రోడ్డెక్కినట్లు చెబుతున్నారు.

కార్మిక చట్టాలు తుంగలో..

రాష్ట్రవ్యాప్తంగా గ్రానైట్​ ఇండిస్ట్రీలో రెండు లక్షల మంది కార్మికులు ఉన్నట్లు ఇటీవల పరిశ్రమ యాజమానులు స్వయంగా ప్రకటించారు. కానీ వారిలో కనీసం సగం మంది కార్మికులకు కూడా  లేబర్​ చట్టాలు అమలుకావడం లేదని ఎంపీ, ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్‍ లాంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో వర్తింపజేయడం లేదంటున్నారు.  ప్రమాదవశాత్తూ ఎవరైనాచనిపోయినా బాహ్యప్రపంచానికి తెలియనివ్వడం లేదని విమర్శిస్తున్నారు.

కోట్లలో పన్నుల ఎగవేత..

ఉత్పత్తి చేసిన ప్రతి క్యూబిక్ మీటర్​కు చిన్నరకమైతే రూ. 1700 , పెద్ద రకమైతే రూ. 2వేల చొప్పున సీనరేజీ చెల్లించాలి. కానీ యజమానులు అధికారులతో కుమ్మకై, తప్పుడు లెక్కలు చూపుతూ ప్రభుత్వానికి ఏటా వందల కోట్ల రూపాయల పన్నులు ఎగవేస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం  రాష్ట్రవ్యాప్తంగా గ్రానైట్​ వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి ఏటా రూ.700 కోట్ల మేర గండికొడుతున్నారని ఎంపీ వర్గీయులుచెబుతున్నారు. కటింగ్‍ ఫ్యాక్టరీల్లోనూ జీరో దందా నడిపిస్తున్నారు. కమర్శియల్ పేరిట స్థానికంగా విక్రయాలు చేపడుతూ,  ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

   ఎంపీ సంజయ్​ ఏమంటున్నారు?

  • తక్కువ విస్తీర్ణంలో క్వారీలకు అనుమతులు పొంది, ఎక్కువ విస్తీర్ణంలో గ్రానైట్​ తవ్వుతున్నారు.  చాలా క్వారీల యజమానులు సర్వే ప్రకారం నిర్ణయించిన హద్దులను ఉల్లంఘిస్తున్నారు.
  • క్వారీలలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు.
  • ఉత్పత్తి చేసిన ప్రతి క్యూబిక్ మీటర్​కు చిన్నరకమైతే రూ. 1700 , పెద్ద రకమైతే రూ. 2వేల చొప్పున సీనరేజీ చెల్లించాలి. కానీ అధికారులతో కుమ్మకై, తప్పుడు లెక్కలు చూపుతూ ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల పన్ను ఎగవేస్తున్నారు. కటింగ్‍ ఫ్యాక్టరీల్లోనూ జీరో దందా నడిపిస్తున్నారు.
  • పచ్చని గుట్టలను తొలిచాక వ్యర్థాలను పక్కనే ప్రభుత్వ, ప్రైవేట్​ స్థలాల్లో పడేస్తున్నారు. దీంతో వేలాది ఎకరాలు వ్యవసాయానికి పనికిరాకుండా పోతున్నాయి. వందలాది ఎకరాల్లో అడవులు దెబ్బతింటున్నాయి.
  • మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో డిస్ర్టిక్ట్​ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎఫెక్టెడ్  ఏరియాల్లో అభివృద్ధి పనులను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా పాటించడం లేదు.
  • నిబంధనలకు విరుద్ధంగా  అధికలోడ్​తో వెళ్తున్న గ్రానైట్​ వాహనాల కారణంగా వేల కోట్ల విలువజేసే రోడ్లు దెబ్బతింటున్నాయి.

గ్రానైట్​ వ్యాపారులు ఏమంటున్నారు..?

  • ఎంపీ బండి సంజయ్ గ్రానైట్ వ్యాపారులను మాఫియాగా అభివర్ణించడం సరికాదు.
  • మేము ప్రత్యక్షంగా వేలాదిమందికి, పరోక్షంగా లక్షలాది మంది కార్మికులకు ఉపాధి చూపుతున్నాం.  ఎంపీ చర్యల వల్ల పరిశ్రమ మూతపడితే వారంతా రోడ్డున పడాల్సి ఉంటుంది.
  • ఇప్పటికే గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ వ్యాపారం చేస్తున్నాం. ఎంపీ ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకోవాలి.