వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడాలని భట్టి విక్రమార్క డిమాండ్

వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడాలని భట్టి విక్రమార్క డిమాండ్

బీమా కోరేగావ్‌ కేసులో 2018 ఆగస్టులో అరెస్టయిన విరసం నేత వరవరరావు ఆరోగ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. వరవరరావు ఆరోగ్యం విషయంలో సీఎం కేసీఆర్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఆయ‌న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, తలోజా జైలులో ఉన్న ఆయనకు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలన్నారు. ఆలస్యం చేస్తే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వరవరరావుకు జైల్లో ఏదైనా జరిగితే అది రాజ్యం చేసిన ద్రోహం అవుతుందన్నారు. న్యాయస్థానాలు శిక్షించిన వారికి కూడా ఆరోగ్యం బాగలేకపోతే మెరుగైన వైద్యం అందిస్తారని ఆయన తెలిపారు. ఉరి శిక్ష వేసిన వారికి కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఉరి వాయిదా వేస్తారని, రోజుల తరబడి అనారోగ్యంతో ఉన్న వరవరరావును ప్రభుత్వాలు, పోలీసులు పట్టించికోకపోవడం శోచనీయమని భట్టి విక్రమార్క అన్నారు.