ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పనిచేసిందని ఆరోపించారు. జిల్లాల పునర్విభజనపై త్వరలో కమిషన్ వేస్తామని చెప్పారు. ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు రేవంత్ రెడ్డి.  ఎవరు అధికారంలోకి వచ్చినా ఇరు రాష్ట్రాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని వెల్లడించారు.

కాంగ్రెస్ కు 13 ఎంపీ సీట్లు పక్కా వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ లో బీజేపీ మూడోస్థానంలోకి పడిపోతుందన్నారు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థికి కనీసం 20వేల మెజారిటీ ఉంటుందని చెప్పారు. బీజేపీకి తెలంగాణలో వేవ్ లేదని.. బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కోసం పనిచేశారని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి 220 సీట్లకంటే మించి రావన్నారు. తనను జాతీయస్టార్ క్యాంపెయినర్ గా పార్టీనే నియమించిందని.. ఇతర రాష్ట్రాల్లో ప్రచారంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు సీఎం రేవంత్. రేపటి నుంచి పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టిపెడతానన్నారు.  

ఫోన్ ట్యాపింగ్ లో ఏం జరిగిందో అసెంబ్లీలో చెప్తామన్నారు రేవంత్ రెడ్డి. అకాలవర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందన్నారు. పదేండ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని.. వందేండ్లకు సరిపడా ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు రేవంత్. మూసీ కారిడార్ ను ఆదాయవనరుగా మార్చుతామని చెప్పారు. ట్రిపుల్ ఆర్ తెలంగాణ అభివృద్ధి విస్తరణకు అడ్రస్ గా మారబోతుందన్నారు సీఎం. వరంగల్ ను హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.