బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్

బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్

బ్యాంకులకు రూ. 34,000 కోట్ల మోసం కేసులో డిహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సిబిఐ అధికారులు మంగళవారం(మే 14) అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం అతన్ని ముంబైలో అదుపులోకి తీసుకుని, మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. 

నివేదికల ప్రకారం, 2022లో నమోదైన ఈ కేసుకు సంబంధించి వాధవాన్‌పై ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 17 బ్యాంకుల కన్సార్టియంను రూ. 34,000 కోట్ల మేర మోసం చేసిందని, ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ రుణ మోసంగా నిలిచిందని ఆరోపిస్తూ సీబీఐ.. డీహెచ్‌ఎఫ్‌ఎల్ కేసును నమోదు చేసింది. యెస్ బ్యాంక్ అవినీతి కేసులో వాధావాన్‌ను గతంలో ఏజెన్సీ అరెస్టు చేయగా.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

కపిల్ వాధావన్ DHFL ఛైర్మన్, ఎండీగా పనిచేశారు. ధీరజ్ వాధావన్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. సోదరులిద్దరూ డీహెచ్‌ఎఫ్‌ఎల్ బోర్డు సభ్యులు.

వైద్య కారణాలతో బెయిల్ కోరుతూ ధీరజ్ వాధావన్ చేసిన విజ్ఞప్తి మేరకు గత శనివారం ఢిల్లీ హైకోర్టు.. సీబీఐకి నోటీసు జారీ చేసింది. దీనిపై స్పందించాల్సిందిగా జస్టిస్ జ్యోతి సింగ్ సీబీఐని ఆదేశించారు. ఈ కేసు శుక్రవారం(మే 17) విచారణకు రానుంది. తనకు బెయిల్ నిరాకరించిన ట్రయల్ కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు. వాధావన్ ప్రస్తుతం వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత ముంబైలోని తన నివాసంలో కోలుకుంటున్నాడు.