V6 News

దేశంలో ఇత‌ర‌ రాష్ట్రాల‌తో పోలిస్తే తెలంగాణ‌లో క‌రోనా అదుపులో ఉంది

దేశంలో ఇత‌ర‌ రాష్ట్రాల‌తో పోలిస్తే తెలంగాణ‌లో క‌రోనా అదుపులో ఉంది

వైరస్ టెస్ట్ లు, బాధితుల‌కు అందిస్తున్న వైద్యంపై పూర్తి వాస్తవాలను అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు సమర్పించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

క‌రోనా వైర‌స్ పై సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సమీక్ష‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద‌ర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు వైద్య ఆరోగ్య‌శాఖ కు చెందిన ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

ఈ స‌మీక్ష‌లో కరోనా విషయంలో దాఖలవుతున్న పిల్స్, వాటిపై విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం, వైద్య సిబ్బంది చిత్త‌శుద్ధితో పనిచేస్తుంటే హైకోర్ట్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంపై ప‌లువురు త‌మ అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ కు చెప్పిన‌ట్లు స‌మాచారం.
క‌రోనాపై ప్ర‌భుత్వం తీరును వ్య‌తిరేకిస్తూ హైకోర్టులో ఇప్పటికి 87 పిల్స్ దాఖ‌ల‌య్యాయ‌ని, దీంతో బాధితుల‌కు ట్రీట్మెంట్ అందించ‌కుండా కోర్ట్ ల చుట్టూ తిరగాల్సిన ప‌రిస్థితి త‌లెత్తిన‌ట్లు కేసీఆర్ కు విన్న‌వించుకున్నారు.

వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉందని ప్రభుత్వం, వైద్య శాఖ, వైద్యాధికారులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నార‌ని స‌మీక్ష కు హాజ‌రైన అధికారులు, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు కేసీఆర్ తో చ‌ర్చించారు.

అయినప్పటికీ హైకోర్టులో పిల్స్ దాఖలు అవుతూనే ఉన్నాయి. హైకోర్టు వాటిని స్వీకరిస్తూనే ఉంది. ఏకంగా 87 పిల్స్ పై విచారణ జరపడం, వాటికి నిత్యం హాజరు కావడం, చివరికి వివిధ పనుల్లో తీరికలేకుండా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిని, వివిధ వైద్యశాలల సూపరింటెండెంట్లను కూడా కోర్టుకు రావాలని పిలవడం ఇబ్బందిగా ఉన్న‌ట్లు  సీఎం కు  తెలిపారు.

కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయి. ఇది ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యం దెబ్బతీస్తుందంటూ సమావేశంలో పాల్గొన్న పలువురు తమ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

అయితే వారి అభిప్రాయాల‌పై స్పందించిన సీఎం కేసీఆర్ ..క‌రోనా నియంత్ర‌ణ‌పై ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని అఫిడ‌విట్ రూపంలో హైకోర్ట్ కు స‌మ‌ర్పించాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.