పరిగి, షాద్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు

పరిగి, షాద్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు
  • గుంతలమయంగా మారిన రోడ్డును వెంటనే బాగుచేయించాలంటూ నిరసన
  • పాలన చేతకాని ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ నినాదాలు
  • పరిగి నుండి తొండపల్లి వరకు పూర్తిగా దెబ్బతిన్న పరిగి - షాద్ నగర్ ప్రధాన రహదారి
  • కాంగ్రెస్ నాయకుల రాస్తారోకోతో భారీగా స్తంభించిన ట్రాఫిక్

వికారాబాద్ జిల్లా పరిగి - షాద్ నగర్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గుంతలమయంగా మారిన రోడ్డును వెంటనే బాగు చేయించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. పాలన చేతకాని పరిగి ఎమ్మెల్యే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. పరిగి నుండి తొండపల్లి వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. 

గత రెండేళ్లుగా రోడ్డు పరిస్థితి దారుణంగా మారిందని....నిత్యం ఇదే రోడ్డుపై ప్రయాణించే ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం శోచనీయమని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. గుంతల రోడ్డుపై ప్రయాణించి ప్రమాదాలకు గురై ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారని... కొందరు శాశ్వత వికలాంగులుగా మారారని చెప్పారు. అయినా పాలకుల్లో, అధికారుల్లో చలనం లేదని విమర్శించారు. ఈ క్రమంలోనే పాలన చేతకాని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పది రోజుల్లో  రోడ్డు బాగు చేయించకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.