హడ్కో లోన్ రాక, సర్కార్ ఫండ్స్ ఇయ్యక...

హడ్కో లోన్ రాక, సర్కార్ ఫండ్స్ ఇయ్యక...

హైదరాబాద్, వెలుగు: హడ్కో లోన్ రాక, సర్కార్ ఫండ్స్ ఇయ్యక డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ ముందుకు సాగడం లేదు.  హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.రెండు వేల కోట్ల లోన్ కోసం ప్రభుత్వం మూడు నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నా ఫలితం దక్కడంలేదు. లోన్ అంశంపై హౌసింగ్ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ  రెండు నెలల క్రితం ఢిల్లీ వెళ్లి హడ్కో  డైరెక్టర్లను కలిశారు. కానీ అటునుంచి స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో భారీగా లోన్లు తీసుకుందని, వీటికి వడ్డీ, అసలును బడ్జెట్ నుంచి కేటాయిస్తున్నందున దాన్ని  ప్రభుత్వ అప్పుగానే పరిగణిస్తామని ఇటీవల ఆర్ బీఐ స్పష్టం చేసింది. కాగ్ నివేదిక లో సైతం ఎక్కువ అప్పులున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. దీంతో  లోన్ ఇచ్చేందుకు హడ్కో వెనుకాడుతున్నట్లు డిపార్ట్ మెంట్ లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు హడ్కో నుంచి సుమారు రూ.10 వేల కోట్ల లోన్ తీసుకుని బడ్జెట్ నిధుల నుంచి ప్రభుత్వం చెల్లిస్తోంది. 

ఉత్త కేటాయింపులే.. నిధులేవీ?

ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్​లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రూ.12 వేల కోట్లు కేటాయించింది.  నాలుగు  నెలలు గడుస్తున్నా  అందులోంచి నిధులు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు 8 నెలల నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. వడ్డీకి, ఆస్తులు తనఖా పెట్టి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తుంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని వాపోతున్నారు. అయితే కొందరు కాంట్రాక్టర్లు మంత్రుల ద్వారా ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అధికారులపై ఒత్తిడి చేయించి బిల్లులు రాబట్టుకున్నట్టు చర్చ జరుగుతోంది. మరో వైపు సొంత జాగా ఉన్న వారికి దశల వారీగా ప్రభుత్వం రూ.మూడు లక్షలు ఇస్తామని బడ్జెట్​లో ప్రకటించింది. సర్కార్​ వద్ద డబ్బుల్లేక ఈ స్కీమ్  కూడా ముందుకు పడలేదు.