జూన్ నెలాఖరులో సీపీగెట్ ఎగ్జామ్

జూన్ నెలాఖరులో సీపీగెట్ ఎగ్జామ్
  • ఈ నెల12 నుంచి జూన్11 వరకు అప్లికేషన్లు
  • రూ.500 ఫైన్ తో 18 దాకా, రూ.2 వేల ఫైన్ తో 
  • 20 వరకు గడువు నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్​సీహెచ్​ఈ చైర్మన్ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని 8 సర్కారు యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్  (సీపీగెట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల12 నుంచి వచ్చే నెల11 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. జూన్ నెలాఖరులో సీపీగెట్ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. సోమవారం హయ్యర్ ఎడ్యుకేషన్  కౌన్సిల్​లో టీఎస్​ సీపీగెట్–2023 నోటిఫికేషన్​ను కౌన్సిల్  చైర్మన్  ప్రొఫెసర్  లింబాద్రి విడుదల చేశారు. 2023–24 విద్యా సంవత్సరానికి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీతో పాటు జేఎన్​టీయూ పరిధిలోని కాలేజీల్లో అడ్మిషన్లు చేపడతామని లింబాద్రి ప్రకటించారు.

ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఈడీ, ఎంపీఈడీ, మాస్టర్ ఇన్  లైబ్రరీ సైన్స్, పీజీ డిప్లొమా కోర్సులు, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా మే 12 నుంచి జూన్ 11 వరకూ రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని తెలిపారు. రూ.500 ఫైన్​తో జూన్ 18 వరకూ, రూ.2 వేల ఫైన్​తో జూన్ 20 వరకూ అప్లై చేసుకోవచ్చని లింబాద్రి వివరించారు.  సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ ఈనెల 12న డీటెయిల్డ్  నోటిఫికేషన్  ఇస్తామని వెల్లడించారు. ఫీజు వివరాలు, కోర్సులు, కాలేజీలు, ఇతర సమాచారాన్ని బ్రోచర్​లో తెలియజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు https://cpget.tsche.ac.in, http://www.ouadmissions.com  వెబ్ సైట్  చూడవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  సెక్రటరీ శ్రీనివాస్​ రావు, ఓయూ వీసీ రవీందర్​ యాదవ్  తదితరులు పాల్గొన్నారు. 

10 లోపే అడ్మిషన్లు అయితే కోర్సు రద్దు

నిరుటి అనుభవం నేపథ్యంలో సీపీగెట్ అడ్మిషన్ల విధానంలో కొన్ని మార్పులు చేస్తున్నారు. స్టేట్​లో మొత్తం 324 పీజీ కాలేజీలు ఉండగా, వాటిలో 45 వేల సీట్లు ఉన్నాయి. అయితే, వాటిలో గత ఏడాది పలు కాలేజీల్లో 300 కోర్సుల్లో పదిలోపే అడ్మిషన్లు జరిగాయి. ఇంత తక్కువ మందితో కోర్సు నడిపించడం కష్టమని అధికారులు భావించారు. ఈ ఏడాది ఆ సమస్య రాకుండా.. సెకండ్  ఫేజ్ పూర్తయ్యాక పదిలోపే అడ్మిషన్లు జరిగిన కోర్సులను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ స్టూడెంట్లను ఇతర కాలేజీల్లో అడ్జెస్ట్ చేసేలా చర్యలు చేపట్టనున్నారు.