తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు

తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు

కాజీపేట, వెలుగు : సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని కాజీపేట రైల్వే జంక్షన్,- సికింద్రాబాద్, బోనకల్-, మధిర, తదితర రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైన్ ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్, రోలింగ్ ఇంజినీరింగ్ పనుల కారణంగా కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. 

దారి మళ్లించిన రైళ్లు ఇవే...

విశాఖపట్నం- నుంచి లోకమాన్య తిలక్ టెర్మినల్  రైల్వే స్టేషన్ల మధ్య ప్రతి రోజు రాకపోకలు సాగించే రెండు ఎన్టీటీ రైళ్లను, తిరుపతి నుంచి ఆదిలాబాద్ మధ్య  ప్రతి రోజు నడిచే రెండు కృష్ణా ఎక్స్​ప్రెస్​ రైళ్లను ఈ నెల 30 నుంచి మే 9 వరకు.. మళ్లీ మే 15 నుంచి 21వ తేదీ వరకు సికింద్రాబాద్-,పగిడిపల్లి,- గుంటూరు, విజయవాడ రైల్వే స్టేషన్ల మీదుగా దారి మళ్లించినట్టు తెలిపారు. అలాగే శాలిమార్- నుంచి హైదారాబాద్ మధ్య నడిచే రెండు ఈస్ట్ కోస్ట్ రైళ్లను, ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వేస్టేషన్- నుంచి భువనేశ్వర్ మధ్య నడిచే రెండు కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైళ్లను మే 2, 3,8, 9, 20, 21 తేదీల్లో సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.   

రద్దు చేసిన రైళ్లు ఇవే 

సికింద్రాబాద్-, వరంగల్,- హైదరాబాద్​ల మధ్య నడిచే పుష్​ పుల్ రైలు, కాజీపేట రైల్వే జంక్షన్–బల్లార్ష– కాజీపేట రైల్వే జంక్షన్ల మధ్య నడిచే బల్లార్ష ఎక్స్​ప్రెస్ ​రైలును, కాజీపేట రైల్వే జంక్షన్- –డోర్నకల్– కాజీపేట రైల్వే జంక్షన్ల మధ్య రాకపోకలు సాగించే డోర్నకల్ పుష్​పుల్ రైలును మంగళవారం నుంచి మే 26 వరకు రద్దు చేసినట్టు చెప్పారు. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్ నగర్–- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్​ప్రెస్​ రైలును మే  3, 4 తేదీల్లో కాజీపేట రైల్వే జంక్షన్- –సికింద్రాబాద్ వరకే కుదించి నడుపుతున్నట్లు తెలిపారు.