చైర్ పర్సన్లు తేలేది నేడే (ఫిబ్రవరి 16).. క్లీన్‍ స్వీప్‍ పై గురిపెట్టిన కాంగ్రెస్

చైర్ పర్సన్లు తేలేది నేడే (ఫిబ్రవరి 16).. క్లీన్‍ స్వీప్‍ పై గురిపెట్టిన కాంగ్రెస్
  • ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నిక
  •     ఇప్పటికే 7 మున్సిపాలిటీలు కైవసం
  •     వర్ధన్నపేట ఇండిపెండెంట్‍ కాంగ్రెస్‍లో చేరిక.. కేసముద్రంలో లైన్‍ క్లియర్‍ 
  •     మహబూబాబాద్‍లోనూ అవకాశం  
  •     ఎక్స్​అఫీషియో ఓట్లతో తొర్రూర్‍ పీఠంపై ఫోకస్​

వరంగల్‍, వెలుగు:  మున్సిపల్​ఎన్నికల్లో అసలు సిసలు ఘట్టానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మాకాడ చైర్​పర్సన్‍ ఎవరైతరో.. అంటూ ఐదారు రోజులుగా పట్టణ ప్రజల్లో ఒకటే చర్చ. సోమవారం నిర్వహించే చైర్​పర్సన్ల ఎన్నికతో దానికి ఫుల్​స్టాప్​పడనుంది. ఉమ్మడి వరంగల్​జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు ఎక్స్​అఫీషియో మెంబర్లుగా ఓటు నమోదు చేసుకున్నారు. చైర్​పర్సన్​పీఠాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. తమ కౌన్సిలర్లును ఇప్పటికే క్యాంపులకు తరలించగా.. ఎన్నిక జరిగే సమయానికే వారిని తీసుకురానున్నారు.  

కాంగ్రెస్‍ 7, బీఆర్‍ఎస్‍ 1 

12 మున్సిపాలిటీల్లో నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు, స్టేషన్ ఘనపూర్‍, మరిపెడ, డోర్నకల్‍  డైరెక్ట్​గా కాంగ్రెస్​ఖాతాలోకి వెళ్లాయి. తొర్రూర్‍ లో మాత్రం బీఆర్‍ఎస్‍ కు మెజారిటీ వచ్చింది. 

మరో 3 మున్సిపాలిటీల్లో లైన్‍ క్లియర్‍! 

జనగామ, వర్ధన్నపేట, కేసముద్రం, మహబూబాబాద్‍ లలో హంగ్​ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్​పార్టీ ఇండిపెండెంట్లు, సీపీఎం నుంచి గెలిచినవారు, ఎక్స్​అఫీషియో ఓట్లతో వర్ధన్నపేట, కేసముద్రం, మహబూబాబాద్‍ పీఠాలపై గురిపెట్టింది. వర్ధన్నపేటలోని 12 సీట్లలో బీఆర్‍ఎస్‍ 6, కాంగ్రెస్‍ 5 గెలిచాయి. 5వ వార్డులో ఇండిపెండెంట్‍ అభ్యర్థి నేతావత్‍ షిబారాణి రాజేందర్‍ విజయం సాధించి, ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‍ లో చేరారు. లోకల్‍ ఎమ్మెల్యేగా కేఆర్‍.నాగరాజు ఎక్స్​అఫీషియో ఓటుతో అది కాంగ్రెస్‍ ఖాతాలో పడినట్లయింది. 

కేసముద్రంలోని 16 వార్డుల్లో కాంగ్రెస్‍, బీఆర్‍ఎస్‍ చెరో 8 స్థానాలు గెలిచాయి. మహబూబాబాద్‍ ఎంపీ బలరాం నాయక్‍ ఎక్స్​అఫీషియో ఓటుతో అది కూడా కాంగ్రెస్‍ అకౌంట్​లో పడనుంది. మహబూబాబాద్‍లో 36 వార్డులుండగా.. కాంగ్రెస్‍ అత్యధికంగా 13, బీఆర్‍ఎస్‍ 11, బీజేపీ 1, సీపీఐ 3, సీపీఎం 3, ఇండిపెండెంట్లు 5 చోట్ల గెలిచారు. మేజిక్‍ ఫిగర్‍ 19 కావడంతో.. సీపీఎం 3, ఎమ్మెల్యే మురళీ నాయక్‍ ఎక్స్​అఫీషియో ఓటుకుతోడు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్​ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.  

తొర్రూర్ లో బీఆర్ఎస్​కు బలం

తొర్రూర్‍ మున్సిపాలిటీలో 16 స్థానాలకు గాను 9 బీఆర్‍ఎస్‍, 7 హస్తం పార్టీకి దక్కాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, వరంగల్‍ ఎంపీ కడియం కావ్య ఎక్స్​అఫీషియో ఓట్లతో సమానం అయ్యాయి. బీఆర్‍ఎస్‍ నుంచి ఎవరో ఒకరి మద్దతుతో చైర్​పర్సన్​స్థానాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్​అడుగులు వేస్తోంది.  

ములుగులో ఇద్దరికి  చెరో రెండున్నరేళ్లు?

ములుగు, వెలుగు: ములుగు జిల్లా ఏర్పడిన ఆరేండ్లకు ఏర్పాటైన మున్సిపాటిటీలో తొలి చైర్ పర్సన్​పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్​లో తీవ్ర పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో  ఆ పార్టీ నుంచి12 మంది, బీఆర్ఎస్​నుంచి ఐదుగరు, బీజేపీ నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్​రెబల్ అభ్యర్థులే కావడంతో తమ పార్టీ బలం 14కు చేరిందని మంత్రి సీతక్క ప్రకటించారు. ఆమె ఎక్స్​అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. చైర్​పర్సన్​ పీఠం బీసీ మహిళకు కేటాయించడంతో క్యాంపునకు వెళ్లిన కౌన్సిలర్లలో నలుగురు తమకంటే తమకంటూ పోటీ పడుతున్నారు. 

కాంగ్రెస్ జిల్లా మాజీ​ అధ్యక్షుడు దివంగత నల్లెల్ల కుమారస్వామి కోడలు 8వ వార్డు కౌన్సిలర్ స్వాతి భరత్​కు చైర్​పర్సన్ పదవి ఇచ్చేందుకు మంత్రి నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి సతీమణి చంద్రకళ ఆరో వార్డు కౌన్సిలర్ గా గెలుపొంది, చైర్ పర్సన్​పదవి ఆశిస్తున్నారు. దీంతో చెరో రెండున్నరేళ్లు పదవిని అప్పగించేందుకు ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం ఉదయం ములుగు కలెక్టరేట్ లో ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.