ఢిల్లీ పేలుళ్ల కేసులో కొత్త కోణం.. ఉగ్ర సంస్థ పెట్టినోళ్లంతా డాక్టర్లే : ఎన్ఐఏ

ఢిల్లీ పేలుళ్ల కేసులో కొత్త కోణం..  ఉగ్ర సంస్థ పెట్టినోళ్లంతా డాక్టర్లే : ఎన్ఐఏ
  •     ‘అన్సార్‌‌‌‌ ఇంటెరిమ్’ పేరుతో ఏర్పాటు
  •     హర్యానాలో పేలుడు పదార్థాలు సేకరించిన ముఠా 
  •     కారు బాంబుతో భారీ విధ్వంసానికి కుట్ర

శ్రీనగర్: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన ఉగ్రడాక్టర్లు అందరూ 2016లోనే టెర్రరిజంవైపు ఆకర్షితులైనట్టు తేలింది. వీరంతా కలిసి‘అన్సార్‌‌‌‌ ఇంటెరిమ్​’ పేరిట కొత్త టెర్రరిస్టు సంస్థను ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన డాక్టర్ ముజమ్మిల్‌‌‌‌ గన్నీ, ఉమర్‌‌‌‌ నబీ, ఆదిల్‌‌‌‌, ముజఫర్‌‌‌‌, మౌల్వీ ఇర్ఫాన్‌‌‌‌, కారీ ఆమిర్‌‌‌‌, తౌఫిల్‌‌‌‌ గాజిలు 2022 ఏప్రిల్‌‌‌‌లో శ్రీనగర్‌‌‌‌లో రహస్యంగా సమావేశమయ్యారు. 

అక్కడే ‘అన్సార్‌‌‌‌ ఇంటెరిమ్’ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేశారు. దీనికి చీఫ్ గా ఆదిల్‌‌‌‌ను, డిప్యూటీ చీఫ్‌‌‌‌గా మౌల్వీ ఇర్ఫాన్‌‌‌‌ను  నియమించుకున్నారు. కీలక బాధ్యతలను ఉమర్ నబీకి అప్పగించారు. ఆర్థిక వ్యవహారాలన్ని గన్నీ చూసుకునేవాడు. సమాచార మార్పిడి కోసం ప్రత్యేక కోడ్ భాషను కూడా రూపొందించుకున్నారు. 

సోహ్నా నుంచి ఎరువులు, ఫరీదాబాద్ నుంచి పొటాషియం నైట్రేట్

ఈ ముఠా 2023లో హర్యానాలోని సోహ్నా ప్రాంతం నుంచి ఎరువులను, ఫరీదాబాద్‌‌‌‌లోని ఓ కెమికల్ షాపు నుంచి పొటాషియం నైట్రేట్‌‌‌‌ను సేకరించింది. ప్రధాన నిందితుడు ఉమర్‌‌‌‌ నబీ ఆన్‌‌‌‌లైన్ వీడియోలు చూసి ఐఈడీ బాంబుల తయారీలో శిక్షణ తీసుకున్నాడు. దక్షిణ కాశ్మీర్‌‌‌‌కు చెందిన డానిష్ అనే వ్యక్తిని ఆత్మాహుతి దాడికి ఉమర్  ప్రేరేపించినప్పటికీ, అతను చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు విచారణలో వెల్లడైంది. 

ఈ ముఠాలోని ఉమర్ నబీ ఢిల్లీలోని రద్దీ ప్రాంతాలు, ప్రముఖ ప్రార్థనా మందిరాల వద్ద కారు బాంబు పేలుడుకు కుట్ర పన్నాడు. అయితే, శ్రీనగర్ పోలీసులు ఈ సంస్థ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను గుర్తించి అరెస్టులు ప్రారంభించడంతో ఉమర్ ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు దొరికిపోతాననే భయంతో, ప్లాన్ మార్చుకుని ఎర్రకోట సమీపంలోనే పేలుడుకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమర్ గతంలో 2016, 2018లలో ఇతర టెర్రరిస్టు ఆర్గనైజేషన్లల్లో చేరడానికి ప్రయత్నించి విఫలమయ్యాడని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.