న్యూఢిల్లీ: ఇండియా– యూకే మధ్య గతేడాది కుదిరిన కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (సీఈటీఏ) ఈ ఏడాది ఏప్రిల్‌లో అమలులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం కింద భారతదేశం నుంచి బ్రిటన్‌కి ఎగుమతి అయ్యే 99శాతం వస్తువులపై టారిఫ్ ఉండదు. మరోవైపు, యూకే ఉత్పత్తులపై భారతదేశంలో టారిఫ్‌లు తగ్గుతాయి. ఉదాహరణకు, స్కాచ్ విస్కీపై సుంకం 150శాతం నుంచి వెంటనే 75శాతానికి తగ్గి, 2035 నాటికి 40 శాతానికి చేరుతుంది. కార్లపై దిగుమతి సుంకం ఐదు సంవత్సరాల్లో 110శాతం నుంచి 10 శాతానికి దిగొస్తుంది.
ఇక రెండు దేశాలు డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్ (డీసీసీ) అనే మరో ఒప్పందాన్ని కూడా చేసుకున్నాయి. దీని వల్ల టెంపరరీ వర్కర్లు రెండు దేశాల్లో ఒకేసారి సోషల్ సెక్యూరిటీ లెవీల(చార్జీల) ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ఒప్పందం అమలుకు యూకే పార్లమెంట్ ఆమోదం అవసరం.
బ్రిటన్‌లో హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో చర్చలు జరుగుతుండగా, భారతదేశంలో యూనియన్ కేబినెట్ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. సీఈటీఏ ద్వారా 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం ప్రస్తుతం ఉన్న 56 బిలియన్ డాలర్ల నుంచి రెట్టింపు అవుతుందని అంచనా. భారతదేశానికి టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, స్పోర్ట్స్ గూడ్స్, టాయ్స్ వంటి ఉత్పత్తుల ఎగుమతుల్లో పెద్ద అవకాశాలు లభిస్తాయి.
