పెళ్లి సంబంధం నచ్చక ఇంటి నుంచి వెళ్లిపోయా

పెళ్లి సంబంధం నచ్చక ఇంటి నుంచి వెళ్లిపోయా

దుండిగల్‌ మల్లంపేట్‌కు చెందిన యువతి గాయత్రి మిస్సింగ్ కేసు కథ సుఖాంతమైంది.KPHBని సర్దార్ పటేల్ నగర్ లో గాయత్రిని పోలీసులు గుర్తించి సురక్షితంగా దుండిగల్ పీఎస్ కు తీసుకొచ్చారు. తల్లిదండ్రులకు ఆమెను అప్పగించారు.

మల్లంపేట్‌కు చెందిన 19 ఏళ్ల గాయత్రి బుధవారం తను పనిచేసే రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి రాత్రయినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాయత్రికి ఫోన్‌ చేయగా..స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. వెంటనే యువతి పనిచేస్తున్న స్టోర్‌కు ఫోన్‌చేయగా అసలు గాయత్రీ బుధవారం విధులకు హాజరుకాలేదని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు గురువారం దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో తనిఖీ చేయగా ఆమె రాసిన లెటర్ లభించింది. సీసీ కెమెరాలు, సెల్‌ ఫోన్‌ కాల్‌ డాటా ఆధారంగా గాయత్రి ఆచూకి కోసం గాలింపులు చేపట్టిన పోలీసులు… KPHB లో ఉన్న గాయత్రిని కనిపెట్టారు.

తనకు ఇంటిలో చూసిన పెళ్లి సంబంధం నచ్చకపోవడంతో ఇంటి నుంచి తన స్నేహితుల ఇంటికి వెళ్లానని గాయత్రి పోలీసులకు తెలిపింది. దీంతో గాయత్రి తల్లిదండ్రులను పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.. బలవంతంగా వివాహం చేయవద్దని సూచించారు. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లడం మంచిది కాదని..ఏదైన సమస్య వస్తే తమ దృష్టికి తీసుకురావాలని గాయత్రికి పోలీసుల సూచించారు.