ఢిల్లీ లిక్కర్ స్కాం లో అవినీతికి పాల్పడిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తప్పించుకునే మార్గం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. మద్యం పాలసీకి సంబంధించి నిపుణుల కమిటీ సిఫారసులను ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కేజ్రీవాల్ సర్కార్ హోల్ సేల్ లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించిందని సంబిత్ పాత్ర ఆరోపించారు. మద్యం కేసులో మనీష్ సిసోడియా అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు.
మనీష్ సిసోడియా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా మంత్రి కావచ్చు. కానీ ఎక్సైజ్ మంత్రి హోదాలో ఉన్న మీరు ఏమి చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. పంజాబ్ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ఢిల్లీలో మద్యం వ్యాపారాన్ని అక్రమ మార్గంలో విస్తరించేందుకు నిపుణుల ప్యానెల్ సిఫారసులను కేజ్రీవాల్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎక్సైజ్ పాలసీలో ఆప్ పార్టీ ఎలా చిక్కుకుందో గత కొన్నిరోజులగా జరుగుతున్న పరిణామాలపై స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎక్సైజ్ పాలసీ అమలులో జరిగిన అవకతవకలపై బీజేపీ ప్రశ్నలకు ఆప్ సమాధానం ఇవ్వాలని తెలిపారు.

