ఉత్తర భారతం అతలాకుతలం... యమునా నది ఉగ్రరూపం

ఉత్తర భారతం అతలాకుతలం... యమునా నది ఉగ్రరూపం
  • ఢిల్లీలో ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది
  • చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించిన అధికారులు
  • ఉత్తరాఖండ్​లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి
  • ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్న యమునా నది
  • చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించిన అధికారులు
  • పాత రైల్వే బ్రిడ్జ్ పై వాహన రాకపోకలపై ఆంక్షలు
  • పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు
  • అధికారులతో సీఎం కేజ్రీవాల్ ఎమర్జెన్సీ మీటింగ్

దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్​ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయిని దాటేసింది. ఉత్తరాఖండ్​లో కొండచరియలు విరిగిపడి నలుగురు చనిపోయారు. మహారాష్ట్రలోని వైన్ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. హిల్ స్టేట్స్​లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పదుల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమై వందలాది మంది నిరాశ్రయులయ్యారు.

న్యూఢిల్లీ:  ఉత్తరాదిలో వరుసగా నాల్గో రోజు వానలు దంచికొడుతున్నాయి. మొత్తం 23 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిల్ స్టేట్స్​లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్​ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక, ఢిల్లీలోని యమునా నది ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటేసింది. మంగళవారం సాయంత్రానికి 207 మీటర్ల మార్క్ క్రాస్ చేయడంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం హర్యానా యమునా నగర్​లోని హతికుండ్ బ్యారేజ్ నుంచి నీళ్లు విడుదల చేశారు. దీంతో బుధ, గురువారం నాటికి యమునా నది మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది. పాత రైల్వే బ్రిడ్జిపై రైల్వే, వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రెండు శతాబ్ది, ఒక వందే భారత్‌‌ సహా పలు రైళ్లను రద్దు చేసి,  మరో 14 రైళ్లను దారిమళ్లించారు.

మోకాళ్ల లోతు నీళ్లలో యమునా బజార్

యమునా నది చుట్టుపక్క ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇండ్లల్లో మోకాళ్లలోతు నీళ్లు వచ్చి చేరాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యమునా బజార్ స్థానికులను అధికారులు ప్రభుత్వ క్యాంపులకు తరలించారు. మొత్తం 16 కంట్రోల్ రూ మ్స్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు. 50కి పైగా మోటర్ బోట్లను రంగంలోకి దించారు. ఆదివారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల వ్యవధిలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డైంది. ఒక్కరోజులో ఇంత భారీ వర్షం కురవడం 1982 తర్వాత ఇదే మొదటిసారి. భారీ వర్షాలకు రోడ్లు, పార్క్​లు, మార్కెట్లు నీట మునిగాయి. యమునా నది పరివాహక ప్రాంతాల్లో సుమారు 41వేల మంది నివాసం ఉంటున్నారు. 

మహారాష్ట్రలో భక్తులను కాపాడిన సిబ్బంది

మహారాష్ట్రలోని వైన్ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భండారా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నీటి మట్టం పెరగడంతో నది మధ్యలో ఉన్న ఆలయంలో చిక్కుకుపోయిన ఐదుగురిని రెస్క్యూ టీమ్ కాపాడింది. రానున్న రెండు రోజుల్లో అమరావతి, భండారా, గడ్చిరోలి, చంద్రపూర్, గోండియా, నాగ్​పూర్, వార్ధా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

హిమాచల్​లో 300 మందిని కాపాడిన ఐఏఎఫ్

హిమాచల్​ప్రదేశ్​లోని లాహౌల్, స్పితి జిల్లాలోని చంద్రతాల్ సరస్సులో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించేందుకు అధికారులు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) హెలికాప్టర్​ను ఉపయోగించారు. చంద్రతాల్ సరస్సు క్యాంపుల్లో చిక్కుకుపోయిన సుమారు 300 మందిని కాపాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 100 మందిని రెస్క్యూ చేశారు. ఇంకా, చంద్రతాల్, పాగల్ నల్లా, మండిలోని వివిధ ప్రాంతాల్లో 800 మంది చిక్కుకుపోయారు. ఈ సీజన్​లో మొత్తం 72 మంది చనిపోయారు. షిమ్లా – కల్కా, మనాలీ– చండీగఢ్ నేషనల్ హైవే మూడు రోజులుగా క్లోజ్ అయింది.  1,416 బస్ రూట్లలో సేవలు నిలిపేశారు. చాలా ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ నిలిచిపోయింది. 

అంబాలా సిటీలో 730 స్టూడెంట్స్ రెస్క్యూ

హర్యానాలోని అంబాలా సిటీలోని రెసిడెన్షియల్ స్కూల్​లో చిక్కుకుపోయిన 730 మంది అమ్మాయిలను కురుక్షేత్రకు తరలించారు. ఘగ్గర్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హాస్టల్ కాంప్లెక్స్​లో వరద నీరు చేరింది. స్టూడెంట్స్ అందరినీ ఆర్మీ, లోకల్ పోలీసుల సాయంతో తరలించినట్టు చమన్ వాటికా గురుకుల్ ప్రిన్సిపాల్ సొనాలీ తెలిపారు. 

డ్రైనేజీలు సరిగ్గా లేవు: ఢిల్లీ ఎల్జీ

2014 నుంచి ఢిల్లీ జనాభా 50 లక్షలు పెరిగిందని, అందుకు తగ్గట్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయలేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అన్నారు. అందుకే సిటీ లో వరదలు వస్తున్నాయని అన్నారు. మంగళవారం ఎల్జీ యమునా బజార్ ఏరియాతో పాటు ప్రగతి మైదా న్ టన్నెల్, మింటో బ్రిడ్జి, జకీరా అండర్ పాస్​లలో పర్యటించారు. మంగళవారం సీఎం కేజ్రీవాల్ అత్యవ సర భేటీ నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులను అలర్ట్ చేశారు.

ఉత్తరకాశీలో కొండచరియలు విరిగిపడి..

భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లోని గంగోత్రి నేషనల్ హైవేపై గంగ్నాని బ్రిడ్జ్ దగ్గర్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. మూడు వెహికల్స్ కూరుకుపోయాయి. ఈ ఘటనలో మధ్యప్రదేశ్​కు చెందిన నలుగురు టూరిస్ట్​లు చనిపోయారు. ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం ధామి సంతాపం వ్యక్తం చేశారు. చమోలీ జిల్లా బార్డర్​లో జుమ్మాగడ్ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. నదిపై నిర్మించిన బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో సరిహద్దు గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇండో-టిబెట్ బార్డర్ రోడ్ బ్లాక్ అయింది. దీంతో కగా, గర్పక్, జెల్లుమ్, కోసా, మలారి, కైలాష్​పూర్, ప్రకియ, బంపా గ్రామాలతో రాకపోకలు నిలిచిపోయాయి. జోషిమఠ్​కు 45 కి.మీ దూరంలోని జోషిమఠ్ – నీతి హైవే నీట మునిగింది. ఉత్తరాఖండ్​లో నదులు ఉప్పొంగడంతో పెద్ద పెద్ద బండరాళ్లు కొట్టుకొస్తున్నాయి. పలుచోట్ల కొండ చరియ లు విరిగిపడుతున్నాయి.