LSG vs KKR: ల‌క్నో సమిష్టి విఫలం.. హ్యాట్రిక్ కొట్టిన కోల్‌క‌తా

LSG vs KKR: ల‌క్నో సమిష్టి విఫలం.. హ్యాట్రిక్ కొట్టిన కోల్‌క‌తా

మొదట బౌలర్లు విఫలమవ్వగా.. అనంతరం బ్యాటర్లు వారి అడుగుజాడల్లోనే నడిచారు. ఫలితంగా, ల‌క్నో సూపర్ జెయింట్స్ సొంతగడ్డపై.. కోల్‌కతా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదట నైట్ రైడర్స్ 235 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో రాహుల్ సేన చేతులెత్తేసింది. 16.1 ఓవర్లలో 137 పరుగుల వద్ద అలౌట్ అయ్యింది. అయ్యర్ సేనకిది వరుసగా మూడో విజయం. ఈ గెలుపుతో వారు ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకున్నారు.     

236 పరుగుల భారీ ఛేద‌న‌లో ల‌క్నో ఏ దిశలోనూ విజయం దిశగా సాగలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ అర్షిన్ కులకర్ణి (9) రెండో ఓవర్‌లోనే ఔటయ్యాడు. అనంతరం కొద్దిసేపు కేఎల్ రాహుల్(25), మార్కస్ స్టోయినిస్(36) జోడి మెరుపులు మెరిపించారు. వేగంగా ఆడుతూ కోల్‌కతా బౌలర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, వారి వ్యూహాలు ఫలించలేదు. ఓవైపు రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోవడం.. మరోవైపు, నరైన్ పరుగులు రాకుండా కట్టడి చేయడంతో చేజేతులా వికెట్లు పారేసుకున్నారు. 

లక్నో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది. దీపక్ హుడా(5), నికోలస్ పూరన్(10), ఆయుష్ బదోని(15), అష్టన్ టర్నర్(16) చూస్తుండగానే పెవిలియన్ చేరిపోయారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చకారవర్తి మూడేసి వికెట్లు పడగొట్టగా.. ఆండ్రీ రస్సెల్ 2,  మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ చెరో వికెట్ తీసుకున్నారు.

న‌రైన్ శివతాండవం

అంతకుముందు ల‌క్నో గ‌డ్డ‌పై కోల్‌క‌తా బ్యాట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. సునీల్ న‌రైన్(80) హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్కగా.. ఫిలిప్ సాల్ట్(32), ర‌మ‌న్‌దీప్ సింగ్(25 నాటౌట్)లు ల‌క్నో బౌల‌ర్ల‌ను చీల్చిచెండాడారు. దీంతో కోల్‌క‌తా అలవోకగా మ‌రోసారి రెండొంద‌లు కొట్టింది. రాహుల్ సేన ఎదుట 236 ప‌రుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. లక్నో బౌలర్లలో నవీనుల్ హక్ 3, యశ్‌ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్విర్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.