చెన్నై సూపర్‌ షో.. తొమ్మిదోసారి ఫైనల్‌కు ధోనీసేన

చెన్నై సూపర్‌ షో.. తొమ్మిదోసారి ఫైనల్‌కు ధోనీసేన


దుబాయ్‌‌: కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ (6 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 18 నాటౌట్​) తనలోని ఫినిషర్​ను నిద్రలేపిన వేళ చెన్నై  సూపర్‌‌ కింగ్స్‌‌ చిందేసింది. అందరికంటే ముందే ప్లే ఆఫ్స్‌‌ బెర్తు దక్కించుకున్న సీఎస్‌‌కే అదే జోరుతో ఫైనల్‌‌కు దూసుకెళ్లింది. ఆదివారం హోరాహోరీగా సాగిన క్వాలిఫయర్‌‌1 పోరులో  చెన్నై 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను ఓడించింది. దాంతో, లీగ్‌‌ హిస్టరీలో అత్యధికంగా  తొమ్మిదోసారి ఫైనల్‌‌ చేరుకుంది. ఈ మ్యాచ్‌‌లో ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 172/5 స్కోరు చేసింది.  పృథ్వీ షా (34 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60), కెప్టెన్‌‌ రిషబ్‌‌ పంత్‌‌ (35 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 నాటౌట్‌‌) చెరో ఫిఫ్టీ కొట్టగా.. హెట్‌‌మయర్‌‌ (37) రాణించాడు. సీఎస్‌‌కే బౌలర్లలో హేజిల్‌‌వుడ్‌‌ (2/29) రెండు వికెట్లు తీశాడు. అనంతరం  యంగ్‌‌ స్టర్‌‌ రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ (50 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70), వెటరన్‌‌ రాబిన్‌‌ ఊతప్ప (44 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) హాఫ్‌‌ సెంచరీలతో పాటు ధోనీ మెరుపులతో చెన్నై 19.4 ఓవర్లలో 173/6 స్కోరు చేసి గెలిచింది. రుతురాజ్​కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. కాగా, కోల్​కతా, ఆర్​సీబీ మధ్య జరిగే ఎలిమినేటర్​లో నెగ్గిన టీమ్​తో ఢిల్లీ ఫైనల్​ బెర్తు కోసం 13న క్వాలిఫయర్​2 ఆడనుంది.

ఊతప్ప,  గైక్వాడ్‌‌ పునాది.. ధోనీ ముగింపు

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌కు వచ్చిన చెన్నైకి అన్రిచ్‌‌ నోర్జ్‌‌ ఫస్ట్‌‌ ఓవర్లోనే షాకిచ్చాడు.  స్టార్‌‌ ఓపెనర్‌‌ డుప్లెసిస్​(1)ను తన నాలుగో బాల్‌‌కే బౌల్డ్‌‌ చేసి ఢిల్లీకి బ్రేక్‌‌ ఇచ్చాడు. కానీ, ఈ ఆనందం ఢిల్లీకి ఎంతోసేపు నిలువలేదు. ఫుల్‌‌ ఫామ్‌‌లో ఉన్న ఓపెనర్‌‌ రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌కు తోడైన రాబిన్‌‌ ఊతప్ప అనూహ్యంగా రెచ్చిపోయాడు. తన ఫస్ట్ బాల్‌‌కే బౌండ్రీ కొట్టిన రాబిన్‌‌ అలవోకగా షాట్లు ఆడాడు. రబాడ వేసిన నాలుగో ఓవర్లో సిక్సర్‌‌తో గైక్వాడ్‌‌ జోరు పెంచగా.. అవేశ్‌‌ వేసిన ఆరో ఓవర్లో ఊతప్ప 6, 4, 6, 4తో చెలరేగాడు. దాంతో, పవర్‌‌ ప్లేలోనే  సీఎస్‌‌కే 59/1తో నిలిచింది. ఫీల్డింగ్‌‌ మారిన తర్వాత వరుసగా నాలుగు ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు  ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వలేదు. కానీ, గైక్వాడ్‌‌తో కలిసి వేగంగా సింగిల్స్‌‌, డబుల్స్‌‌ తీసిన ఊతప్ప 35 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకున్నాడు.  అప్పటిదాకా జాగ్రత్తగా ఆడిన గైక్వాడ్‌‌.. అక్షర్‌‌ వేసిన 11వ ఓవర్లో 6,4తో గేర్లు మార్చాడు. ఆపై, అశ్విన్‌‌ బౌలింగ్‌‌లో ఊతప్ప వరుసగా రెండు బౌండ్రీలు కొట్టడంతో చెన్నై స్కోరు వంద దాటింది. కానీ,  టామ్‌‌ కరన్‌‌ వేసిన 14వ ఓవర్లో  ఊతప్పతో పాటు నాలుగో నంబర్‌‌లో వచ్చిన శార్దూల్‌‌ (0) భారీ షాట్లకు ట్రై చేసి అయ్యర్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చారు. తర్వాతి ఓవర్లోనే అయ్యర్‌‌ సూపర్‌‌ త్రోకు అంబటి రాయుడు (1) రనౌటయ్యాడు.  ఎనిమిది బాల్స్‌‌ తేడాలో మూడు వికెట్లు కోల్పోయిన ధోనీసేన 119/4తో  కష్టాల్లో పడింది.  అయితే,  అప్పటికే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న  గైక్వాడ్‌‌కు అలీ (16) తోడయ్యాడు. కానీ, 16, 17వ ఓవర్లో వరుసగా 8, 9 రన్సే రావడంతో మ్యాచ్‌‌లో టెన్షన్‌‌ పెరగ్గా.. నోర్జ్‌‌ వేసిన 18వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన గైక్వాడ్​ చెన్నైని రేసులో నిలిపాడు. చివరి రెండు ఓవర్లలో ఆ టీమ్‌‌కు 24 రన్స్‌‌ అవసరం అవగా ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక,  19వ ఓవర్ ఫస్ట్‌‌ బాల్‌‌కే గైక్వాడ్​ను ఔట్‌‌ చేసిన అవేశ్‌‌ ఖాన్‌‌ చెన్నైకి షాకిచ్చాడు. కానీ, ఆ ఓవర్లో అలీ ఫోర్‌‌, ధోనీ సిక్స్‌‌ కొట్టాడు. దాంతో లాస్ట్‌‌ ఓవర్లో సీఎస్‌‌కేకు 13 రన్స్‌‌ అవసరం అయ్యాయి. అయితే, టామ్​ కరన్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కే అలీని ఔట్‌‌ చేసి ఢిల్లీ శిబిరంలో ఆశలు రేపాడు.  ఈ టైమ్​లో ధోనీ తనలోని  ఫినిషర్‌‌ను నిద్రలేపిపాడు. ఢిల్లీ చాన్స్​ ఇవ్వకుండా వరుసగా మూడు ఫోర్లు కొట్టి చెన్నైని గెలిపించాడు. 

పృథ్వీ, పంత్‌‌ ఫటాఫట్‌‌

ఢిల్లీ ఇన్నింగ్స్‌‌లో పృథ్వీ షా, రిషబ్‌‌ పంత్‌‌ అదరగొట్టారు. స్టార్టింగ్‌‌లో షా దంచికొడితే.. చివరిదాకా క్రీజులో ఉన్న పంత్‌‌ ఫినిషింగ్‌‌ టచ్‌‌ ఇవ్వడంతో క్యాపిటల్స్‌‌ మంచి స్కోరు చేసింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఢిల్లీకి షా మెరుపు ఆరంభం ఇచ్చాడు. హేజిల్‌‌వుడ్‌‌ వేసిన రెండో ఓవర్లో 4, 6తో టచ్‌‌లోకి వచ్చిన పృథ్వీ.. దీపక్‌‌ చహర్‌‌ బౌలింగ్‌‌లో నాలుగు ఫోర్లతో జోరు చూపాడు. నాలుగో ఓవర్లో ధవన్‌‌ (7)ను హేజిల్‌‌వుడ్‌‌ ఔట్‌‌ చేసినా.. శార్దూల్‌‌ బౌలింగ్‌‌లో షా రెండు సిక్సర్లతో రెచ్చిపోవడంతో ఐదు ఓవర్లకే ఢిల్లీ స్కోరు 50 దాటింది. కానీ, ఆరో ఓవర్లో శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (1)ను ఔట్‌‌ చేసిన హేజిల్‌‌వుడ్‌‌ ఒకే పరుగిచ్చాడు.  అక్కడి నుంచి ఢిల్లీ జోరు తగ్గింది. స్పిన్నర్లు జడేజా, అలీ పొదుపుగా బౌలింగ్‌‌ చేశారు.  నాలుగో నంబర్‌‌లో వచ్చిన అక్షర్‌‌ (10)ను అలీ, షాను జడేజా వరుస ఓవర్లలో పెవిలియన్‌‌ చేర్చారు. హెట్‌‌మయర్‌‌, పంత్‌‌ కూడా క్రీజులో కుదురుకునేందుకు టైమ్‌‌ తీసుకోవడంతో 13 ఓవర్లకు ఢిల్లీ 96/4తో నిలిచింది. అయితే, అలీ వేసిన తర్వాతి ఓవర్లో డీప్‌‌ మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా సిక్స్‌‌ కొట్టిన హెట్‌‌మయర్‌‌ స్కోరు వంద దాటించడంతో పాటు ఇన్నింగ్స్‌‌కు మళ్లీ ఊపు తెచ్చాడు. స్లాగ్‌‌ ఓవర్లలో పంత్‌‌ స్పీడు పెంచాడు. ఠాకూర్‌‌ వేసిన 16వ ఓవర్లో తన ట్రేడ్‌‌మార్క్‌‌  సింగిల్‌‌ హ్యాండ్‌‌ షాట్​తో సిక్సర్‌‌ బాదాడు.  అదే జోరు కొనసాగించిన పంత్‌‌, హెట్‌‌మయర్‌‌ తర్వాతి రెండు ఓవర్లలో చెరో రెండు ఫోర్లు రాబట్టి స్కోరు 150 దాటించారు.  బ్రావో బౌలింగ్​లో హెట్​మయర్​ ఔటైనా.. పంత్​  ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు స్కోరు 170 మార్కు దాటించాడు.