నాగార్జున సాగర్ దుంకవట్టె.. శ్రీరాంసాగర్ ఎండవట్టె

నాగార్జున సాగర్ దుంకవట్టె.. శ్రీరాంసాగర్ ఎండవట్టె

కృష్ణా ప్రాజెక్టులను ముంచెత్తుతున్న వరద

నాగార్జున సాగర్‌‌ మొత్తం26 గేట్లు ఎత్తిన అధికారులు

ఎస్సారెస్పీలో అంతంత మాత్రంగానే నీటి నిల్వ

నిజాంసాగర్‌‌, సింగూరుకు రాని నీళ్లు

కృష్ణా బేసిన్‌‌లోని ఆయకట్టుకు ఫుల్‌‌ భరోసా

హైదరాబాద్‌‌, వెలుగు:

పదేండ్ల తర్వాత మొత్తం గేట్ల నుంచి దుంకుతున్న జలదృశ్యం ఒక వైపు.. నీళ్లు లేక వెలవెలబోతున్న కరువుదృశ్యం మరోవైపు.. ఇదీ రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్​, శ్రీరాంసాగర్​లోని పరిస్థితి. కృష్ణా నది ఉగ్రరూపంతో దాని పరిధిలోని ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. నాగార్జునసాగర్​ నిండుకుండలా మారింది. సాగర్​ పరిధిలోని ఆయకట్టుకు ఈయేడు డోకా లేదు. కానీ, ఎగువ గోదావరిలో ప్రవాహాలు లేక.. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీ వట్టిపోతోంది. సింగూరు, నిజాంసాగర్‌‌ ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు కూడా చేరడం లేదు. ఈ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కృష్ణమ్మ పరుగులు

నాగార్జునసాగర్‌‌కు కృష్ణమ్మ వరద పోటెత్తుతోంది. పదేండ్ల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండబోతోంది. సాగర్‌‌ ఎడమ కాలువ కింద నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని 6.40 లక్షల ఎకరాలకు ఈ వరదలతో భరోసా దొరికింది. ఇక్కడ యేటా పునాసలో ఆన్‌‌ ఆఫ్‌‌ పద్ధతిలో నీటిని విడుదల చేస్తుంటారు.  ప్రాజెక్టులో నీటి లభ్యత ఉంటే తప్ప యాసంగికి నీళ్లు ఇవ్వరు. ఈసారి నాగార్జున సాగర్‌‌లోకి భారీగా వరద వస్తుండటంతో రెండు సీజన్లకు పుష్కలంగా నీళ్లందే అవకాశముంది. 2009 సెప్టెంబర్‌‌ నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో నాగార్జునసాగర్​లోని మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. 2013, 2014 సంవత్సరాల్లోనూ ప్రాజెక్టు పూర్తిగా నిండినా ఇంతస్థాయిలో వరద రాలేదు. గతేడాది సెప్టెంబర్‌‌ 2న రెండు గేట్లను ఎత్తిన అధికారులు పది నిమిషాల తర్వాత మూసేశారు. పదేండ్ల తర్వాత ఇప్పుడు మొత్తం 26 గేట్లను అధికారులు ఎత్తారు. సాగర్‌‌లోకి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటం, ఇదే స్థాయిలో మరికొన్ని రోజులు ప్రవాహాలు ఉండే అవకాశముండటంతో కృష్ణా నది నుంచి పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మీదుగా బంగాళాఖాతంలోకి నీళ్లు చేరే అవకాశముంది. కృష్ణా బేసిన్​ పరిధిలోని జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలతో ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలోని 6 లక్షల ఎకరాలకు పైగా సాగుభూమికి నీళ్లు అందనున్నాయి. ఈ జిల్లాలో నాలుగు వేలకు పైగా చెరువులను లిఫ్టులతో నింపడానికి ఇప్పటికే నీటిని ఎత్తిపోస్తున్నారు. మొత్తంగా కృష్ణా నీటితో మహబూబ్‌‌నగర్‌‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 12 లక్షల ఎకరాల నుంచి 15 లక్షల ఎకరాలకు నీళ్లు అందనున్నాయి.

గోదారమ్మ ప్రవాహమేది?

ఎగువ గోదావరిలో వరదలు లేక.. దాని పరిధిలోని ప్రాజెక్టులు వట్టిపోతున్నాయి. ముఖ్యంగా ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్​ ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహం లేదు. ఎస్సారెస్పీ మొత్తం ఆయకట్టు 16 లక్షల ఎకరాలు కాగా యేటా 6.50 లక్షల ఎకరాలకు మించి నీళ్లు అందడం లేదు. సరస్వతి కాలువ పరిధిలో 38 వేల ఎకరాలు, లక్ష్మీ కాలువ పరిధిలో 25,673 ఎకరాలు, మిగతా ఆయకట్టు కాకతీయ కాలువ పరిధిలో ఉంది. ఎస్సారెస్పీలోకి నీళ్లు రాకపోవడంతో ఈ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సీజన్‌‌లో ఎస్సారెస్పీలోకి 10.59 టీఎంసీల నీళ్లు మాత్రమే చేరాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకే ఈ నీళ్లు వచ్చాయి. అంతకు ముందు ప్రాజెక్టు మొత్తం ఎండిపోయి ఎడారిని తలపించింది. గతేడాది ఆగస్టు 24 నాటికి ఎస్సారెస్పీలోకి 70 టీఎంసీల నీళ్లు చేరాయి. ప్రాజెక్టులోకి 2,960 క్యూసెక్కుల వరద వస్తుండగా, మిషన్‌‌ భగీరథ అవసరాలకు 389 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.  గతేడాది ఆగస్టు నెలాఖరున ఆయకట్టుకు నీళ్లు వదిలారు. మహారాష్ట్రలోని గైక్వాడ్‌‌ ప్రాజెక్టు సామర్థ్యం 102.73 టీఎంసీలకు 93.76 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఎగువన వర్షాలు తగ్గడంతో ఆ ప్రాజెక్టు నిండి కింద మహారాష్ట్ర నిర్మించిన బ్యారేజీలను దాటి ఎస్సారెస్పీకి వరద రావడానికి మరికొన్నాళ్లు వేచి చూడక తప్పని పరిస్థితి. సింగూరు ప్రాజెక్టులో 0.46 టీఎంసీలు, నిజాంసాగర్‌‌లో 0.14 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మిడ్‌‌ మానేరులో 3.55 టీఎంసీలు, లోయర్‌‌ మానేరు డ్యామ్‌‌లో 3.53 టీఎంసీల నీళ్లున్నాయి. దిగువ గోదావరిలో వరద కొనసాగుతోంది. ఈ సీజన్‌‌లో కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు మాత్రమే పూర్తిగా నిండాయి. కడెం ప్రాజెక్టులో ఒక గేటు, ఎల్లంపల్లి ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.
అటు ఎగువ గోదావరిలో ప్రవాహం లేక ప్రధాన ప్రాజెక్టులు వెలవెలబోతుంటే.. ఇటు దిగువ గోదావరి పరిధిలోని  ప్రాజెక్టులకు భారీ వరదొచ్చినా నీటిని ఆపలేని పరిస్థితి నెలకొంది.